కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి బలం
- మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
తాళ్లూరు : కార్యకర్తలే వైఎస్సార్ సీపీకి బలమని ఆ పార్టీ దర్శి నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి అన్నారు. గుంటి గంగా భవానీ తిరునాళ్ల సందర్భంగా మండలంలోని శివరామపురం, దొసకాయలపాడు, నాగంబొట్లవారిపాలెం గ్రామాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు ఏర్పాటు చేసిన ప్రభలపై గురువారం రాత్రి ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో పేదవానికి ఇళ్లు మంజూరు చేయకుండా కేంద్రం ఇచ్చిన నివాసాలను కూడా సక్రమంగా నిర్మించకుండా చంద్రబాబు మాత్రమే రూ.కోట్ల విలువైన విలాసవంతమైన భవనాన్ని నిర్మించుకోవడంతో ప్రజలు విస్తుపోతున్నారన్నారు.
సీఎం చంద్రబాబు ప్రలోభాలు, బెదిరింపులకు దిగి పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఏమీ చేయలేరని అన్నారు. ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ ప్రతిపక్షాలను నిర్వీర్యం చేసేందుకు సీఎం చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మనోధైర్యాన్ని ఇటువంటి చర్యలు దెబ్బతియ్యలేవని బూచేపల్లి పేర్కొన్నారు. కార్యకర్తలు అధైర్య పడొద్దని, రాబోవు కాలంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం కావటం ఖాయమన్నారు. సాధ్యంకాని హామీలతో ప్రజలను మభ్యపెట్టి చంద్రబాబు సీఎం అయిన విషయం ప్రతి ఒక్కరికీ తెలుసన్నారు. అనంతరం ప్రభల నిర్వాహకులు బూచేపల్లిని గజమాలతో సన్మానించారు.
బూచేపల్లి మెదట గుంటి గంగ భవానీ అమ్మవారిని సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. బూచేపల్లితో పాటు ఎంపీపీ గోళ్లపాటి మోషే, జెడ్పీటీసీ మారం వెంకటరెడ్డి, పార్టీ జిల్లా కార్యదర్శి దుగ్గిరెడ్డి రమణారెడ్డి, మాజీ సర్పంచి నరసింహారెడ్డి, నాయకులు అనీల్‌కుమార్‌రెడ్డి, బాలనాగిరెడ్డి, ఆదాం షరీఫ్, కోట వెంకటరామిరెడ్డి, ఏడుకొండలు, వేణుగోపాల్‌రెడ్డి, కొమ్మిరెడ్డి పెద, చిన అంజిరెడ్డి, ప్రభల నిర్వాహకులు ఉన్నారు.