సాక్షి, చెన్నై : ప్రభుత్వ పాఠశాలల్లో నిఘా నేత్రాలు (సీసీ కెమెరాలు) ఏర్పాటు చేయాలని మద్రాసు హైకోర్టు అభిప్రాయపడింది. ఈ మేరకు నిఘా నేత్రాల ఏర్పాటును తప్పని సరిచేస్తూ, అందుకు తగ్గ పరిశీలనలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను రెండు నెలల సమయాన్ని కేటాయించింది. ఇటీవల స్కూళ్లలో, పరిసరాల్లో నేరాలు తాండవిస్తున్నాయి. ఉపాధ్యాయులపై దాడి చేయడం, సహచర విద్యార్థులు గొడవకు దిగ డం, కత్తులతో నరుక్కోవడం, విద్యార్థినులపై యాసిడ్ దాడి చేయడం వంటి ఘటనలు చోటు చేసుకుంటూ వస్తున్నాయి.
అలాగే, విద్యార్థుల కిడ్నాప్ వ్యవహారాలు వెలుగులోకి వచ్చి వస్తున్నాయి. ఇటీవల అతి పెద్ద కిడ్నా ప్ రాకెట్ ముఠా కోసం సాగుతున్న విచారణలో అనేక మంది స్కూలు విద్యార్థులను పట్టుకెళ్లినట్టు తేలింది. ప్రైవేటు పాఠశాలల పరిసరాల్లో ఉన్నట్టుగానే, ప్రభుత్వ పాఠశాలల్లోనూ నిఘా నేత్రాలు ఏర్పాటు చేసి, పాఠశాలల్లో విద్యార్థులకు భద్రత కల్పించాలని, శాంతియుత వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టును మదురైకు చెందిన కేకే.రమేష్ అనే సామాజిక కార్యకర్త ఆశ్రయించాడు.
నిఘా నేత్రాలు తప్పని సరి తన పిటిషన్‌లో ఇటీవల కాలంగా సాగిన అనేక ప్రధాన ఘటనలను వివరించారు. ఉపాధ్యాయుల మీద సాగుతున్న దాడుల కేసుల్లో నింధితుల్ని అరెస్టు చేయడం పోలీసులకు కష్టతరంగా మారి ఉన్నాయని పేర్కొన్నారు. తరగతి గదిలోనే ఓ విద్యార్థి చేతులు నరకడం, మరో చోట హతమార్చడం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయని గుర్తుచేశారు. ఓ విద్యార్థిని అదృశ్యం అయితే, చివరకు స్నేహితురాలే ఆమెను కడతేర్చినట్టు కొంతకాలం తర్వాత వెలుగు చూసిందని పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు ఎన్నో ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో చోటు చేసుకుని ఉన్నాయని వివరించారు. విద్యార్థుల భద్రతను, పాఠశాలల పరిసరాల్లో శాంతియుత వాతావరణం నెలకొల్పే విధంగా సీసీ కెమెరాల్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ సీసీ కెమెరాలను ఆయా పోలీసు స్టేషన్ల పరిధుల్లోని కంట్రోల్ రూంలకు అనుసంధానించే విధంగా చర్యలు తీసుకుంటే బాగుంటుందని సూచించారు. తాను ఇదే విషయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం శూన్యం అని పేర్కొన్నారు. ఈ పిటిషన్ విచారణ శుక్రవారం ప్రధాన న్యాయమూర్తి సంజయ్‌కిషన్‌కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందుకు వచ్చింది. పిటిషనర్ తరపు వాదనల్ని, పిటిషనర్ విజ్ఞప్తిని కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో నిఘా నేత్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని బెంచ్ అభిప్రాయ పడింది. ఆ మేరకు నిఘా నేత్రాల ఏర్పాటు తప్పని సరి చేస్తూ, అందుకు తగ్గ పరిశీలనలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇందుకు గాను రెండు నెలల సమయాన్ని న్యాయమూర్తులు కేటాయించారు.
పాఠశాలల్లో నిఘా నేత్రాలు
Published Sat, Feb 28 2015 1:57 AM | Last Updated on Sat, Sep 2 2017 10:01 PM
Advertisement
Advertisement