గుండెదడ... ఇది ఏదో ఒక దశలో ప్రతి ఒక్కరికీ అనుభవంలోకి వచ్చే అంశమే. పరీక్షలకు వెళ్లేప్పుడో, ఏ విషయం గురించైనా ఆందోళనతో ఎదురు చూసేటప్పుడో, ఏదైనా వినకూడని విషయం వినాల్సి వస్తుందనప్పుడో గుండె దడ కలగడం సర్వసాధారణం. అయితే ఇది సాధారణంగా కాకుండా కొన్నిసార్లు ఇబ్బంది కలిగేలా కూడా ఉండవచ్చు. అలాంటప్పుడే చికిత్స అవసరమవుతుంది. గుండెదడకు కారణాలు, అది వచ్చినప్పుడు కలిగే పరిణామాలు, దాన్ని సరిచేయడానికి అవసరమైన చికిత్స ప్రక్రియల వంటి అంశాలపై అవగాహన కోసం ఈ కథనం.
గుండె స్పందనలు కలగడం ప్రతి వ్యక్తిలోనూ కనిపించే అంశమే. అయితే అలా గుండె స్పందనలు మనలో ఎవరికీ తెలియకుండానే జరిగిపోతుంటాయి. కొందరిలో గుండె వేగంగా కొట్టుకుంటూ ఉండవచ్చు. లేదా మరింత నెమ్మదిగా కూడా జరుగుతుండవచ్చు. ఒక వ్యక్తిలో గుండె కొట్టుకోవడం ఆ వ్యక్తికే తెలిసేలా జరుగుతుంటే దాన్ని గుండెదడగా చెప్పవచ్చు.
గుండెదడ అంటే...
గుండెదడ అన్నది ఒక వ్యాధి కావచ్చు. లేదా ఏదైనా వ్యాధికి అది లక్షణం కూడా కావచ్చు. రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు, మానసిక ఆందోళన, గుండె పంపింగ్ సామర్థ్యం తగ్గడం లాంటి అనేక వ్యాధుల్లో కూడా గుండెదడ ప్రధాన లక్షణం. ఈ కారణంగా వచ్చే గుండెదడ... ప్రధాన వ్యాధికి తగిన చికిత్స చేస్తే తగ్గిపోతుంది. చాలా సందర్భాల్లో గుండెదడకు ప్రధాన కారణం ఇదే. కాబట్టి దీని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే మరికొందరిలో మాత్రం గుండెకు జరిగే విద్యుత్ సరఫరా సర్క్యూట్‌లో తేడాలు రావడం వల్ల గుండె స్పందనల్లో హెచ్చుతగ్గులు రావడం సంభవిస్తుంది. గుండె కొట్టుకోవాల్సిన దానికంటే ఎక్కువగా కొట్టుకుంటుంటే దాన్ని ‘టాకికార్డియా’ అని, నెమ్మదిగా కొట్టుకుంటే దాన్ని ‘బ్రాడీకార్డియా’ అని వైద్య పరిభాషలో చెబుతుంటారు.
గుండె ఎలక్ట్రిక్ సర్క్యుట్ ప్రాధాన్యం...
గుండె లయబద్ధంగా (నిమిషానికి 60 నుంచి 100 సార్లు) స్పందించడానికి అవసరమైన కండరశక్తిని సమకూర్చడంలో గుండె తాలూకు ఎలక్ట్రిక్ సర్క్యూట్ అత్యంత కీలకం. గుండె కచ్చితంగా నిర్ణీత వేగంతో కొట్టుకోడానికి అత్యంత క్రమశిక్షణతో గుండెకు అవసరమైన ఎలక్ట్రిక్ తరంగాలను ఇచ్చే పేస్‌మేకర్ గుండెలోని కుడి కర్ణికలో ఉంటుంది. దీనిపేరే ‘సైనస్ నోడ్’. ఇది గుండె తాలూకు పవర్‌హౌస్‌లా పరిగణించవచ్చు. ఇక్కడ తయారైన విద్యుత్ తరంగాలు కర్ణిక (ఏట్రియమ్), జఠరిక (వెంట్రికిల్)ల కూడలి వద్ద ఉన్న ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ దగ్గరకు వస్తాయి. గుండె విద్యుత్ తరంగాలు కొన్ని పరిస్థితుల్లో ఎక్కువగా తయారైనా ఈ ఏట్రియోవెంట్రిక్యులార్ నోడ్ వాటిని గుండెకు చేరకుండా నియంత్రిస్తుంటుంది. అందుకని దీనిని గుండె తాలూకు ఎలక్ట్రికల్ సర్క్యూట్‌కి పోలీస్ ఆఫీసర్‌లాగా భావించవచ్చు. ఈ ఏవీనోడ్ నుంచి విద్యుత్ తరంగాలు గుండె ఎడమ జఠరిక (వెంట్రికల్) నుంచి కుడి (జఠరిక) వెంట్రికల్‌కు ప్రసరిస్తాయి. ఇది సాధారణ స్పందనల్లో జరిగే ప్రక్రియ.
