నీరుగారిన పవన విద్యుత్
చెన్నై, సాక్షి ప్రతినిధి : రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లా ఆరల్వాయ్‌మొళి, నెల్లై జిల్లా మూపందల్ పరిసర గ్రామాలు, కోవై, తేని, దిండుగల్లు తదితర ప్రాంతాల్లో పవన విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలున్నాయి. 7వేల నుంచి 9 వేల మెగావాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం ఉంది. రెండురోజుల క్రితం కేవలం 280 మెగావాట్ల స్థాయిలో మాత్రమే గాలి వీయగా, గురువారం వీచిన గాలుల ప్రకారం వీటి ద్వారా 1300 మెగావాట్ల ఉత్పత్తి కావాల్సి ఉంది.
రాబోయే రోజుల్లో 4వేల నుంచి 6 వేల మెగావాట్ల ఉత్పత్తిని చేసుకోవచ్చు. మే నుంచి అక్టోబరు వరకు బలమైన గాలులు వీస్తుంటాయి. సగటున నిమిషానికి 3 మీటర్ల వేగంతో గాలులు వీస్తేనే పవన విద్యుత్ ఉత్పత్తి సాధ్యమవుతుంది. కానీ 2 మీటర్ల వేగంతో గాలులు వీచినా, ఉత్పత్తి సాధ్యమయ్యేలా అక్కడ ఫ్యాన్లు అమర్చారు. అయితే గాలుల వేగం పెరిగినా విద్యుత్ ఉత్పత్తిని వేగిరం చేయడం సాధ్యం కావడం లేదు.
ఉత్పత్తై విద్యుత్‌ను నిల్వచేసుకునే ఏర్పాట్లు మృగ్యమైపోయాయి. ఈ కారణంగా 2 గంటల నుంచి 24 గంటల సమయంలో అప్పుడప్పుడు ఉత్పత్తి యంత్రాలను నిలిపివేస్తున్నారు. ఈ పరిస్థితిపై ఒక అధికారి మాట్లాడుతూ, పవన్ విద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తిని పంపింగ్ చేసే సామర్థ్యం పూర్తి స్థారుులో లేదని అన్నారు. ఈ కారణంతో బలమైన గాలులు వీస్తున్నా యంత్రాలను నిలిపివేస్తున్నామని చెప్పారు. దీనివల్ల 100 మెగావాట్లకు గానూ 30 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోందని పేర్కొన్నారు. ఇదే పరిస్థితి అనేక జిల్లాల్లోని పవన విద్యుత్ కేంద్రాల్లో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వాధికారులూ బాధితులే...
నగరంలో అప్రకటిత విద్యుత్ ప్రజానీకాన్నేకాదు.ప్రభుత్వ కార్యాలయాలనూ బాధిస్తోంది. కరెంట్ కోతలపై విసుగెత్తిన అధికారులు సంబంధిత శాఖను నిందిస్తుండగా, ప్రజాపనుల శాఖ సిబ్బంది నిర్లక్ష్యమే కారణమంటూ విద్యుత్‌శాఖ ఫిర్యాదుకు సిద్ధమవుతోంది.నగరంలోని ప్రభుత్వ కార్యాలయాలు సైతం ఇటీవల అప్రకటిత కోతను ఎదుర్కొంటున్నాయి. కరెంటు రాకపోకల సంగతి దేవుడేకే ఎరుక అనేరీతిలో సరఫరా సాగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని సచివాలయం, ఆస్పత్రులు, న్యాయస్థానాలు, జిల్లా కలెక్టర్ కార్యాలయాలు, రెవెన్యూ కార్యాలయాలు ఇలా వీటన్నింటికీ నిరంతర విద్యుత్ సరఫరా పర్యవేక్షణ బాధ్యతను ప్రజాపనుల శాఖకు అప్పగించారు. ప్రత్యేక సబ్‌స్టేషన్ల ఏర్పాటుతో విద్యుత్ కోతకు తావులేకుండా ఏర్పాట్లు చేశారు. చెన్నైలోని రాజీవ్ ప్రభుత్వ ప్రజా వైద్యశాల, సెంట్రల్ రైల్వేస్టేషన్, పక్కనే ఉన్న మూర్ మార్కెట్‌ల కోసం 33 కిలోవాట్ల సామర్థ్యంగల సబ్‌స్టేషన్, మద్రాసు హైకోర్టు, బ్రాడ్‌వే బస్‌స్టేషన్ పరిసర ప్రాంతాలకు 110 కిలోవాట్ల సబ్‌స్టేషన్, సెక్రటేరియట్, చింతాద్రిపేటలకు 110 కిలోవాట్ల సబ్‌స్టేషన్, సెక్రటేరియట్ అనుబంధ కార్యాలయాలకు 33 కిలోవాట్ల సబ్‌స్టేషన్ల ద్వారా ప్రత్యేక లైన్ ఏర్పాట్లు ఉన్నాయి.
వీటి ద్వారా 24 గంటల విద్యుత్ సరఫరా కావాల్సి ఉంది. అయినా ప్రభుత్వ కార్యాలయాలకు, ఆస్పత్రులకు విద్యుత్‌కోతలు తప్పడం లేదు. ఇటీవల ప్రభుత్వాస్పత్రిలో ఆపరేషన్ జరుగుతున్న సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ పోవడం వల్ల రోగి మృతి చెందాడు. గత ఏడాది అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ కోతలపై చర్చ జరుగుతున్న సమయంలో మద్రాసు హైకోర్టులో విద్యుత్ సరఫరాకు విఘాతం ఏర్పడింది. విద్యుత్ సరఫరా పర్యవేక్షణను ప్రజాపనుల శాఖకు అప్పగించినా నిందలు మాత్రం తమకు తప్పడం లేదని విద్యుత్ అధికారులు వాపోతున్నారు.
ప్రభుత్వ పరిధిలోని అన్ని సర్వీసులకు నిరంతర విద్యుత్ అందించేలా ప్రజాపనుల శాఖకు చెందిన ఏఈలకు బాధ్యతలు అప్పగించామని, ఈ విషయం తెలిసికూడా తమనే నిందిస్తున్నారని ఈ వివాదంపై విద్యుత్‌శాఖాధికారి వ్యాఖ్యానించారు. 24 గంటల విద్యుత్‌లో ఏదైనా లోపం జరిగినపుడు సదరు ఏఈ వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉందని అన్నారు. అతని నిర్లక్ష్యంతో తమశాఖ అప్రతిష్ట పాలైందని చెప్పారు. దీనిపై లిఖిత పూర్వకంగా ప్రజాపనుల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నామని ఆయన తెలిపారు.