మా చేతుల్లో ఏమీ లేదు
అనధికార నిర్మాణాలను అడ్డుకోవడంపై కమిషనర్ బస్సి
న్యూఢిల్లీ: సంబంధిత విభాగం నుంచి ఉత్తర్వులు వస్తే తప్ప అనధికార నిర్మాణాల విషయంలో తాము చేయగలిగిందేమీ లేదని నగర పోలీస్ కమిషనర్ బి.ఎస్.బస్సీ చెప్పారు. దీనిపై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఇందుకు సంబంధించి ఇప్పటికే ఓ సర్కులర్‌ను జారీచేశామన్నారు. అక్రమ నిర్మాణాలకు పోలీసులు సహకరిస్తున్నారని, వారి వద్ద నుంచి లంచాలు తీసుకుంటున్నారంటూ గతంలో ఆరోపణలు వెల్లువెత్తాయన్నారు.
మున్సిపల్ అథారిటీ నుంచి ఉత్తర్వులు అందినట్టయితే సంబంధిత స్టేషన్ హౌజ్ ఆఫీసర్ అక్రమ నిర్మాణాలను అడ్డుకోగలుగుతారని అన్నారు. పోలీసు శాఖ తాజా సర్కులర్ ప్రకారం ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్, 1957 చట్టంలోని 475వ నిబంధన కిందఅక్రమ నిర్మాణాలకు సంబంధించిన సమాచారాన్ని స్టేషన్ హౌజ్ ఆఫీసర్... మున్సిపల్ అధికారులకు అందజేస్తాడు. తన కింద పనిచేసే సిబ్బందిగానీ, అధికారిగానీ ఈ విషయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా చూడాల్సి ఉంటుందన్నారు. మున్సిపల్ యంత్రాంగం నుంచి ఉత్తర్వులు అందగానే అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సి ఉంటుందన్నారు. అంతేతప్ప పోలీసులు అడ్డుకోలేరన్నారు. ఒకవేళ అడ్డుకోవాలంటే సంబంధిత అక్రమ నిర్మాణాన్ని చేపట్టిన వ్యక్తికి సదరు ఉత్తర్వులను చూపాల్సి ఉంటుందన్నారు.
అక్రమ నిర్మాణదారులకు తమ సిబ్బంది సహకరించకుండా జాగ్రత్త పడతామన్నారు. తమ సిబ్బంది ఎవరైనా లంచం అడిగితే అందుకు సంబంధించిన వీడియోగానీ లేదా ఆడియోనుగానీ 9910641064 నంబర్‌కు పంపాలన్నారు. 1064 నంబర్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించాలని ఆయన వివరించారు.