కచ్చితమైన నిరక్షరాస్యుల నివేదిక అందించాలి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో నిరక్షరాస్యులకు సంబంధించి కచ్చితమైన నివేదిక అందించాలని కలెక్టర్ జీఎస్ఆర్కేఆర్ విజయకుమార్ ఆదేశించారు. వయోజన విద్యాశాఖ అధికారుల గణాంకాలకు, ఇందిరక్రాంతి పథం సభ్యుల సర్వే నివేదికలకు వ్యత్యాసాలున్నాయన్నారు. వాటిని సవరించి కచ్చితమైన నివేదిక ఇవ్వాలన్నారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ కాన్ఫరెన్స్ హాలులో శుక్రవారం అక్షర విజయం కార్యక్రమం అమలుపై తీసుకోవాల్సిన చర్యల గురించి అధికారులతో ఆయన సమీక్షించారు.
జిల్లాలో 6.22 లక్షల మందిని నిరక్షరాస్యులుగా గుర్తించారని, వారిని అక్షరాస్యులుగా చేసేందుకు 20,970 కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం గుర్తించిన నిరక్షరాస్యులతోపాటు డిసెంబర్ నెలాఖరుకు అభ్యాసకులుగా ఉత్సాహం ఉన్నవారిని అందులో తీసుకోవాలని సూచించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఎప్పటికప్పుడు నివేదికలు అందించాలన్నారు. జిల్లాలో అక్షరాస్యత కేంద్రాలు ప్రారంభం కానిచోట రెండు రోజుల్లో ప్రారంభించాలని ఆదేశించారు. అధికారులు కుంటిసాకులు చెప్పి ఇతరులపై నిందలు మోపడం మానుకొని కార్యాచరణకు పూనుకోవాలన్నారు.
వలసలు వెళ్లి వచ్చిన వారి కోసం ప్రత్యేక కేంద్రాలు...
పనుల కోసం వలసలు వెళ్లి వచ్చిన వారి వివరాలు సేకరించాలని కలెక్టర్ ఆదేశించారు. వలసలు వెళ్లివచ్చిన వారికోసం ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు. వలంటీర్ల కొరత ఉన్నచోట ఇతర శాఖల నుంచి తీసుకోవాలన్నారు. యర్రగొండపాలెం, బల్లికురవ, త్రిపురాంతకం మండలాల్లో అధిక సంఖ్యలో నిరక్షరాస్యులు ఉన్నారన్నారు. ఆ మండలాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. అక్షరాస్యత కేంద్రాలకు పలకలు, పుస్తకాలు, పెన్సిళ్లు, రోల్ బ్లాక్ బోర్డులు అందించేందుకు చర్యలు చేపట్టాలన్నారు. అభ్యాసకులకు పలకలు, పుస్తకాలు అందించేందుకు అవసరమైనచోట దాతల సహకారం తీసుకోవాలన్నారు. రోజూ అక్షరాస్యత కేంద్రాలను అధికారులు తప్పకుండా సందర్శించాలని ఆదేశించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ యాకూబ్ నాయక్, వయోజన విద్య ఉపసంచాలకుడు వీరభద్రయ్య, ముఖ్య ప్రణాళికాధికారి కేటీ వెంకయ్య, డీఆర్డీఏ పీడీ పద్మజ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజు, డ్వామా పీడీ కే పోలప్ప, ఒంగోలు నగర పాలక సంస్థ కమిషనర్ సీహెచ్ విజయలక్ష్మి, తహసీల్దార్లు, మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.