The Madras High Court
-
పాఠశాలల్లో నిఘా నేత్రాలు
సాక్షి, చెన్నై : ప్రభుత్వ పాఠశాలల్లో నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాలని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు నిఘా నేత్రాల ఏర్పాటును తప్పని సరిచేస్తూ, అందుకు తగ్గ పరిశీలనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను రెండు నెలల సమయాన్ని కేటాయించింది. ఇటీవల స్కూళ్లలో, పరిసరాల్లో నేరాలు తాండవిస్తున్నాయి. ఉపాధ్యాయులపై దాడి చేయడం, సహచర విద్యార్థులు గొడవకు దిగ డం, కత్తులతో నరుక్కోవడం, విద్యార్థినులపై యాసిడ్ దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి. అలాగే, విద్యార్థుల కిడ్నాప్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చి వస్తున్నాయి. ఇటీవల అతి పెద్ద కిడ్నా ప్ రాకెట్ ముఠా కోసం సాగుతున్న విచారణలో అనేక మంది స్కూలు విద్యార్థులను పట్టుకెళ్లినట్టు తేలింది. ప్రైవేటు పాఠశాలల పరిసరాల్లో ఉన్నట్టుగానే, ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి, పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కల్పించాలని, శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును మదురైకు చెందిన కేకే.రమేష్ అనే సామాజిక కార్యకర్త ఆశ్రయించాడు. నిఘా నేత్రాలు తప్పని సరి తన పిటిషన్లో ఇటీవల కాలంగా సాగిన అనేక ప్రధాన ఘటనలను వివరించారు. ఉపాధ్యాయుల మీద సాగుతున్న దాడుల కేసుల్లో నింధితుల్ని అరెస్టు చేయడం పోలీసులకు కష్టతరంగా మారి ఉన్నాయని పేర్కొన్నారు. తరగతి గదిలోనే ఓ విద్యార్థి చేతులు నరకడం, మరో చోట హతమార్చడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తుచేశారు. ఓ విద్యార్థిని అదృశ్యం అయితే, చివరకు స్నేహితురాలే ఆమెను కడతేర్చినట్టు కొంతకాలం తర్వాత వెలుగు చూసిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో చోటు చేసుకుని ఉన్నాయని వివరించారు. విద్యార్థుల భద్రతను, పాఠశాలల పరిసరాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు. ఈ సీసీ కెమెరాలను ఆయా పోలీసు స్టేషన్ల పరిధుల్లోని కంట్రోల్ రూంలకు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. తాను ఇదే విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం అని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్‌కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషనర్ తరపు వాదనల్ని, పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయ పడింది. ఆ మేరకు నిఘా నేత్రాల ఏర్పాటు తప్పని సరి చేస్తూ, అందుకు తగ్గ పరిశీలనలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను రెండు నెలల సమయాన్ని న్యాయమూర్తులు కేటాయించారు. -
నీరుగారిన పవన విద్యుత్
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లా ఆరల్వాయ్మొళి, నెల్లై జిల్లా మూపందల్ పరిసర గ్రామాలు, కోవై, తేని, దిండుగల్లు తదితర ప్రాంతాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. 7వేల నుంచి 9 వేల మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రెండురోజుల క్రితం కేవలం 280 మెగావాట్ల స్థాయిలో మాత్రమే గాలి వీయగా, గురువారం వీచిన గాలుల ప్రకారం వీటి ద్వారా 1300 మెగావాట్ల ఉత్పత్తి కావాల్సి ఉంది. రాబోయే రోజుల్లో 4వేల నుంచి 6 వేల మెగావాట్ల ఉత్పత్తిని చేసుకోవచ్చు. మే నుంచి అక్టోబరు వరకు బలమైన గాలులు వీస్తుంటాయి. సగటున నిమిషానికి 3 మీటర్ల వేగంతో గాలులు వీస్తేనే పవన విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. కానీ 2 మీటర్ల