అసాధారణంగా గుండె స్పందనల ఎందుకు?
మామూలుగా విశ్రాంతి తీసుకునేప్పుడు గుండె తక్కువగా కొట్టుకుంటుంది. అదే తొందరగా నడిచేప్పుడు లేదా పరుగెత్తేప్పుడు అడ్రినాలిన్ అనే హార్మోన్ ఎక్కువగా ప్రసరించడంతో గుండె స్పందనలు పెరుగుతాయి. ఇలా గుండె వేగంగా కొట్టుకోవడాన్ని గుండెదడగా పేర్కొనవచ్చు. ఇది కొన్ని నిమిషాలు లేదా గంటల నుంచి ఒక్కోసారి కొన్ని రోజులు కూడా ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ అధికంగా వచ్చే గుండె తరంగాలు గుండె సైనస్‌నోడ్ నుంచే కాకుండా గుండెలోని వేర్వేరు ప్రదేశాల నుంచి రావచ్చు. అంతేకాదు కొన్నిసార్లు ఎలక్ట్రిక్ సర్క్యూట్‌లో అదనంగా ఏర్పడిన తరంగాల అనియంత్రితంగా గుండెకు చేరి గుండెదడకు కారణం కావచ్చు.
గుండెదడ లక్షణాలు
గుండెదడ వచ్చినప్పుడు సాధారణంగా కనిపించే లక్షణాలివి...
ఆయాసం
తలతిరగడం
కొన్నిసార్లు స్పృహ కోల్పోవడం కూడా జరగవచ్చు.
చికిత్స
గుండెదడకు చికిత్స అనేది రోగి పడే ఇబ్బంది మీద ఆధారపడి ఉంటుంది. గుండెదడ వల్ల ఇబ్బంది తక్కువగా ఉంటే దాన్ని ప్రత్యేకమైన చికిత్స ఏదీ అవసరం లేదు. డాక్టర్ రోగికి కొన్ని చిట్కాలు సూచిస్తారు. చల్లనినీళ్లతో ముఖం కడుక్కోవడం, ఊపిరి బిగబట్టి ముక్కడం వంటి చాలా సాధారణ చిట్కాలతో దీన్ని అధిగమించవచ్చు.
గుండెదడ అనియంత్రితంగా జరుగుతుంటే మాత్రం చికిత్స అవసరమవుతుంది. అప్పుడు దీనికోసం కొన్ని మందులు వాడటం లేదా అబ్లేషన్ చికిత్స ద్వారా ఈ సమస్యను అధిగమించవచ్చు. గుండెదడను నియంత్రించడానికి ఉపయోగించే మందులు చాలా రకాలుగా ఉంటాయి. గుండెలోని ఎలక్ట్రికల్ సిస్టమ్‌లో అధిక ప్రకంపనలు ఎక్కడి నుంచి ఉత్పత్తి అవుతున్నాయో నిర్ధారణ చేసి, తగిన మందులను గుండె వ్యాధి నిపుణులు సూచిస్తారు. సాధారణంగా 90 శాతం వ్యక్తుల్లో కేవలం మందుల ద్వారానే ఈ సమస్యను నియంత్రించవచ్చు. అయితే ఈ తరహా మందులను జీవితాంతం వాడాల్సి రావడం వల్ల వీటి తాలూకు దుష్పరిణామాలు (సైడ్ ఎఫెక్ట్స్) తలెత్తే అవకావం ఉండవచ్చు. అందుకే ఒకవేళ మందులు పనిచేయకపోయినా లేదా మందుల కారణంగా దుష్ర్పభావాలు కనిపించినా అబ్లేషన్ పద్ధతి ద్వారా గుండెలోని ఏస్థానం నుంచి అధికంగా విద్యుత్ తరంగాలు తయారవుతున్నాయో చూసి, వాటిని సరిచేస్తారు. ఈ అబ్లేషన్ చికిత్స అంత సంక్లిష్టమైనది కూడా కాదు. సురక్షితమైనది కూడా. పైగా గుండెదడను నియంత్రించడానికి ఒకసారి అబ్లేషన్ చికిత్స చేయించాక ఇక జీవితాంతం మందులు వాడాల్సిన అవసరం కూడా ఉండదు. కాకపోతే కొన్నిసార్లు అబ్లేషన్ చికిత్స చేశాక ఆ తర్వాత గుండెకు సరఫరా అయ్యే రక్తాన్ని పలుచబార్చడం కోసం ‘ఆస్పిరిన్’ మందును ఉపయోగించాల్సి ఉంటుంది. అందుకే ఈ తరహా చికిత్స గురించి రోగులు ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
చాలా సందర్భాల్లో కేవలం ఆందోళన వల్లనే...
