రిక‘వర్రీ’
మోర్తాడ్: మండలంలోని నాలుగు గ్రామాల రైతుల వద్ద పెద్ద ఎత్తున ధాన్యం కొనుగోలు చేసి పరారైన దళారీ సలీంను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. అయితే రైతులకు సంబంధించిన ధాన్యం సొమ్ము మాత్రం పూర్తిగా రికవరీ కాలేక పోయింది. ఏర్గట్ల, బట్టాపూర్, తొర్తి, తిమ్మాపూర్ గ్రామాలకు చెందిన రైతుల వద్ద వరి ధాన్యం కొనుగోలు చేసిన సలీం, వారికి రూ.40.59 లక్షలు చెల్లించాల్సి ఉంది. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధాన్యాన్ని రైస్‌మిల్లర్లకు విక్రయించిన సలీం వారికి సొమ్ము చెల్లించకుండా పరారీ అయ్యాడు. దీంతో ఆందోళన చెందిన రైతులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసుకుని వారు దర్యాప్తు ప్రారంభించారు.
సలీం సెల్ సిగ్నల్స్ ఆధారంగా పరారీ అయిన తరువాత రెండు మూడు రోజుల్లోనే పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. సలీంను వెంటనే రిమాండ్ చేస్తే రైతులకు సంబంధించిన సొమ్ము రికవరీ కాదని భావించిన అధికారులు తమదైన శైలిలో సలీంను విచారించి సొమ్మును రికవరీ చేయడానికి చర్యలు తీసుకున్నారు. తాను గతంలో చేసిన వ్యాపారం వల్ల నష్టపోయానని అందుకు సంబంధించిన అప్పులు ధాన్యం సొమ్ముతో తీర్చినట్లు సలీం విచారణలో వెల్లడించినట్లు తెలిసింది. అంతేకాక కుటుంబ పోషణ కోసం ఎక్కువగా ఖర్చు చేసిన సలీం రైతుల సొమ్ము నుంచి ఆ ఖర్చులకు డబ్బును వినియోగించినట్లు పోలీసులకు వెల్లడించినట్లు సమాచారం.
సలీం వద్ద లభించిన నగదుతోపాటు రైస్‌మిల్లర్ల వద్ద రావాల్సిన సొమ్మును, అతని డీసీఎం వాహనం, ఇతర సామాగ్రిని విక్రయించడంతో రూ. 11.75 లక్షలు మాత్రమే రికవరీ అయ్యింది. ఈ సొమ్మును పోలీసులు రైతుల ప్రతినిధులకు అప్పగించారు. రైతులే సొమ్మును పంచుకోవాలని సూచించారు. లక్ష రూపాయల విలువ చేసే ధాన్యాన్ని అమ్మిన రైతుకు రూ. 30.5వేలు మాత్రమే చేతికి అందాయి. రికవరీ అయిన సొమ్మును రైతులకు అప్పగించగా వారు ధాన్యం లెక్కలు తీసి వాటాలను పంచుకున్నారు. అయితే 50 శాతం సొమ్ము కూడా చేతికి అందకపోవడంతో రైతులు నిట్టూర్పు విడుస్తున్నారు.
నిబంధనల ప్రకారం వ్యవహరిస్తే రైతులకు ధాన్యం సొమ్ము ఇప్పట్లో చేతికి అందేఅవకాశం లేదు. అందువల్ల ఉన్నతాధికారుల సూచన మేరకు రికవరీ అయిన సొమ్మును రైతుల ప్రతినిధులకు అందించినట్లు పోలీసులు తెలిపారు. రైతులకు న్యాయం చేయడం కోసం తాము ఎంతో కృషి చేశామని అన్ని కోణాల్లో విచారించిన తరువాతనే రికవరీ సొమ్మును వారికి అందించామని పోలీసులు చెబుతున్నారు. కాగా రైతులు మాత్రం తమకు న్యాయం జరగలేదని గగ్గోలు పెడుతున్నారు.