చర్చ వద్దు.. సమాధానమే కావాలి!
రాజ్యసభలో బుధవారం విచిత్రమైన పరిస్థితి ఏర్పడింది. ప్రతిపక్ష సభ్యులు కోరిన అంశంపై చర్చకు అధికార పక్షం సరేనని చెప్పినా.. బీఎస్పీ సభ్యులు మాత్రం తమకు చర్చ అవసరం లేదని, తమ పార్టీ అధినేత్రి మాయావతి తన ప్రసంగంలో వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం నుంచి తక్షణం సమాధానం కావాలని పట్టుబట్టారు. ఉదయం రాజ్యసభ సమావేశం అయిన తర్వాత మాయావతి తనకు కేటాయించిన సమయం కంటే మరింత అదనపు సమయం తీసుకుని.. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య అంశాన్ని ప్రస్తావించారు. ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని సెంట్రల్ యూనివర్సిటీలలో రుద్దాలని చూస్తోందని ఆరోపించారు. తాను ప్రస్తావించిన అంశాలకు ప్రభుత్వం వెంటనే సమాధానం చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. దాంతో కేంద్ర మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ కల్పించుకుని, ఈ అంశంపై రెండు గంటల పాటు చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. చర్చ తర్వాత అధికారపక్షం నుంచి సమాధానం వస్తుందన్నారు.
కానీ, అందుకు బీఎస్పీ సభ్యులు ససేమిరా అన్నారు. పోడియం వద్దకు దూసుకెళ్లి నినాదాలు చేయడం మొదలుపెట్టారు. సభను ఎన్నిసార్లు 10, 15 నిమిషాల చొప్పున వాయిదా వేసిన ప్రయోజనం కనిపించలేదు. చివరకు మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి సమావేశమైన తర్వాత కూడా అదే పరిస్థితి నెలకొంది. సభా నాయకుడు అరుణ్ జైట్లీ కల్పించుకుని, రెండు గంటల పాటు దీనిపై చర్చిద్దామని, వాళ్లు లేవనెత్తే ప్రతి ఒక్క ప్రశ్నకూ తాము సమాధానం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. దాంతో సీతారాం ఏచూరిని చర్చ ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ కోరారు. ఆయన మాట్లాడేలోపే సభలో గందరగోళం యథాతథంగా కొనసాగింది. ఇలాగే అయితే తాను చర్యలు తీసుకోక తప్పేలా లేదని కురియన్ హెచ్చరించినా ఫలితం కనిపించలేదు. ఆ సమయంలో ఆయన సభను మరో 15 నిమిషాలు వాయిదా వేశారు.