చిరస్మరణీయులు..రేనాటి సూర్యచంద్రులు
ఉయ్యాలవాడ: రేనాటి సూర్యచంద్రులు.. చిరస్మరణీయులని రాయలసీమ ఐడీసీ ఎస్ఈ శివారెడ్డి అన్నారు. శనివారం ఉయ్యాలవాడలోని బుడ్డా విశ్వనాథరెడ్డి స్వగృహంలో బుడ్డా వెంగళరెడ్డికి విక్టోరియా మహారాణి బహూకరించిన బంగారు పతకాన్ని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు మీద విడుదల చేయనున్న పోస్టల్ స్టాంప్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రాయలసీమ జిల్లాల్లో ఎత్తిపోతల పథకాల నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చినట్లు వెల్లడించారు. ఉయ్యాలవాడ మండలంలోని బోడెమ్మనూరు, ఉయ్యాలవాడ గ్రామాల్లో రూ. 3.30 కోట్లతో జరుగుతున్న ఎత్తిపోతల పథకాల నిర్మాణాను పరిశీలించామన్నారు. కుందూనదికి అనుసంధానంగా మల్లెవేముల, జూపాడుబంగ్లా, టంగుటూరు, జుర్రేరు.. అలాగే ఎస్సార్బీసీకి అనుసంధానంగా అక్కజమ్మ రిజర్వాయర్ పరిధిలోఎత్తిపోతల పథకాలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కుందూనదికి అనుసంధానంగా రూ. 10 కోట్లతో లిప్ట్ ఇరిగేషన్ నిర్మాణం పనులు కొనసాగుతుండగా, రిజర్వాయర్ల పరిధిలో ఏర్పాటుకు రూ. 25 కోట్లతో ప్రతిపాదనలు పంపినట్లు ఆయన స్పష్టం చేశారు. ఆయన వెంట డీఈ తిమ్మన్న, సిబ్బంది ఉన్నారు.