ఏటీఎం కేంద్రంలో బురిడీ
నగదు డ్రా చేయడం తెలియని ఇద్దరిని మోసం చేసిన గుర్తుతెలియని వ్యక్తి
రూ.7 వేలతో పరారు
మేదరమెట్ల : ఏటీఎం కేంద్రంలో నగదు డ్రా చేయడం ఎలాగో తెలియని ఇద్దరు వ్యక్తులను మరో వ్యక్తి నమ్మించి మోసం చేశాడు. ఈ సంఘటన మేదరమెట్ల బస్టాండ్‌లోని ఏటీఎం కేంద్రంలో గురువారం జరిగింది. ఆ వివరాల్లోకెళ్తే... ఖమ్మం జిల్లాకు చెందిన బి.సీతారాములు, బి.నల్లశ్రీనులు సపోటా కాయలు కోసే పనికి కొరిశపాడు గ్రామానికి వచ్చారు. గ్రామానికి చెందిన గోలి గంగాప్రసాద్‌తో కలిసి పనులకు వెళ్తున్నారు. ముగ్గురూ స్నేహంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సీతారాములు, నల్లశ్రీనులకు డబ్బు ఇవ్వాల్సిన ఖమ్మం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి వీరిని బ్యాంక్ అకౌంట్ నంబర్ చెప్పమని అడిగాడు.
దీంతో వారు గంగాప్రసాద్ అకౌంట్ నంబర్ ఇచ్చారు. రూ.7 వేలు నగదు జమ చేశానని ఖమ్మం జిల్లాకు చెందిన వ్యక్తి ఫోన్‌చేసి చెప్పడంతో డ్రా చేసుకునేందుకు గంగాప్రసాద్ వద్ద ఏటీఎం కార్డు తీసుకుని గురువారం మేదరమెట్ల బస్టాండ్‌లోని ఏటీఎం కేంద్రానికి వచ్చారు. అయితే, నగదు డ్రా చేయడం ఎలాగో తెలియకపోవడంతో వీరిని గమనించిన ఓ గుర్తుతెలియని వ్యక్తి.. తాను డ్రాచేసి ఇస్తానని చెప్పి కార్డు తీసుకుని పిన్‌నంబర్ అడిగి తెలుసుకున్నాడు.
కానీ, వారిని బురిడీ కొట్టించి అతని వద్ద ఉన్న మరో నకిలీ కార్డును మిషన్‌లోపెట్టి చూసి అకౌంట్లో నగదు లేవని నమ్మించాడు. అదే కార్డును వారికి అందజేశాడు. వారు ఏటీఎం కేంద్రంలో నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను దాచిన అసలు కార్డు ద్వారా రూ.7 వేలు నగదు డ్రా చేసుకుని పరారయ్యాడు. గంగాప్రసాద్ సెల్‌ఫోన్‌కు నగదు డ్రాచేసినట్లు మెసేజ్ రావడంతో ఫోన్‌చేసి అసలు విషయం తెలుసుకున్న సీతారాములు, నల్లశ్రీను లబోదిబోమన్నారు.