bsc second year student
-
కట్నంతో లాభాలెన్నో!
ముంబై: వరకట్నంతో చాలా ప్రయోజనాలున్నాయంటూ పలు ఉదాహరణలను పేర్కొన్న బీఎస్సీ నర్సింగ్ రెండో ఏడాది పాఠ్యపుస్తకం ఉదంతం తీవ్ర చర్చనీయాంశమైంది. టీకే ఇంద్రాణి రచించిన సోషియాలజీ ఫర్ నర్సింగ్ పుస్తకంలోని ఒక పేరాలో పేర్కొన్న అంశాలను నెటిజన్లు తీవ్రంగా తప్పుబట్టారు. ఆ పేజీ ప్రస్తుతం మీడియాలో చక్కర్లు కొడుతోంది. ‘ ఇంట్లోకి కొత్త కుటుంబసభ్యురాలిగా అడుగుపెట్టేందుకు వరకట్నం ఎంతగానో సాయపడుతుంది. ఇంట్లోకి సమస్త సామగ్రి, వాహనాలు ఇలా అన్నీ కట్నం రూపంలో వచ్చిపడతాయి. అమ్మాయి తన తల్లిదండ్రుల ఆస్తిలో భాగాన్ని ఇలా కట్నంరూపంలో అత్తవారింటికి తెచ్చుకోవచ్చు. కట్నాలు ఇచ్చే స్తోమత లేకే కొందరు తల్లిదండ్రులు అమ్మాయిలను ఉన్నత చదువులు చదివిస్తున్నారు. వారు చదివి, ఉద్యోగం సంపాదిస్తే కట్నం డిమాండ్ తగ్గుతుంది. ఇదొక మంచి ప్రయోజనం. అందవిహీన అమ్మాయిలకు మంచి/అందవిహీన అబ్బాయిలతో పెళ్లి అవ్వాలంటే కట్నం ముట్టజెప్పాల్సిందే’ అంటూ పలు వ్యాఖ్యానాలు ఆ పుస్తకంలో ఉన్నాయి. ఇలాంటి పాఠ్యపుస్తకాలు ఉండటం మన భారతజాతికే సిగ్గుచేటు’ అంటూ శివసేన మహిళా ఎంపీ ప్రియాంకా చతుర్వేది ఆగ్రహం వ్యక్తంచేశారు. పాఠ్య ప్రణాళిక నుంచి వెంటనే ఈ పుస్తకాన్ని తొలగించి, సంబంధికులపై కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు ఆమె లేఖ రాశారు. -
అతడు.. ఆమె.. ఓ అన్న!
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ విద్యార్థి యువతిగా ‘మారాడు’.. ఆ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఎర వేశాడు... తన ఫొటోలు అంటూ డమ్మీవి పంపించి.. బాధితుడి నుంచి ‘అసలైనవి’ సంగ్రహించాడు.. ఇవి చేజిక్కిన తర్వాత పెళ్లి ప్రస్తావనతీసుకువచ్చి బెదిరించాడు... ఆపై తన అన్న అంటూ తానే మరో పాత్రలో ప్రవేశించి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు... చివరకు బాధితుడి నుంచి రూ.3.5 లక్షలు కాజేసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలు ఇవీ.. మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్‌కిరణ్ (20) నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్లైన్ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా తెరిచాడు. దీని ద్వారా కాచిగూడ ప్రాంతంలో నివసించే సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ రిక్వెస్ట్ వచ్చింది సదరు యువతి నుంచే అని భావించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ యాక్సెప్ట్ చేశాడు. ఇలా కొన్నాళ్ల పాటు యువతి మాదిరే చాటింగ్స్ చేశాడు. తన ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఓ దశలో తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతూ కొన్ని ‘ఫొటోలు’ పంపిస్తానంటూ యువతిగానే చెప్పాడు. దానికి సాఫ్ట్వేర్ ఇంజినీర్ అంగీకరించడంతో ఇంటర్నెట్ నుంచే డౌన్లోడ్ చేసిన కొన్ని అర్ధనగ్న ఫొటోలను తనవే అంటూ పంపించాడు. వీటిని బాధితుడు చూశాడని నిర్ధారించుకున్న తర్వాత చాటింగ్ కొనసాగించాడు. ఆపై పెళ్లి ప్రస్తావన.. చాటింగ్ గారడీ ద్వారానే బాధితుడు సైతం తనంత తానుగా అతడికి చెందిన కొన్ని అలాంటి ఫొటోలే తనకు ఇన్‌స్ట్రాగామ్‌లో పంపేలా చేసుకున్నాడు. ఆపై అసలు కథను ప్రారంభించాడు పవన్ కిరణ్. ఉద్దేశపూర్వకంగా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నిన్నే పూర్తిగా నమ్మానని, అందుకే