వేగంతో గాలులు వీచినా, ఉత్పత్తి సాధ్యమయ్యేలా అక్కడ ఫ్యాన్లు అమర్చారు. అయితే గాలుల వేగం పెరిగినా విద్యుత్ ఉత్పత్తిని వేగిరం చేయడం సాధ్యం కావడం లేదు. ఉత్పత్తై విద్యుత్‌ను నిల్వచేసుకునే ఏర్పాట్లు మృగ్యమైపోయాయి. ఈ కారణంగా 2 గంటల నుంచి 24 గంటల సమయంలో అప్పుడప్పుడు ఉత్పత్తి యంత్రాలను నిలిపివేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఒక అధికారి మాట్లాడుతూ, పవన్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పంపింగ్ చేసే సామర్థ్యం పూర్తి స్థారుులో లేదని అన్నారు. ఈ కారణంతో బలమైన గాలులు వీస్తున్నా యంత్రాలను నిలిపివేస్తున్నామని చెప్పారు. దీనివల్ల 100 మెగావాట్లకు గానూ 30 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి అనేక జిల్లాల్లోని పవన విద్యుత్ కేంద్రాల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వాధికారులూ బాధితులే... నగరంలో అప్రకటిత విద్యుత్ ప్రజానీకాన్నేకాదు.ప్రభుత్వ కార్యాలయాలనూ బాధిస్తోంది. కరెంట్ కోతలపై విసుగెత్తిన అధికారులు సంబంధిత శాఖను నిందిస్తుండగా, ప్రజాపనుల శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ విద్యుత్‌శాఖ ఫిర్యాదుకు సిద్ధమవుతోంది.నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇటీవల అప్రకటిత కోతను ఎదుర్కొంటున్నాయి. కరెంటు రాకపోకల సంగతి దేవుడేకే ఎరుక అనేరీతిలో సరఫరా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సచివాలయం, ఆస్పత్రులు, న్యాయస్థానాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాలు ఇలా వీటన్నింటికీ నిరంతర విద్యుత్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతను ప్రజాపనుల శాఖకు అప్పగించారు. ప్రత్యేక సబ్స్టేషన్ల ఏర్పాటుతో విద్యుత్ కోతకు తావులేకుండా ఏర్పాట్లు చేశారు. చెన్నైలోని రాజీవ్ ప్రభుత్వ ప్రజా వైద్యశాల, సెంట్రల్ రైల్వేస్టేషన్, పక్కనే ఉన్న మూర్ మార్కెట్ల కోసం 33 కిలోవాట్ల సామర్థ్యంగల సబ్‌స్టేషన్, మద్రాసు హైకోర్టు, బ్రాడ్వే బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలకు 110 కిలోవాట్ల సబ్‌స్టేషన్, సెక్రటేరియట్, చింతాద్రిపేటలకు 110 కిలోవాట్ల సబ్‌స్టేషన్, సెక్రటేరియట్ అనుబంధ కార్యాలయాలకు 33 కిలోవాట్ల సబ్స్టేషన్ల ద్వారా ప్రత్యేక లైన్ ఏర్పాట్లు ఉన్నాయి. వీటి ద్వారా 24 గంటల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. అయినా ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు విద్యుత్‌కోతలు తప్పడం లేదు. ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ పోవడం వల్ల రోగి మృతి చెందాడు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కోతలపై చర్చ జరుగుతున్న సమయంలో మద్రాసు హైకోర్టులో విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. విద్యుత్ సరఫరా పర్యవేక్షణను ప్రజాపనుల శాఖకు అప్పగించినా నిందలు మాత్రం తమకు తప్పడం లేదని విద్యుత్ అధికారులు వాపోతున్నారు. ప్రభుత్వ పరిధిలోని అన్ని సర్వీసులకు నిరంతర విద్యుత్ అందించేలా ప్రజాపనుల శాఖకు చెందిన ఏఈలకు బాధ్యతలు అప్పగించామని, ఈ విషయం తెలిసికూడా తమనే నిందిస్తున్నారని ఈ వివాదంపై విద్యుత్‌శాఖాధికారి వ్యాఖ్యానించారు. 24 గంటల విద్యుత్‌లో ఏదైనా లోపం జరిగినపుడు సదరు ఏఈ వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. అతని నిర్లక్ష్యంతో తమశాఖ అప్రతిష్ట పాలైందని చెప్పారు. దీనిపై లిఖిత పూర్వకంగా ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నామని ఆయన తెలిపారు. -
మరణ శిక్ష దోషికి.. 30 ఏళ్ల జైలు!
