యువతపైనే దేశ భవిష్యత్ : సీపీ
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్ : దేశ భవిష్యత్తు యువతపైనే ఆధారపడి ఉంటుందని నగర పోలీసు కమిషనర్ బీ శ్రీనివాసులు అన్నారు. స్థానిక పీబీ సిద్ధార్థ కళాశాలలోకృష్ణా యూనివర్సిటీ అంతర్ కళాశాలల షటిల్ బ్యాడ్మింటన్ పోటీలను బుధవారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో రాణించిన వారికి పేరు ప్రఖ్యాతులొస్తాయని తెలిపారు. అంతేకాకుండా ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉంటాయన్నారు. కేవలం చదువే కాకుండా క్రీడల్లో ప్రవేశం ద్వారా పనిలో వత్తిడి తగ్గుతుందన్నారు.
దీంతో శారీరక, మానసిక ఆరోగ్యం పెంపొందుతుందని చెప్పారు. సిద్ధార్థ అకాడమీ అధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఆటల్లో రాణించి దేశ ఉన్నత పదవులు చేపట్టినవారెందరో ఉన్నారన్నారు. యూనివర్సిటీ స్పోర్ట్స్ బోర్డు కార్యదర్శి డాక్టర్ ఎన్ .శ్రీనివాసరావు మాట్లాడుతూ సిద్ధార్థ అకాడమీ క్రీడాకారులకు కావాల్సిన మౌలిక సదుపాయలు కల్పిస్తుందని తెలిపారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పద్మారావు మాట్లాడుతూ సాధించాలనే పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని చెప్పారు.
ప్రారంభోత్సవ కార్యక్రమంలో కళాశాల పీడీ పోటీల కార్యనిర్వాహక కార్యదర్శి ఎం.సజీవరెడ్డి, అకాడమీ పరిపాలనా అధికారి వై.చక్రధర్‌రావు, డెరైక్టర్ వీ బాబూరావు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మహిళల విభాగంలో మేరిస్ స్టెల్లా కళాశాల, ఎస్వీడీ లా కళాశాల జట్లు ఫైనల్స్‌కు చేరుకోగా, పురుషుల విభాగంలో డీఏఆర్ కళాశాల (నూజివీడు), పీబీ సిద్ధార్థ కళాశాల జట్లుఫైనల్స్కు చేరుకున్నాయి.
లీగ్ మ్యాచ్ లు: పురుషుల విభాగంలో
ఆంధ్ర లయోల కళాశాల జట్టు 3-0 తేడాతో ఎస్జీఎస్ కళాశాల (జగ్గయ్యపేట)పై, నలందా డిగ్రీ కళాశాల 3-0 తేడాతో శాతవాహన కళాశాలపై, డీఏఆర్ కళాశాల (నూజివీడు) 3-1 తేడాతో మడోనా కళాశాల జట్టుపై, పీబీ సిద్ధార్థ కళాశాల 3-0 సప్తగిరి కళాశాల జట్టుపై, ఆంధ్ర లయోలా కళాశాల జట్టు 3-0 తేడాతో కేబీఎన్ కళాశాల జట్టుపై గెలుపొందాయి. నూజివీడు డీఏఆర్ కళాశాల జట్టు 3-1 తేడాతో ఆంధ్ర లయోల కళాశాలపై, పీబీ సిద్ధార్థ జట్టు 3-0 తేడాతో విశ్వభారతి డిగ్రీ కళాశాల (జగ్గయ్యపేట)జట్టుపై విజయం సాధించి ఫైనల్స్‌కు చేరుకున్నాయి.
మహిళల విభాగంలో..నందిగామ కేవీఆర్ కళాశాల జట్టు 2-0 తేడాతో నలందా డి గ్రీ కళాశాలపై, ఆంధ్ర లయోల కళాశాల జట్టు 2-0 తేడాతో పీబీ సిద్ధార్థ కళాశాలపై, ఎస్వీడీ లా కళాశాల జట్టు 2-0 తేడాతో గుడివాడ ఏఎన్ఆర్ డిగ్రీ కళాశాల జట్టుపై, సిద్ధార్థ మహిళా కళాశాల జట్టు 2-0 తేడాతో నూజివీడు డీఏఆర్ కళాశాల జట్టుపై, స్టెల్లా కళాశాల జట్టు 2-0 తేడాతో నందిగామ కేవీఆర్ కళాశాల జట్టుపై, ఎస్వీడీ లా కళాశాల జట్టు 2-1 తేడాతో సిద్ధార్థ పై గెలుపొందాయి.