బెల్ట్‌షాపుల నిర్మూలనకు కమిటీ!
* బుచ్చిబాపన్నపాలెంలో బెల్ట్‌షాపుల నిర్మూలన కమిటీ ఏర్పాటు
* ఎమ్మెల్యే ఫిర్యాదుతో అధికారుల్లో చలనం
నరసరావుపేట టౌన్: గ్రామంలో బెల్ట్ షాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఎక్సైజ్ ఎస్ఐ ఏవీఎస్ ప్రసాద్ హెచ్చరించారు. బుచ్చిబాపన్నపాలెంలో సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని అమలు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గ్రామస్తులతో కలసి బుధవారం జిల్లా కలెక్టర్ కాంతిలాల్‌దండేకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన నరసరావుపేట ఎక్సైజ్ శాఖ సీఐ వి.వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం ఆ గ్రామంలో బెల్ట్ షాపుల నిర్మూలన గ్రామస్థాయి నూతన కమిటీని ఏర్పాటుచేశారు. కమిటీకి కన్వీనర్‌గా ఎస్ఐ, అధ్యక్షురాలిగా గ్రామసర్పంచ్ గజ్జల నాగమల్లేశ్వరి, సభ్యులుగా వీఆర్ఓ కొండపరెడ్డి రమణారెడ్డి, పంచాయతీ కార్యదర్శి కాటూరి సురేష్‌బాబు, ప్రధానోపాధ్యాయురాలు రేవతి, డ్వాక్రా మహిళలు కాకుటూరి లక్ష్మమ్మ, సీమల అంజమ్మ, గ్రామపెద్దలు గజ్జల ముసలారెడ్డి వ్యవహరిస్తారన్నారు.
గ్రామంలో ప్రత్యేక నిఘా : సీఐ
బుచ్చిబాపన్నపాలెం గ్రామంలో మద్యం విక్రయాలు పూర్తిస్థాయిలో అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు సీఐ వి.వెంకటేశ్వరరావు చెప్పారు. ప్రతిరోజూ ఒక కానిస్టేబుల్ గ్రామంలో విధులు నిర్వహించేలా చూస్తామన్నారు. గ్రామంలో ఎక్కడైనా మద్యం విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం ఉంటే 94409 02484, 99490 95788 నంబర్లకు సమాచారం అందించాలని కోరారు.