గుండెదడ అన్నది చాలా సందర్భాల్లో ప్రతి ఒక్కరికీ కనిపించే అంశమే. ఇది కేవలం మానసిక ఆందోళన వల్ల కూడా జరిగే అవకాశాలే ఎక్కువ. వ్యక్తిగత లక్షణాలలో భాగంగా కొందరికి చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆందోళన చెందడం తేలిగ్గా ఉద్రేకాలను లోనుకావడం వంటివి సంభవించవచ్చు. ఇలా జరిగేప్పుడు వచ్చే గుండెదడ చాలా తాత్కాలికం. దీనికి ఎలాంటి చికిత్స కూడా అవసరం లేదు. కాకపోతే ఈ ఇబ్బందిని అధిగమించడానికి ఆందోళనలను నియంత్రించుకునేలా యోగా, ధ్యానం వంటి చిన్నపాటి చిట్కాలు పాటిస్తే చాలు. అయితే ఈ తరహా చిట్కాలు కూడా ప్రయోజనం ఇవ్వని సందర్భాల్లో మందులు వాడాల్సి ఉంటుంది. కాబట్టి గుండెదడ కనిపించినప్పుడు అది రోగికి ఆరోగ్యపరంగా ఇబ్బందినీ, సమస్యను కలిగించే స్థాయిలో ఉందా లేదా అన్నది హృద్రోగ నిపుణులతో పరీక్షింపజేసుకుని, అది పెద్ద ప్రమాదకరమైన విషయం కాదని వారు భరోసా ఇచ్చాక దాని గురించి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. కాకపోతే అది ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగించే అవకాశం ఎక్కువ అన్నప్పుడే చికిత్స అవసరమని గుర్తిస్తే చాలు.
-నిర్వహణ: యాసీన్
గుండెదడ... గుండెపోటు ఒకటేనా?
గుండెపోటు అన్నది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరడం వల్ల గుండె కండరానికి తగినంత రక్తసరఫరా జరగకపోవడం వల్ల వచ్చే సమస్య. గుండెదడ అన్నది గుండె ఎలక్ట్రిక్ సిస్టమ్‌లో మార్పు రావడం వల్ల సంభవించేది. కాబట్టి గుండెదడ, గుండెపోటు వేర్వేరు సమస్యలు. వాటికి కారణాలు, పర్యవసానాలు, వైద్యచికిత్స కూడా వేరుగా ఉంటాయి. గుండెలో నాలుగు గదులు ఉంటాయి. పైన రెండు గదులను కుడి, ఎడమ కర్ణికలు (ఏట్రియమ్) అంటారు. వీటిలో రక్తం నిల్వ ఉంటుంది. కింద రెండు గదులను కుడి, ఎడమ జఠరిక (వెంట్రికిల్) అంటారు. ఈ రెండు గదుల నుంచి నిరంతరం శరీరానికి రక్తం సరఫరా అవుతుంటుంది.
వ్యాధి నిర్ధారణ : గుండెదడ వచ్చినప్పుడు అది ఏ రకానికి చెందినదో నిర్ధారణ చేయడం చాలా ముఖ్యం. కొంతమందికి గుండె కొట్టుకోవడం మామూలుగా ఉన్నా గుండె ఎక్కువగా కొట్టుకుంటోందనే అపోహ ఉంటుంది. కాబట్టి గుండె తరంగాలను ఈసీజీ ద్వారా రికార్డ్ చేయడం ద్వారా గుండె స్పందనలు మామూలుగా ఉన్నాయా లేక అసాధారణంగా ఉన్నాయా అన్నది నిర్ధారణ చేయవచ్చు. కొన్నిసార్లు 24 గంట పాటు ఈసీజీ తీసి పరీక్షించడానికి హోల్టర్ అనే పరికరాన్ని కూడా అమర్చాల్సి రావచ్చు. మరికొన్నిసార్లు టీఎంటీ పరీక్ష కూడా అవసరం కావచ్చు. అవసరాన్ని బట్టి, పరిస్థితిని బట్టి ఏది ఎప్పుడు చేయాల న్నది వైద్యులు సూచిస్తారు.
డాక్టర్ సి.రఘు
కార్డియాలజిస్ట్, ప్రైమ్ హాస్పిటల్స్,
హైదరాబాద్