జియో ఎఫెక్ట్: బీఎస్ఎన్ఎల్ ఉద్యోగుల నిరవధిక సమ్మె
సాక్షి,న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఉద్యోగులు నిరవధిక సమ్మకు దిగనున్నారు. అపరిష్కృతంగా వున్న తమ డిమాండ్ల సాధన కోసం బీఎస్ఎన్ఎల్ ఆఫీసర్ అసోసియేషన్లు, ఉద్యోగుల సంఘాల సమాఖ్య ఎయుఎబి నాయకత్వంలో డిసెంబరు 3నుంచి సమ్మె చేపట్టనున్నామని బిఎస్ఎన్ఎల్ యూనియన్లు ఉమ్మడి ప్రకటనలో తెలిపాయి.. ఈ సందర్భంగా వారు రిలయన్స్ జియోపట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై మండిపడ్డారు. టెలికాం రంగంలోకి ఎంట్రీ ఇచ్చిన ముకేశ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న సానుకూల వైఖరే సంస్థ నష్టాలకు కారణమన్నారు.
ముఖ్యంగా జియోకు పోటీని నివారించే ఉద్దేశంతోనే 4జీ సేవలు అందించే 4జీ స్పెక్ట్రమ్‌ను బీఎస్ఎన్ఎల్కు కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. మరోవైపు 4జీ స్పెక్ట్రమ్ దక్కించుకునేందుకు ముఖేశ్ అంబానీ రిలయన్స్ జియో.. భారీ పెట్టుబడులు పెట్టి.. అతితక్కువ ధరకు సర్వీసులు అందజేస్తోందని, దీనివల్ల అనిల్ అంబానీ ఆర్కాంతోపాటు టాటా, ఎయిర్ సెల్ వంటి పెద్ద ప్రైవేట్ సంస్థలే కాక ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ తీవ్రనష్టాల్లో కూరుకుపోతోందని వారు ఆరోపిస్తున్నారు. ప్రత్యర్థి కంపెనీలను నష్టపరిచే దురుద్దేశంతోనే జియో టారిఫ్ ఎత్తుగడలు వేస్తోందనీ, ఒకసారి మార్కెట్లో పోటీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన అనంతరం జియో కస్టమర్లను భారీగా దోపీడీ చేయనుందని పేర్కొన్నాయి.
ప్రభుత్వ సంస్థ బీఎస్ఎన్ఎల్ సహా,ఇతర ప్రధాన పోటీదారుల నష్టాలకు కారణమైన జియోకు నరేంద్ర మోదీ సర్కార్ బహిరంగంగా మద్దతు తీవ్ర ఆందోళనకలిగించే అంశమని ప్రకటించారు. పెన్షన్ కాంట్రిబ్యూషన్ పేరుతో కేంద్రం తమను దోచుకుంటోందని, తద్వారా మోదీ ప్రభుత్వం తమ స్వంత నియమాలను ఉల్లంఘించడం దారుణమని ఆరోపించాయి. ప్రతి సంవత్సరం సంస్థ నుంచి భారీ మొత్తంలో సొంతం చేసుకుంటోందని, ఇది సంస్థపై తీవ్ర ఆర్థిక ప్రభావాన్ని పడేవేస్తోందని ఉద్యోగ సంఘాలు వెల్లడించాయి. అంతేకాదు జియోకి వ్యతిరేకంగా వ్యవహరించిన అధికారులపై వేటుపడిందని దుయ్యబట్టాయి. ముఖ్యంగా మాజీ టెలికాం సెక్రటరీ జేఎస్ దీపక్ లాంటి వారు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేసాయి.
4జీ స్పెక్ట్రంను తక్షణమే కేటాయించాలని, బీఎస్ఎన్ఎల్ పెన్షన్ చెల్లింపులకు సంబంధించి ప్రభుత్వ నిబంధనను అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతేడాది జనవరి 1వ తేది నుండి ఉద్యోగులు, పదవీ విరమణ చేసిన సిబ్బందికి వేతన సవరణ, తదితర డిమాండ్లతో వారు సమ్మె సైరన్ మోగించనున్నారు.