ప్రభుత్వం పెద్దల పక్షమా
- బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు
కర్నూలు (న్యూసిటీ): అట్టడుగున ఉన్న బుడగజంగం కులస్తులను పట్టించుకోకుండా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన కాపులను బీసీలో చేర్చేందుకు ప్రయత్నిస్తున్న టీడీపీ ప్రభుత్వం పెద్దల పక్షం వహించేలా ఉందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు ఆరోపించారు. ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్‌తో బుడగ జంగాలు బుధవారం కలెక్టరేట్ ఎదుట చేపట్టిన మహా ధర్నాకు నక్కలమిట్టతో పాటు సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు,, ప్రజా సంఘాల నాయకులు టి.నారాయణ, అజయ్‌కుమార్, గిరిజన హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు కైలాస్‌నాయక్ తదితరులు మద్దతు తెలిపారు. అంతకుముందు బుడగజంగం యువజన విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో బడగజంగాలు డప్పులు, తంబూరాలు వాయిస్తూ, హరికథ చెబుతూ రాజవిహార్ సర్కిల్లో నుంచి చేసి, కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా నక్కలమిట్ట శ్రీనివాసులు మాట్లాడుతూ అన్ని రంగాల్లో వెనకబడి ఉన్న బుడగజంగాలను ఎస్సీ జాబితాలో చేర్చాలన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కె.రామాంజనేయులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుడగజంగం వారికి న్యాయం చేస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలన్నారు. బుడగజంగం యువజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు టి.మనోహర్ మాట్లాడుతూ బుడగ జంగాలను ఎస్సీ జాబితాలో చేర్చే వరకు పోరాటం ఆపేది లేదన్నారు. మాట మార్చిన చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. ధర్నాలో బుడగ జంగం సంఘం నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, సహాయ కార్యదర్శి రంగస్వామి, నాయకులు సురేష్‌బాబు, సోమశంకరయ్య, టి.సుధాకర్, బంగారప్ప, డి.రాముడు, పక్కీరప్ప, మహిళలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఏజేసీ రామస్వామికి వినతిపత్రం అందజేశారు.