బ్రిటన్ డైవర్స్ సంచలనం
డైవింగ్‌లో తొలిసారి స్వర్ణం
ప్రపంచ చాంపియన్స్‌పై
లాఫర్-మియర్స్ జోడీ గెలుపు
రియో డి జనీరో: డైవింగ్ ఈవెంట్లో మూడు స్వర్ణాలు నెగ్గి జోరుమీదున్న చైనాకు బ్రిటన్ డైవర్లు షాక్ ఇచ్చారు. పురుషుల సింక్రనైజ్డ్ 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డు ఫైనల్లో జాక్ లాఫర్-క్రిస్ మియర్స్ (బ్రిటన్) ద్వయం 454.32 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఒలింపిక్స్ డైవింగ్ చరిత్రలో బ్రిటన్‌కు లభించిన తొలి స్వర్ణం ఇదే కావడం విశేషం. లాఫర్-మియర్స్ విన్యాసాల ధాటికి ప్రపంచ చాంపియన్స్ జోడీ కావో యువాన్-కిన్ కాయ్ (చైనా-443.70 పాయింట్లు) కాంస్య పతకంతో సరిపెట్టుకుంది. సామ్ డోర్మాన్-మైక్ హిక్సాన్ (అమెరికా-450.21 పాయింట్లు) జోడీ రజత పతకాన్ని దక్కించుకుంది.
మృత్యువు అంచుల నుంచి...
ఏడేళ్ల క్రితం ఆస్ట్రేలియాలో జరిగిన పోటీల సందర్భంగా 23 ఏళ్ల క్రిస్ మియర్స్కు పొత్తి కడుపులో తీవ్ర గాయమైంది. అత్యవసర శస్త్రచికిత్స చేసినా అతను కోలుకోవడం కష్టమేనని వైద్యులు తేల్చారు. మూడు రోజులు కోమాలో ఉన్నాక మియర్స్ స్పృహలోకి వచ్చాడు. ఆ తర్వాత నెమ్మదిగా కోలుకున్నాడు. మళ్లీ ప్రాక్టీస్ మొదలుపెట్టి నమ్మశక్యంకాని రీతిలో రియోలో స్వర్ణం సాధించి ఔరా అనిపించాడు.
108 ఏళ్ల తర్వాత...
పురుషుల ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్ ఆల్‌రౌండ్ విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ కొహి ఉచిమురా మళ్లీ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫ్లోర్ ఎక్సర్సైజ్, పామెల్ హార్స్, రింగ్స్, వాల్ట్, పారలల్ బార్స్, హరిజాంటల్ బార్ ఈవెంట్స్‌లో నిలకడగా రాణించిన ఉచిమురా ఓవరాల్‌గా 92.365 పాయింట్లు స్కోరు చేసి పసిడి పతకాన్ని దక్కించుకున్నాడు. ఒలెగ్ వెర్నియెవ్ (ఉక్రెయిన్-92.266 పాయింట్లు) రజతం, మాక్స్ విట్లాక్ (బ్రిటన్-90.461 పాయింట్లు) కాంస్యం సాధించారు. ఆల్‌రౌండ్ విభాగంలో 108 ఏళ్ల తర్వాత బ్రిటన్‌కు పతకం రావడం ఇదే తొలిసారి కావడం విశేషం.
రోయింగ్‌లో జర్మనీ జోరు...
గురువారం రోయింగ్‌లో ఆరు స్వర్ణాల కోసం పోటీలు జరిగాయి. ఇందులో పురుషుల, మహిళల క్వాడ్రాపుల్ స్కల్స్ విభాగంలో జర్మనీ జట్టు స్వర్ణాలు సొంతం చేసుకుంది. రెండు కిలోమీటర్ల దూరాన్ని జర్మనీ పురుషుల జట్టు 6 నిమిషాల 06.81 సెకన్లలో... జర్మనీ మహిళల జట్టు 6 నిమిషాల 49.39 సెకన్లలో పూర్తి చేసి అగ్రస్థానంలో నిలిచాయి. పురుషుల పెయిర్స్ విభాగంలో న్యూజిలాండ్‌కు... డబుల్ స్కల్స్ విభాగంలో క్రొయేషియాకు... మహిళల డబుల్ స్కల్స్ విభాగంలో పోలాండ్‌కు... లైట్‌వెయిట్ పురుషుల ఫోర్స్ విభాగంలో స్విట్జర్లాండ్‌కు స్వర్ణాలు లభించాయి.
క్వార్టర్స్‌లో నాదల్
పురుషుల టెన్నిస్ సింగిల్స్ ఈవెంట్లో మూడో సీడ్ రాఫెల్ నాదల్ (స్పెయిన్), డెల్ పొట్రో (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. మూడో రౌండ్లో నాదల్ 7-6 (7/5), 6-3తో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్)పై, డెల్ పొట్రో 6-7 (4/7), 6-1, 6-2తో తారో డానియల్ (జపాన్)పై గెలిచారు. మహిళల టేబుల్ టెన్నిస్ (టీటీ) సింగిల్స్ విభాగంలో డింగ్ నింగ్ (చైనా) స్వర్ణం సాధించింది. ఫైనల్లో డింగ్ నింగ్ 4-3తో లి జియాజియా (చైనా)పై గెలిచింది. కాంస్య పతక పోరులో కిమ్ సాంగ్ (ఉత్తర కొరియా) 4-1తో ఫకుహరా (జపాన్)ను ఓడించింది.