BS Chauhan
-
జమిలికి టీఆర్‘ఎస్’
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభలకు ఏకకాలంలో ఎన్నికల నిర్వహణకు తమ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని టీఆర్ఎస్ స్పష్టం చేసింది. ఈ మేరకు పార్టీ అభిప్రాయాలపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు న్యాయ శాఖ కమిషన్ చైర్మన్ బీఎస్ చౌహాన్‌కు లేఖ రాశారు. ఎంపీ వినోద్‌కుమార్ ఆదివారం ఢిల్లీలో లా కమిషన్ సమావేశానికి హాజరై సీఎం రాసిన లేఖను ఆయనకు అందజేశారు. లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు విడిగా ఎన్నికలు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆటంకం ఏర్పడుతుందని ఆ లేఖలో సీఎం పేర్కొన్నారు. లోక్‌సభ, అసెంబ్లీలకు విడిగా ఎన్నికల వల్ల ప్రతిసారీ 4 నుంచి 6 నెలల పాటు అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల పనుల్లో గడపాల్సి వస్తోందని, దీనివల్ల రాష్ట్రాల్లో ప్రజాధనం వృథా అవుతోందని వివరించారు. అంతేకాకుండా ఐదేళ్ల కాలంలో రాజకీయ పార్టీలు, అభ్య ర్థులు రెండుసార్లు ఎన్నికల వ్యయాన్ని భరించాల్సి వస్తోందన్నారు. అధికార యంత్రాంగం మొత్తం ఏడాది కాలంపాటు ఎన్నికల నిర్వహణ పనుల్లో నిమగ్నమవుతోందని, ఎన్నికల కోడ్ వల్ల ఎలాంటి సంక్షేమ పథకాలను అమలు చేయని పరిస్థితులు ఉత్పన్నమవుతున్నాయని వివరించారు. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని దేశంలో లోక్‌సభ, శాసనసభలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించడమే ఉత్తమ మార్గం అని లేఖలో సీఎం వివరించారు. లోక్‌సభతోపాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై అధ్యయనంలో భాగంగా లా కమిషన్ అన్ని రాజకీయ పక్షాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్న సంగతి తెలిసిందే. గతంలోనే న్యాయశాఖ నివేదిక ఇచ్చింది: వినోద్ దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలన్నది ప్రధాని మోదీ, నీతి ఆయోగ్‌ల అజెండా కాదని, 1983లోనే దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని లా కమిషన్ నివేదిక ఇచ్చినట్లు సమావేశం అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ మీడియాకు వివరించారు. ‘‘కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఏర్పడ్డాక మళ్లీ లోక్‌సభ ఎన్నికలకు సిద్ధమవ్వాల్సిన పరిస్థితి. లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా కేంద్రంలోని ప్రభుత్వాలు మళ్లీ ఏటా ఇతర రాష్ట్రాల్లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి. దీంతో ఎంతో సమయం, ప్రజాధనం వృథా అవుతోంది. దీన్ని అరికట్టేందుకు దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలి. ఇందుకు టీఆర్ఎస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుంది’’అని వినోద్ పేర్కొన్నారు. -
బీసీసీఐ ప్రజా సంస్థే: లా కమిషన్
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి మింగుడు పడని నిర్ణయాన్ని లా కమిషన్ తీసుకుంది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన ఈ క్రికెట్ బోర్డు ప్రజా సంస్థ అని తేల్చింది. సమాచార హక్కు (ఆర్టీఐ) పరిధిలోకి తీసుకురావాలని సిఫారసు చేయనుంది. కేంద్ర ప్రభుత్వం లా కమిషన్ సిఫారసులను ఆమోదిస్తే, ఆర్టీఐ చట్టపరిధిలోకి బోర్డు వస్తే... కోర్టుల్లో ఇక ప్రజాప్రయోజన వ్యాజ్యాలు (పిల్) వెల్లువెత్తుతాయి. జట్ల సెలక్షన్, ఆటగాళ్లను ఏ ప్రాతిపదికన తీసుకున్నారని పిల్ దాఖలు చేసే అవకాశాలుంటాయి. జస్టిస్ బి.ఎస్.చౌహాన్ చైర్మన్‌గా వ్యవహరిస్తున్న లా కమిషన్... బోర్డు, ఆటగాళ్లకు అందుతున్న పురస్కారాలను ఈ సందర్భంగా విశ్లేషించింది. దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు తమ జెర్సీలపై త్రివర్ణాలను, హెల్మెట్లపై అశోక ధర్మచక్రాన్ని ప్రముఖంగా ధరిస్తున్నారని, వారు సాధించిన ఘనతలకు భారత ప్రభుత్వం అత్యున్నత పౌరపురస్కారాలను, పన్ను మినహాయింపులను, ప్రోత్సాహకాలను అందిస్తోందని... కాబట్టి దీన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్‌గా చూడలేమని, ప్రభుత్వ సంస్థే అవుతుందని కమిషన్ తమ సిఫారసులో పేర్కొంది. -
మరణ శిక్ష దోషికి.. 30 ఏళ్ల జైలు!
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం అత్యంత పాశవికంగా హత్య చేసి, సాక్ష్యాధారాలను సైతం లేకుండా చేసిన తమిళనాడుకు చెందిన వ్యక్తికి ట్రయల్ కోర్టు సహా మద్రాస్ హైకోర్టు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషిని కనీసం 30 ఏళ్లపాటు జైల్లో ఉంచాలన్న కోర్టు శిక్షా కాలాన్ని ఎట్టిపరిస్థితిలోనూ కుదించరాదరని(రెమిషన్ లేకుండా) పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టులు నమోదు చేసిన అంశాలను పరిశీలించాక దీనిలో తాము జోక్యం చేసుకోడానికి అనువైన కారణం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయినప్పటికీ, నిజానిజాలు, కేసు పూర్వాపరాలను పరిశీలించాక మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు.