పవన్‌కిరణ్
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని మల్కాజిగిరికి చెందిన ఓ విద్యార్థి యువతిగా ‘మారాడు’.. ఆ పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో ఖాతా తెరిచి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఎర వేశాడు... తన ఫొటోలు అంటూ డమ్మీవి పంపించి.. బాధితుడి నుంచి ‘అసలైనవి’ సంగ్రహించాడు.. ఇవి చేజిక్కిన తర్వాత పెళ్లి ప్రస్తావనతీసుకువచ్చి బెదిరించాడు... ఆపై తన అన్న అంటూ తానే మరో పాత్రలో ప్రవేశించి రూ.30 లక్షలు డిమాండ్ చేశాడు... చివరకు బాధితుడి నుంచి రూ.3.5 లక్షలు కాజేసి సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు చిక్కాడు. ఆ వివరాలు ఇవీ..
మల్కాజిగిరి ప్రాంతానికి చెందిన కె.పవన్‌కిరణ్ (20) నగరంలోని ఓ కాలేజీలో బీటెక్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఆన్‌లైన్ జూదానికి, ఇతర విలాసాలకు అలవాటుపడిన ఇతగాడు తేలిగ్గా డబ్బు సంపాదించడాలనే ఉద్దేశంలో సోషల్ మీడియాను దుర్వినియోగం చేయడానికి పథకం వేశాడు. ఓ యువతి పేరు, ఆకర్షణీయమైన ఫొటోలు వినియోగించి ఇన్‌స్ట్రాగామ్‌లో ఖాతా తెరిచాడు. దీని ద్వారా కాచిగూడ ప్రాంతంలో నివసించే సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. ఈ రిక్వెస్ట్ వచ్చింది సదరు యువతి నుంచే అని భావించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ యాక్సెప్ట్ చేశాడు. ఇలా కొన్నాళ్ల పాటు యువతి మాదిరే చాటింగ్స్ చేశాడు. తన ఉనికి బయటకు రాకుండా ఉండేందుకు ఎప్పుడూ, ఏ సందర్భంలోనూ వీడియో కాల్స్, ఫోన్ కాల్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. ఓ దశలో తమ మధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెబుతూ కొన్ని ‘ఫొటోలు’ పంపిస్తానంటూ యువతిగానే చెప్పాడు. దానికి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అంగీకరించడంతో ఇంటర్నెట్ నుంచే డౌన్‌లోడ్ చేసిన కొన్ని అర్ధనగ్న ఫొటోలను తనవే అంటూ పంపించాడు. వీటిని బాధితుడు చూశాడని నిర్ధారించుకున్న తర్వాత చాటింగ్ కొనసాగించాడు.
ఆపై పెళ్లి ప్రస్తావన..
చాటింగ్ గారడీ ద్వారానే బాధితుడు సైతం తనంత తానుగా అతడికి చెందిన కొన్ని అలాంటి ఫొటోలే తనకు ఇన్‌స్ట్రాగామ్‌లో పంపేలా చేసుకున్నాడు. ఆపై అసలు కథను ప్రారంభించాడు పవన్ కిరణ్. ఉద్దేశపూర్వకంగా పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. నిన్నే పూర్తిగా నమ్మానని, అందుకే వ్యక్తిగత ఫొటోలను సైతం షేర్ చేశానంటూ చాటింగ్ మొదలెట్టాడు. ఈ ప్రస్తావనతో హడలిపోయన బాధితుడు ఇన్‌స్ట్రాగామ్‌లో యువతి పేరుతో ఉన్న పవన్ కిరణ్ ఖాతాను బ్లాక్ చేశాడు. దీంతో వాట్సాప్ ద్వారా రంగంలోకి దిగిన నిందితుడు తనను పెళ్లి చేసుకోమంటే బ్లాక్ చేసి మోసం చేస్తున్నావంటూ సందేశాలు పంపాడు. తనను పెళ్లి చేసుకోవాలని లేదంటే రూ.30 లక్షలు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగాడు.
మూడో పాత్రలోకి దిగి..
ఈ విషయం తన అన్న వద్దకు వెళుతోందని, ఆయనే మాట్లాడతారంటూ సందేశం పెట్టిన పవన్ మూడో పాత్రలోకి దిగాడు. బాధితుడైన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌కు ఫోన్లు చేయడం ప్రారంభించిన పవన్ ‘అన్న’ మాదిరిగా మాట్లాడుతూ బెదిరించాడు. తన వద్ద ఉన్న అతడి వ్యక్తిగత ఫొటోలను సైతం మచ్చుకు పంపిస్తున్నానంటూ డబ్బు డిమాండ్ చేశాడు. దీంతో రూ.3.5 లక్షలు చెల్లించిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ తనను విడిచిపెట్టాలని ప్రాధేయపడ్డాడు. అయినప్పటికీ వదలిపెట్టని పవన్ మరికొంత మొత్తం ఇవ్వాలని పదేపదే ఫోన్లు చేశాడు. దీంతో బాధితుడు ఇటీవల సిటీ సైబర్ క్రైమ్ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్ ఎన్.మోహన్‌రావు దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిందితుడు వినియోగించిన ఫోన్‌నంబర్ల ద్వారా ముందుకు వెళ్లిన దర్యాప్తు అధికారి గురువారం పవన్‌కిరణ్ నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశారు. కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment