థాయ్ కేవ్ ఆపరేషన్‌లో పాల్గొన్న ఓ బ్రిటీష్ డైవర్‌పై.. టెస్లా సీఈవో ఎలోన్ మస్క్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. సదరు డైవర్ అసలు సహాయక చర్యల్లో పాల్గొనలేదని.. పైగా అతను చిన్నారులను లైంగికంగా వేధించే వ్యక్తి అంటూ సంచలన ఆరోపణలు చేశాడు. థాయ్ కేవ్ ఆపరేషన్‌లో భాగంగా వైల్డ్ బోర్ అనే డైవర్స్ టీం సహాయక చర్యల్లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ బృందంలో బ్రిటీష్ డైవర్ వెర్నోన్ అన్స్‌వోర్త్ కూడా ఉన్నారు(మ్యాపింగ్ రూట్ సమాచారం అందించటం...).
టెస్లా తరపున సహాయక చర్యల కోసం మస్క్.. జలంతర్గాములను పంపించాడు. అయితే అవి చాలా చిన్నవిగా ఉన్నాయని, ఆపరేషన్‌కి పనికి రాలేదని, ఆ విషయం తెలిసికూడా టెస్లా కేవలం ప్రచార ఆర్భాటం కోసమే వాటిని పంపిందని వెర్నోన్ పేర్కొన్నారు. దీంతో మండిపోయిన మస్క్.. వెర్నోన్‌ను విమర్శిస్తూ ఆదివారం సోషల్ మీడియాలో వరుస పోస్టులు చేశారు. ‘మా సబ్‌మెరెన్‌లు పనికి రావని ఆ పెద్ద మనిషి అన్నారు. కానీ, ఆయన సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు ఎక్కడా కనిపించలేదు. కేవలం ప్రచారం కోసమే ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటారు. ఆయన గురించి ఓ ఆసక్తికర విషయం కూడా నాకు ఈ మధ్యే తెలిసింది. ఆయనొక పెడో. (పెడో.. పైడోఫిలేకి సంక్షిప్త రూపం.. పిల్లల్ని ప్రలోభ పెట్టి లైంగికంగా వాడుకోవటం). అలాంటి వ్యక్తి చేసే పనికిమాలిన కామెంట్లను పట్టించుకోవటం.. మాకు అవమానం’ అంటూ వరుసగా ట్వీట్లు చేశాడు.
అయితే ఈ విషయంలో వెర్నోన్‌కే మద్ధతుగా చాలా మంది నిలిచారు. మస్క్‌ను విమర్శిస్తూ పెద్ద ఎత్తున్న పోస్టులు వెల్లువెత్తటంతో చివరకు మస్క్ ఆయా ట్వీట్లను డిలేట్ చేశారు. ఇక ఈ విషయంపై అన్స్‌వోర్త్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీడియా కథనాల ద్వారానే ఈ విషయం నాకు తెలిసింది. మస్క్‌పై న్యాయపరమైన చర్యలు తీసుకోబోతున్నా’ అని వెల్లడించారు.
భారీ నష్టాలు.. ఇదిలా ఉంటే మస్క్ చేసిన ట్వీట్లు టెస్లా మార్కెట్‌పై తీవ్ర ప్రభావం చూపాయి. సోమవారం దాదాపు 4 శాతానికిపైగా షేర్లు పడిపోవటంతో 295 మిలియన్ డాలర్ల మేర నష్టం చవిచూడాల్సి వచ్చింది. ఆటోమేకర్ రంగంలో దిగ్గజం అయిన టెస్లా.. ఎలోన్ మస్క్ నిర్ణయాలు, ప్రవర్తన మూలంగా ఏడాది కాలంలో 2 బిలియన్ డాలర్ల నష్టం చవిచూడాల్సి వచ్చింది. కాగా, ఎలోన్.. టెస్లా కొంప ముంచుతున్నాడంటూ బోర్డు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment