గంగను చేరె.. ‘ఘన’పతి
రెండో రోజూ కొనసాగిన నిమజ్జనం
9 గంటలకు పైగా ఖైరతాబాద్ గణపతి శోభాయాత్ర
రేపు మహా లడ్డూ పంపిణీ
అణువణువూ గణేషుడి నామ స్మరణే. అడుగడుగునా వినాయకుని రూపమే. దారి పొడవునా వేలాది జనాల నీరాజనాలు అందుకుంటూ... అంతే స్థాయిలో తరలివచ్చిన విగ్రహాల తోడుగా... సోమవారం రాత్రి 10.10గంటలకు ఖైరతాబాద్ త్రిశక్తిమయ మోక్ష గణపతి గంగమ్మ ఒడిలో విశ్రమించాడు.
సిటీబ్యూరో/ఖైరతాబాద్ /బన్సీలాల్‌పేట్: అదే ఉత్సాహం. అదే ఉరవడి. వేలాదిగా తరలివచ్చిన భక్తజనంతో.. వినాయక విగ్రహాలతో ట్యాంక్ బండ్, నెక్లెస్ రోడ్డు పరిసరాలు పోటెత్తాయి. ‘జై బోలో గణేశ్ మహారాజ్‌కీ...’ అంటూ సాగిన నిమజ్జన మహాయాత్ర రెండో రోజు సోమవారం రాత్రి వరకు కొనసాగింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనానికి తరలివచ్చాయి. మరోవైపు ఖైరతాబాద్ త్రిశక్తిమయ గణపతి శోభాయాత్ర మధ్యాహ్నం ఒంటిగంటకు ప్రారంభమైంది. సాయంత్రం 6 గంటల సమయంలో ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుంది. ఆదివారమే తరలించాలని భావించినప్పటికీ భక్తుల రద్దీ, పోలీసుల అనుమతి లభించకపోవడంతో ఈ శోభాయాత్ర సోమవారానికి వాయిదా పడింది. మహా గణపతి దర్శనానికి పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు. ఆధ్మాతిక గీతాలు, నినాదాలతో శోభాయాత్ర సాగింది.
రికార్డు స్థాయిలో...
సాగర్‌లో ఆదివారం నుంచి సోమవారం వరకు ఏకధాటిగా 32 గంటల పాటు నిమజ్జనోత్సవం సాగింది. ఈ ఏడాది నవరాత్రి ఉత్సవాలు ప్రారంభించిన నాటి నుంచి చివరి రోజు వరకూ రికార్డు స్థాయిలో 13,600 వినాయక విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఆదివారం ఉదయం 10 నుంచి సోమవారం సాయంత్రం 6 గంటల వరకు హుస్సేన్ సాగర్‌లో 5,720 పెద్ద విగ్రహాలను నిమజ్జనం చేశారు. ఇవి కాకుండా చిన్న చిన్నవి, కుటుంబాలతో తరలి వచ్చిన భక్తులు నిమజ్జనం చేసిన విగ్రహాలన్నీ కలిపి 25 వేలు దాటి ఉండవచ్చునని పోలీసుల అంచనా.
ట్రాఫిక్‌తో జనం ఇక్కట్లు
గణేష్ నిమజ్జనం సోమవారం కూడా కొనసాగడంతో వాహన చోదకులు ఇబ్బంది పడ్డారు. ట్యాంక్‌బండ్‌పై నిమజ్జనం కొనసాగడంతో చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలు ట్రాఫిక్ రద్దీతో ఇక్కట్లు ఎదుర్కొన్నారు. ట్యాం క్బండ్ పరిసర ప్రాంతాలైన కవాడిగూడ, లోయర్ ట్యాంక్‌బండ్, ఇందిరాపార్కు, ముషీరాబాద్, కర్బలామైదాన్ తదితర ప్రాంతాల్లో వాహన చోదకులు... పాదచారులు... ఉద్యోగులు తీవ్ర అవస్థలు పడ్డారు.
చెత్త తరలింపు ముమ్మరం
1345 మెట్రిక్‌టన్నుల వ్యర్థాల తరలింపు
సిటీబ్యూరో: గణేశ్ నిమజ్జనం సందర్భంగా ప్రత్యేక బృందాలతో చెత్త తరలింపు పనులు చేపట్టిన జీహెచ్ఎంసీ..సోమవారం సాయంత్రం వరకు 1345 మెట్రిక్‌టన్నుల చెత్తను నగర రహదారుల మీదినుంచి డంపింగ్‌యార్డుకు తరలించింది. సోమవారం రాత్రి వరకు నిమజ్జనం జరుగుతున్నందున మంగళవారం ఉదయానికే చెత్త లేకుండా రహదారులను శుభ్రంగా ఉంచేందుకు ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. మంగళవారం జరుగనున్న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా ఈ ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు జీహెచ్ఎంసీ ఒక ప్రకటనలో తెలిపింది.