న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం అత్యంత పాశవికంగా హత్య చేసి, సాక్ష్యాధారాలను సైతం లేకుండా చేసిన తమిళనాడుకు చెందిన వ్యక్తికి ట్రయల్ కోర్టు సహా మద్రాస్ హైకోర్టు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషిని కనీసం 30 ఏళ్లపాటు జైల్లో ఉంచాలన్న కోర్టు శిక్షా కాలాన్ని ఎట్టిపరిస్థితిలోనూ కుదించరాదరని(రెమిషన్ లేకుండా) పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టులు నమోదు చేసిన అంశాలను పరిశీలించాక దీనిలో తాము జోక్యం చేసుకోడానికి అనువైన కారణం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయినప్పటికీ, నిజానిజాలు, కేసు పూర్వాపరాలను పరిశీలించాక మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు.