బీటీ బ్యాచ్... ఆ ఐదుగురు వారే..!
హైదరాబాద్: రాష్ట్ర రాజకీయ వర్గాల్లోకి ఇటీవల కొత్తగా చేరిన పదం ‘బీటీ’ బ్యాచ్. అంటే బంగారు తెలంగాణ బ్యాచ్ అన్నమాట. తెలంగాణ ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేకుండా ... తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాత ‘బంగారు తెలంగాణ’ కోసం గులాబీ గూటికి చేరిన బ్యాచ్ అన్నమాట. ఉద్యమ సమయంలో టీఆర్ఎస్ను, ఆపార్టీ నేత కేసీఆర్‌ను దూషించి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు వద్ద మార్కులు కొట్టేసిన వారు... సోనియా దయతోనే తెలంగాణ వచ్చిందని గంటలు భజాయించి మరీ చెప్పిన వారు... కేసీఆర్ అధికారంలోకి వచ్చాక ‘బంగారు తెలంగాణ కోసం’ టీఆర్ఎస్లో చేరిన నేతలను ఎద్దేవా చేస్తూ పెట్టిన పేరు ఇది. టీఆర్ఎస్లో ఇప్పుడు బీటీ బ్యాచ్‌దే హవా.
మంత్రి వర్గంలో కీలక పదవులు పొందిన నేతలు వారే! ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీట్లు పొందిన ఐదుగురు కూడా బీటీ బ్యాచే నని టీడీపీ నేత రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేస్తున్నారు. మంత్రులుగా ఉన్న తుమ్మల, కడియం శ్రీహరిలను ఎమ్మెల్సీలుగా చేయడం తప్పనిసరి కావడంతో వారికి సీట్లిచ్చిన కేసీఆర్... కౌన్సిల్లో స్వామి గౌడ్ చెర్మైన్ కావడానికి పార్టీ మారిన మాజీ టీడీపీ నేత బి. వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ ఎమ్మెల్సీలు నేతి విద్యాసాగర్, యాదవరెడ్డిలకు అవకాశం ఇచ్చారు. శాసనసభ ఎన్నికల సమయంలో జిల్లాల వారీగా టిక్కెట్లు ఆశించి భంగపడ్డ ఉద్యమ టీఆర్ఎస్ నేతలకు అప్పట్లో ఎమ్మెల్సీల ఆశ చూపిన కేసీఆర్ బీటీ బ్యాచ్‌కే అవకాశం ఇచ్చారని గుసగుసలు వినిపిస్తున్నాయి.