ఆశలు ‘గల్లంతు’!
వారంతా భావి ఇంజినీర్లు. మరో రెండు నెలల్లో బీటెక్ ఫైనల్ ఇయర్ పరీక్షలు రాసి,కన్నవారి కలలను సాకారం చేసేందుకు సిద్ధమవుతున్నారు. అంతలోనే అందరి ఆశలు గల్లంతయ్యాయి. శివరాత్రి సందర్భంగా కాలేజీకి సెలవు కావడంతో గరివిడి అవంతి సెయింట్ థెరిసా ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన బీటెక్ ఫైనల్ ఇయర్ విద్యార్థులు ఆరుగురు శ్రీకాకుళం జిల్లా శ్రీముఖలింగేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లారు. వారిలో ముగ్గురు గొట్టాబ్యారేజీ వద్ద వంశధార నదిలో గురువారం సాయంత్రం గల్లంతయ్యారు. ఈ ముగ్గురూ విశాఖపట్నానికి చెందినవారే. విషయం తెలుసుకున్న వారి తల్లిదండ్రులు తీవ్ర వేదనతో, తమ పిల్లలు బతికిబట్టకట్టాలంటూ ముక్కంటిని మొక్కుకుంటూ సంఘటన స్థలానికి బయలుదేరారు. తోటి విద్యార్థులు భోరున విలపిస్తున్నా రు. ఈ వార్త గ్రామంలో తెలియడంతో విషాదం అలుముకుంది.
గరివిడి/హిరమండలం, న్యూస్‌లైన్: శివరాత్రి పుణ్యదినాన శివుడిని దర్శించుకుంటే ముక్తి కలుగుతుందని భావించారు. స్నేహితుని ఆహ్వానం మేరకు జలుమూరు మండలం శ్రీముఖలింగంలోని ముఖలింగేశ్వరుని దర్శనం కోసం ఆరుగురు విద్యార్థులు సరదాగా వచ్చారు. ఆలయం వద్ద రద్దీ అధికంగా ఉండడంతో దగ్గరలోని గొట్టాబ్యారేజీకి చేరుకున్నారు. అక్కడే కాసేపు సరదాగా గడిపి స్నానం కోసం నలుగురు విద్యార్థులు వంశధార నదిలో దిగారు. ఇందులో ముగ్గురు గల్లంతయ్యారు. వివరాల్లోకి వెళ్తే... విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని అవంతి సెయింట్ థెరిసా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ ఫైనల్ ఇయర్ మెకానిక్ విభాగంలో చదువుతున్న గిరిజాల కిశోర్ రాజు, కర్రి అజయ్ వెంకట కుమార్, గొండేసి అప్పలరెడ్డి, ప్రవీణ్ కుమార్, కృష్ణ, శుభారంజన్ మాలిక్‌లు కలిసి గురువారం ఉదయం ఆరు గంటలకి పూరి- తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో శ్రీకాకుళం రోడ్‌కు చేరుకున్నా రు.
అక్కడి నుంచి శ్రీముఖలింగం చేరుకున్నారు. స్నేహితులు ఆరుగురిలో ప్రవీణ్ కుమార్‌ది జలుమూరు మండలం మర్రివలస కావడంతో, ఆయన ముఖలింగేశ్వర దేవాలయాన్ని దర్శించుకునేందుకు ఐదుగురు స్నేహితులని ఆహ్వానించాడు. దర్శనం కోసం వీరు ఆరుగురు ఆలయం వద్దకు చేరుకునే సరికి భక్తుల రద్దీ అధికంగా ఉంది. సాయంత్రం స్వామివారిని దర్శించుకోవచ్చని భావించి మధ్యాహ్న భోజనాల అనంతరం 3 గంటల సమయంలో ఆలయ సమీపంలోని గొట్టాబ్యారేజీ చూసేందుకు వెళ్లారు. అక్కడే కాసేపు సరదాగా గడిపారు. అనంతరం స్నానం చేద్దామని భావించారు. వీరిలో ప్రవీణ్‌కుమార్ , కృష్ణలకు ఈతరాకపోవడంతో ఒడ్డునే ఉన్నారు. కాస్తాకూస్తో ఈతవచ్చంటూ మిగిలిన నలుగురు గొట్టాబ్యారేజీ వద్ద స్నానానికి దిగారు.
చూస్తుండగానే పాతగాజువాక శ్రామిక నగర్‌కు చెందిన జి.కిశోర్‌రాజు(22), పెదగంట్యాడ సిద్ధేశ్వరానికి చెందిన గొందేసు అప్పలరెడ్డి(23), పాతగాజువాక శ్రీహరిపురానికి చెందిన అజయ్వెంకటకుమార్(23)లు మునిగిపోవడంతో వారితో స్నానానికి దిగిన శుభరంజన్ గట్టిగా కేకలు వేశాడు. దీనిని గమనించిన ఒడ్డున ఉన్న కృష్ణ, ప్రవీణ్‌కుమార్‌లు రక్షించండంటూ కేకలు వేయడంతో స్థానికులు చేరుకున్నారు. వారు దిగేలోపే ముగ్గురు విద్యార్థులు మాయమయ్యారు. గల్లంతైన ముగ్గురు విద్యార్థులదీ విశాఖపట్నమే కావడం గమనార్హం. విద్యార్థులు వెంటనే బంధువులకు, పోలీసులకు, కళాశాలకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి బంధువులు, స్నేహితులు, కళాశాల సిబ్బంది చేరుకుని గాలించినా రాత్రి వరకు ఆచూకీ లభించలేదు. పాతపట్నం సీఐ జె.శ్రీనివాసరావు, హిరమండలం ఎస్సై ఎ.శ్రీనివాస్‌తో సహా పోలీసు లు, కొత్తూరుకు చెందిన అగ్నిమాపక సిబ్బంది రంగప్రవేశం చేసి గల్లంతైన విద్యార్థుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.
ముగ్గురివీ మధ్యతరగతి కుటుంబాలే...
గల్లంతైన ముగ్గురు విద్యార్థులవీ సాధారణ మధ్యతరగతి కుటుంబాలే. కిశోర్ రాజు తండ్రి వెంకటరమణరాజు లారీ డ్రైవర్‌గాను, అజయ్ వెంకటకుమార్ తండ్రి గురనాథరావు కార్పెంటర్‌గా, అప్పలరెడ్డి తం డ్రి స్టీల్‌ప్లాంట్ ఎంప్లాయిగా పనిచేస్తున్నారు. ఆదుకోవాల్సిన కుమారులు నదిలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులందరూ భోరున విలపిస్తున్నారు.