'కుంటాల'లో అన్నదమ్ముల మృతదేహాలు
నేరేడుగొండ (ఆదిలాబాద్) : ప్రకృతి అందాలకు నెలవైన కుంటాల జలపాతంలో ఘోరం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులు జలపాతంలో మృతదేహాలుగా తేలారు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా నేరేడుగొండ మండలం కుంటాల జలపాతంలో సోమవారం జరిగింది. వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా దోమకొండ మండల కేంద్రానికి చెందిన సంతోష్(25), అంబాదాస్(22)లు ఇద్దరు అన్నదమ్ములు. కాగా వారిద్దరు కలిసి మూడు రోజుల కిందట బైక్ మీద కుంటాల జలపాతం వద్దకు వచ్చారు.
అయితే అప్పటి నుంచి ద్విచక్రవాహనం అక్కడే ఉండటంతో సోమవారం కొంతమంది జాలర్లు జలపాతంలోకి వెళ్లి చూడగా... ఇద్దరు యువకుల మృతదేహాలు కనిపించాయి. వాటిని వెలికి తీసిన పోలీసులు సంతోష్, అంబాదాస్లుగా గుర్తించారు. వీరు కుంటాల జలపాతం అందాలు వీక్షించడానికి వెళ్లారా లేక ఆత్మహత్య చేసుకున్నారా.. లేక జారిపడి ప్రమాదవశాత్తు మృతి చెందారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు.