హ్యారీకి 100 కోట్ల వారసత్వ సంపద
తల్లి వీలునామా కింద అందుకోనున్న యువరాజు
లండన్: బ్రిటన్ ప్రిన్స్ హ్యారీ ఈ నెల 15న తన 30వ పుట్టినరోజు సందర్భంగా పెద్ద మొత్తంలో సంపదను అందుకోనున్నారు. 1997లో పారిస్లో జరిగిన కారు ప్రమాదంలో దుర్మరణంపాలైన తన తల్లి ప్రిన్సెస్ డయానా నుంచి వారసత్వంగా సుమారు
రూ. 100 కోట్ల సంపదను స్వీకరించనున్నారు. వీలునామాలో డయానా తన సంపదలో కొంత వాటాను ఇద్దరు కుమారులు ప్రిన్స్ విలియం, ప్రిన్స్ హ్యారీలకు 25 ఏళ్లు నిండాక పంచాలని పేర్కొన్నారు.
అయితే వీలునామా అమలుదారులు మాత్రం ఆ వయసును 30కి పెంచారు. దీంతో ఇప్పటివరకూ ఆ సంపదపై వడ్డీని పొందుతూ వచ్చిన హ్యారీ ఇక ఆ సంపదను కూడా పొందనున్నారు. ప్రిన్స్ హ్యారీ ప్రస్తుతం ఆర్మీ కెప్టెన్గా పనిచేస్తూ ఏటా దాదాపు రూ. 40 లక్షల వేతనం అందుకుంటున్నారు. 2012లో 30వ ఏట అడుగుపెట్టిన హ్యారీ సోదరుడు ప్రిన్స్ విలియమ్స్ ఇప్పటికే అతని వాటా సంపదను పొందాడు. ఈ వివరాలను ‘ద సండే టైమ్స్’ వెల్లడించింది.