వ్యక్తిగత ఫొటోలను సైతం షేర్ చేశానంటూ చాటింగ్ మొదలెట్టాడు. ఈ ప్రస్తావనతో హడలిపోయన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి పేరుతో ఉన్న పవన్ కిరణ్ ఖాతాను బ్లాక్ చేశాడు. దీంతో వాట్సాప్ ద్వారా రంగంలోకి దిగిన నిందితుడు తనను పెళ్లి చేసుకోమంటే బ్లాక్ చేసి మోసం చేస్తున్నావంటూ సందేశాలు పంపాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు. మూడో పాత్రలోకి దిగి.. ఈ విషయం తన అన్న వద్దకు వెళుతోందని, ఆయనే మాట్లాడతారంటూ సందేశం పెట్టిన పవన్ మూడో పాత్రలోకి దిగాడు. బాధితుడైన సాఫ్ట్వేర్ ఇంజినీర్‌కు ఫోన్లు చేయడం ప్రారంభించిన పవన్ ‘అన్న’ మాదిరిగా మాట్లాడుతూ బెదిరించాడు. తన వద్ద ఉన్న అతడి వ్యక్తిగత ఫొటోలను సైతం మచ్చుకు పంపిస్తున్నానంటూ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో రూ.3.5 లక్షలు చెల్లించిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలిపెట్టని పవన్ మరికొంత మొత్తం ఇవ్వాలని పదేపదే ఫోన్లు చేశాడు. దీంతో బాధితుడు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుడు వినియోగించిన ఫోన్నంబర్ల ద్వారా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారి గురువారం పవన్‌కిరణ్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. -
బస్సు మిస్సైందని బైక్ ఎక్కితే...
కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతోంది. అదే పట్టుదలతో డిగ్రీ పట్టా పుచ్చుకోవాలని నిత్యం శ్రమిస్తోంది. ఎప్పటిలాగే కళాశాలకు బయలుదేరిన ఆమె సోమవారం బస్సు మిస్సయింది. ఆ బస్సు కోసం బైక్‌పై లిఫ్ట్ అడిగి బయలుదేరిన ఆమెను మార్గమధ్యంలో మృత్యువు కాటేసింది. తూర్పు గోదావరి జిల్లా : పందలపాక గ్రామానికి చెందిన జిలగం శ్రీనివాసరావు చిరువ్యాపారి. అతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వ్యాపారాన్ని చూసుకుంటుండగా, కుమార్తె గౌరీదుర్గ(19) రామచంద్రపురం వీఎస్ఎం కాలేజీలో బీఎస్సీ సెకండియర్ చదువుతోంది. నిత్యం ఉదయం 8 గంటలకు పందలపాక నుంచి తొస్సిపూడి సెంటర్‌కు సైకిల్‌పై వచ్చి, అక్కడి నుంచి రామచంద్రపురానికి ఆర్టీసీ బస్సులో వెళుతోంది. సోమవారం ఆమె కొంత ఆలస్యంగా బయలుదేరింది. తొస్సిపూడి సెంటర్ వద్దకు వచ్చేసరికి అప్పుడే బస్సు బయలుదేరింది. దీంతో అటుగా బైక్‌పై వెళుతున్న తోటి విద్యార్థి ఊలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి జయేంద్ర మణికుమార్‌ను బస్సు వద్దకు తీసుకువెళ్లాలని లిఫ్ట్ అడిగింది. ఆమెను తీసుకువెళుతుండగా కొమరిపాలెం శ్రీసూర్య మోడరన్ రైస్ మిల్లు వద్ద, రాయవరం వైపు నుంచి వచ్చిన వ్యాన్ వారి బైక్‌ను ఢీకొంది. ఈ సంఘటనలో బైక్‌పై నుంచి గౌరీదుర్గ కిందపడగా, ఆమె తల మీదుగా వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌కుమార్, బిక్కవోలు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్‌కుమార్ తెలిపారు. విషాద ఛాయలు కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతున్న గౌరీదుర్గను ఇంటిల్లిపాది ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. వ్యాపారం పనిపై విశాఖపట్నం వెళ్లిన గౌరీదుర్గ తండ్రి, సోదరుడు ఆమె మరణవార్త విని హుటాహుటిన ఇక్కడకు బయలుదేరారు. వారితో పాటు గౌరీదుర్గ తల్లి ఆమె మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సంఘటనతో పందలపాకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.