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి, అనంతరం అత్యంత పాశవికంగా హత్య చేసి, సాక్ష్యాధారాలను సైతం లేకుండా చేసిన తమిళనాడుకు చెందిన వ్యక్తికి ట్రయల్ కోర్టు సహా మద్రాస్ హైకోర్టు విధించిన మరణ శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. దోషిని కనీసం 30 ఏళ్లపాటు జైల్లో ఉంచాలన్న కోర్టు శిక్షా కాలాన్ని ఎట్టిపరిస్థితిలోనూ కుదించరాదరని(రెమిషన్ లేకుండా) పేర్కొంది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ బీఎస్ చౌహాన్, జస్టిస్ జె.చలమేశ్వర్, జస్టిస్ ఎం.వై. ఇక్బాల్‌లతో కూడిన ధర్మాసనం ఇటీవల తీర్పునిచ్చింది. ఈ కేసుకు సంబంధించి కింది కోర్టులు నమోదు చేసిన అంశాలను పరిశీలించాక దీనిలో తాము జోక్యం చేసుకోడానికి అనువైన కారణం లేదని న్యాయమూర్తులు పేర్కొన్నారు. అయినప్పటికీ, నిజానిజాలు, కేసు పూర్వాపరాలను పరిశీలించాక మరణ శిక్షను జీవిత ఖైదుగా మార్చాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడ్డారు. -
ఈసీకి హైకోర్టు నోటీసు
టీనగర్, న్యూస్‌లైన్: ఎన్నికల చిహ్నం కోరుతూ మనిదనేయ మక్కల్ కట్చి, పుదియ తమిళగం దాఖలు చేసిన కేసుకు సంబంధించి ఎన్నికల కమిషన్‌కు మద్రాసు హైకోర్టు నోటీసులు పంపింది. మద్రాసు హైకోర్టులో మనిదనేయ మక్కల్ కట్చి అధ్యక్షుడు జేఎస్ రిపాయి దాఖలు చేసిన పిటిషన్లో ఈ విధంగా తెలిపారు. భారత ఎన్నికల కమిషన్‌లో తమ పార్టీ 2009లో నమోదైందని ఆనాటి నుంచి ఎన్నికలలో పోటీ చేస్తున్నామని తెలిపారు. ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు ఏప్రిల్ 24న జరగనున్నాయని ఈ ఎన్నికలలో డీఎంకే, వీసీకే పార్టీలతో తమ పార్టీ కూటమి ఏర్పాటు చేసుకుని మైలాడుదురై పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేస్తోందన్నారు. ఈ నియోజకవర్గంలో తమ పార్టీ తరపున సీనియర్ నేత ఎస్ హైదర్ అలీ పోటీ చేస్తున్నట్టు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించారన్నారు. అందువల్ల జరగనున్న పార్లమెంటు ఎన్నికలల్లోనూ అదే చిహ్నాన్ని కేటాయించాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు గత 17వ తేదీ విజ్ఞప్తి చేసింది. ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. అందువల్ల తమ పార్టీకి కొవ్వొత్తి చిహ్నం కేటాయించాలని ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ పిటిషన్ న్యాయమూర్తులు ఎన్.పాల్ వసంతకుమార్, ఎం.సత్యనారాయణన్ ఎదుట శుక్రవారం విచారణకు వచ్చింది. విచారణ జరిపిన న్యాయమూర్తులు ఈ పిటిషన్‌కు వచ్చే ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇచ్చారు. అలాగే తెన్కాశి నియోజకవర్గంలో పోటీ చేస్తున్న పుదియ తమిళగం పార్టీకి టెలివిజన్ చిహ్నం కేటాయించాలంటూ ఆ పార్టీ తరపున హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తులు పాల్ వసంతకుమార్, సత్యనారాయణన్, ఏప్రిల్ 1వ తేదీలోగా సంజాయిషీ ఇవ్వాలంటూ భారత ఎన్నికల కమిషన్‌కు ఉత్తర్వులు ఇచ్చారు.