భలే భలే... బబుల్గమ్ అలే!
విహంగం
పర్యాటకులను ఆకర్షించే ఎన్నో విశేషాలున్నాయి అక్కడ.
అయితే పర్యాటకులు వాటిలో దేన్ని చూడ్డానికీ వెళ్లరు.
సిటీలో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరూ మొదట అడిగే ప్రశ్న
‘బబుల్గమ్ అలే ఎక్కడ ఉంటుంది?’ అని.
ఇంతకీ ఏమిటీ బబుల్గమ్ అలే?!
మీ మనసులో కోరిక షార్ట్‌టైమ్‌లో నెరవేర్చుకోవాలనుందా?
మీ కష్టాన్ని దుమ్ము దులిపి సుఖపడాలనుందా?
మీరు ప్రేమించిన వారితో మీ బంధం దృఢపడాలనుందా?
మీ అదృష్టరేఖ అదేపనిగా వెలిగిపోవాలనుందా?
అయితే ఛలో బబుల్గమ్ అలే!
‘ఇక చాల్లే’ అని మీరు అనుకున్నా అనుకోకపోయినా, నమ్మినా నమ్మక పోయినా ప్రపంచ పర్యాటకులలో చాలా మంది ‘బుబల్గమ్ అలే’ మహత్తును నమ్ముతున్నారు. ‘కోరికలు నెరవేరే వీధి’ అంటూ బబుల్గమ్ అలేను గౌరవంగా పిలుచుకుంటున్నారు.
కాలిఫోర్నియా(యు.ఎస్)లోని ఒక అందమైన నగరం సాన్ లూయిస్ ఒబిస్పో. 1772లో నిర్మితమైన ఈ నగరాన్ని స్థానికంగా సాన్ లూయిస్, యస్ఎల్ఓ టౌన్’అని కూడా పిలుస్తుంటారు. బిషప్ పీక్ అనే పర్వతం మీది నుంచి చూస్తే ఈ నగర సౌందర్యం గొప్పగా కనిపిస్తుంది. పచ్చని కొండలు, తెల్లని పొగమంచుతో చేయి తిరిగిన చిత్రకారుడి కుంచె నుంచి జాలువారిన తైలవర్ణ చిత్రంలా కనిపిస్తుంది.
పురాతనమైన సుందర భవనాలు, కాల్ పాలీ పెర్ఫార్మింగ్ ఆర్ట్స్ సెంటర్, బిషప్ పీక్, చారిత్రక మ్యూజియం, శిల్పకళా సంపద... ఇలా పర్యాటకులను ఆకర్షించే ఎన్నో విశేషాలున్నాయి అక్కడ. అయితే పర్యాటకులు వాటిలో దేన్ని చూడ్డానికీ వెళ్లరు. సిటీలో అడుగు పెట్టగానే ప్రతి ఒక్కరూ మొదట అడిగే ప్రశ్న ‘బబుల్గమ్ అలే ఎక్కడ ఉంటుంది?’ అని. ఇంతకీ ఏమిటీ బబుల్గమ్ అలే?!
బబుల్గమ్ అంటే మనకి తెలుసు. అలే అంటే సందు. ఓ సందులో బబుల్‌గమ్‌లు అంటించడం వల్ల దాన్ని బబుల్గమ్ అలే అంటున్నారు. హిగుయేర స్ట్రీట్‌లోని ఒక సందులో 15 అడుగుల ఎత్తు ఉన్న రెండు గోడలపై సందర్శకులు బుబుల్ గమ్స్‌ను అంటిస్తుంటారు. దాని వల్ల మంచి జరుగుతుందని, కోరికలు నెరవేరుతాయని స్థానికుల నమ్మకం. ఈ నమ్మకం గురించి భిన్నమైన కథనాలు ప్రచారంలో ఉన్నాయి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో ‘సాన్ లూయిస్ హైస్కూల్’ విద్యార్థుల ద్వారా ఇలా బబుల్గమ్స్ అంటించే సంప్రదాయం మొదలైందనేది ఒక కథనం. విద్యార్థులు సరదాగా చేసిన పనికి కాలక్రమంలో అనేక కథలు తోడై సంప్రదాయమైందంటారు.
మరో కథనం ఏమిటంటే 1950 ప్రాంతంలో ‘సాన్లూయిస్ హైస్కూల్’, ‘కాలిఫోర్నియా పాల్టెక్నిక్ స్టేట్ యూనివర్శిటీ’ విద్యార్థుల మధ్య తగాదాలు పెరిగాయట. దాంతో వారి కోపాన్ని ప్రదర్శించడానికి ఒక కాగితంపై తిట్లు రాసి, దాన్ని బబుల్గమ్తో హిగుయేర వీధిలోని గోడలకు అతికించడం మొదలు పెట్టారట. ఇలా చేయడం వల్ల అపరిశుభ్ర పరిస్థితులు నెలకొంటున్నాయని స్థానిక వ్యాపారులు ఫిర్యాదు చేయడంతో, గోడలపై నుంచి బబ్లుగమ్లను ఎప్పటికప్పుడు తీసేసేవాళ్లు.
అయితే మరుసటి రోజుకి పరిస్థితి యథాతథం. దాంతో వాటినలాగే వదిలేయడం మొదలుపెట్టారు. అయితే మెల్లగా విద్యార్థుల మధ్య గొడవలు తగ్గాయి. స్నేహం పెరిగింది. కానీ బబుల్ గమ్ అంటించే అలవాటు మాత్రం పోలేదు. అప్పటి వరకూ తిట్టు అంటించిన వాళ్లు ఆ తర్వాత అభిమానాన్ని వెల్లడిస్తూ అంటించడం మొదలు పెట్టారు. కాల క్రమంలో అది సెంటిమెంటులా మారింది.
తర్వాత మెల్లగా ఈ బబుల్‌గమ్‌ల సెంటిమెంట్ గురించి ప్రపంచమంతా తెలిసిపోయింది. దీని గురించి ఎన్నో టెలివిజన్ షోలు, ప్రత్యేకవార్తా కథనాలు ప్రసారమయ్యాయి. న్యూయార్క్ టైమ్స్, లాస్ ఎంజెల్స్ టైమ్స్ మొదలైన పత్రికలు ఈ నగరం గురించి వ్యాసాలు ప్రచురించాయి. వాటికి మౌత్ పబ్లిసిటీ కూడా తోడవటంతో సాన్ లూయిస్ ప్రముఖ టూరిస్టు కేంద్రంగా మారి పోయింది. ‘మిస్టర్ మాంక్ ఆన్ ద రోడ్’ లాంటి ఎన్నో నవలలో దీని ప్రస్తావన ఉంది. చివరికి ఈ బబుల్గమ్ గోడలు గిన్నిస్‌బుక్‌లోకి కూడా ఎక్కాయి. సాన్ లూయిస్‌కి వచ్చి బబుల్‌గమ్‌లు అతికించి, కావలసినవి కోరుకునేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోందని స్థానికులు అంటున్నారు. తమ నగరానికి వచ్చిన ఈ ఖ్యాతిని చూసి గర్విస్తున్నారు.