బస్సు మిస్సైందని బైక్ ఎక్కితే... | bsc second year student died in road accident | Sakshi
Sakshi News home page

బస్సు మిస్సైందని బైక్ ఎక్కితే...

Published Tue, Jun 28 2016 9:46 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

బస్సు మిస్సైందని బైక్ ఎక్కితే... - Sakshi

బస్సు మిస్సైందని బైక్ ఎక్కితే...

కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతోంది. అదే పట్టుదలతో డిగ్రీ పట్టా పుచ్చుకోవాలని నిత్యం శ్రమిస్తోంది. ఎప్పటిలాగే  కళాశాలకు బయలుదేరిన ఆమె సోమవారం బస్సు మిస్సయింది. ఆ బస్సు కోసం బైక్‌పై లిఫ్ట్ అడిగి బయలుదేరిన ఆమెను మార్గమధ్యంలో మృత్యువు కాటేసింది.
 
 తూర్పు గోదావరి జిల్లా : పందలపాక గ్రామానికి చెందిన జిలగం శ్రీనివాసరావు చిరువ్యాపారి. అతడికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు వ్యాపారాన్ని చూసుకుంటుండగా, కుమార్తె గౌరీదుర్గ(19) రామచంద్రపురం వీఎస్‌ఎం కాలేజీలో బీఎస్సీ సెకండియర్ చదువుతోంది. నిత్యం ఉదయం 8 గంటలకు పందలపాక నుంచి తొస్సిపూడి సెంటర్‌కు సైకిల్‌పై వచ్చి, అక్కడి నుంచి రామచంద్రపురానికి ఆర్టీసీ బస్సులో వెళుతోంది.

సోమవారం ఆమె కొంత ఆలస్యంగా బయలుదేరింది. తొస్సిపూడి సెంటర్ వద్దకు వచ్చేసరికి అప్పుడే బస్సు బయలుదేరింది. దీంతో అటుగా బైక్‌పై వెళుతున్న తోటి విద్యార్థి ఊలపల్లి గ్రామానికి చెందిన రాపర్తి జయేంద్ర మణికుమార్‌ను బస్సు వద్దకు తీసుకువెళ్లాలని లిఫ్ట్ అడిగింది. ఆమెను తీసుకువెళుతుండగా కొమరిపాలెం శ్రీసూర్య మోడరన్ రైస్ మిల్లు వద్ద, రాయవరం వైపు నుంచి వచ్చిన వ్యాన్ వారి బైక్‌ను ఢీకొంది.

ఈ సంఘటనలో బైక్‌పై నుంచి గౌరీదుర్గ కిందపడగా, ఆమె తల మీదుగా వ్యాన్ దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. అనపర్తి ఎస్సై కె.కిషోర్‌కుమార్, బిక్కవోలు పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిషోర్‌కుమార్ తెలిపారు.

 విషాద ఛాయలు
 కుటుంబంలో ఆమె మాత్రమే డిగ్రీ చదువుతున్న గౌరీదుర్గను ఇంటిల్లిపాది ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. వ్యాపారం పనిపై విశాఖపట్నం వెళ్లిన గౌరీదుర్గ తండ్రి, సోదరుడు ఆమె మరణవార్త విని హుటాహుటిన ఇక్కడకు బయలుదేరారు. వారితో పాటు గౌరీదుర్గ తల్లి ఆమె మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ సంఘటనతో పందలపాకలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement