buddhapurnima project
-
అవినీతి జాడ్యానికి బదిలీల చికిత్స
=సంస్కరణలకు కమిషనర్ శ్రీకారం =హెచ్ఎండీఏలో మూకుమ్మడి బదిలీలు సాక్షి, సిటీబ్యూరో : అవినీతి, అక్రమాలతో అపకీర్తిని మూటగట్టుకొన్న ెహ చ్‌ఎండీఏను సంస్కరించేందుకు ఎట్టకేలకు ఒక్క అడుగు ముందుకు పడింది. దీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతూ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొన్న కొందరు ఉద్యోగులకు స్థానభ్రంశం కల్పిస్తూ హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ చర్యలు చేపట్టారు. ఈమేరకు ప్లానింగ్, అకౌంట్స్, ఇ.ఎం.యూ, ఆర్ అండ్ డి.ఓ., బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు విభాగాల్లో పనిచేస్తున్న వారిలో 10 మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు రాగా, మరికొందరిపై ఫిర్యాదులు కూడా అందాయి. ప్రధానంగా ప్రజలకు సేవలందించే విషయంలో కొందరు ఉద్యోగులు వెంటనే స్పందించకపోవడం, ప్రతిపనికీ ఓ రేటు నిర్ణయించి ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా వసూలు చేయడం, సొమ్ము చేతికి అందాకే ఫైల్ కదలడం, అకౌంట్స్ సెక్షన్లో చేయితడపనితే చెక్కు లివ్వకపోవడం వంటి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. వీటిపై అంతర్గతంగా విచారణ జరిపిస్తే విచారణాధికారిని కూడా ప్రలోభాలకు గురిచేస్తుండడంతో అక్రమాలు వెలుగు చూడకుండా పోతున్నాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి అన్ని అనుమతులు కేంద్ర కార్యాలయం నుంచే ఇస్తుండడం అక్రమార్కులకు మరింత కలిసి వస్తోంది. దీంతో హెచ్ఎండీఏ అవినీతి, అక్రమాల్లో మునిగి తేలుతోంది. బరువు పెట్టనిదే...: హెచ్ఎండీఏలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేతిలో బరువు పెట్టనిదే ఏ పనీ జరగదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ భూములు లీజ్‌కు తీసుకోవాలన్నా, సంస్థ సొంత భవనాలను అద్దెకు తీసుకోవాలన్నా, భూ వినియోగాన్ని మార్చుకోవాలన్నా, కొత్త లేఅవుట్లు, నూతన భవనాలకు పర్మిషన్ పొందాలన్నా, వ్యాపార-వాణిజ్య ప్రకటనల (హోర్డింగ్స్)కు అనుమతివ్వాలన్నా, ముందుగా మామూళ్లు ఇవ్వనిదే అనుమతులు అసాధ్యమన్నది బహిరంగ రహస్యమే. అభివృద్ధి పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు చెక్కు చేతికి అందాలంటే ఇక్కడ సంబంధిత సెక్షన్లలో చేతులు తడపాల్సిందే. లేదంటే సదరు కాంట్రాక్టరుకు చెప్పులు అరిగేలా అకౌంట్స్ విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. హెచ్ఎండీఏలో వేళ్లూనుకొన్న అవినీతి, అక్రమాలపై సచివాలయానికి నేరుగా ఫిర్యాదులందినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ దశలో మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తార్నాక కార్యాలయంలో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షిస్తూ అవినీతి అధికారులకు నేరుగా చురకలంటించినా వారు దులిపేసుకోవడం విస్మయం కల్గించింది. 10 మందికిబదిలీ హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 10 మందికి స్థానభ్రంశం కల్పిస్తూ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఆర్ అండ్ డీఓ విభాగంలో పనిచేస్తున్న లలితను ల్యాండ్ పూలింగ్ సెక్షన్ ఎ.ఒ.గా, ప్లానింగ్ విభాగం ఏఓగా ఉన్న శోభను పీపీ సెల్ విభాగానికి, అకౌంట్స్ సెక్షన్లో డీఏఓ-1గా ఉన్న పి.చంద్రశేఖర్ ఆజాద్‌ను హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌ల డీఏఓగా, ఘట్కేసర్ జోనల్ ఆఫీసులో ఏపీఓగా పనిచేస్తున్న నిరంజన్ బాబును ప్లానింగ్ యూనిట్ 2-బికి బదిలీ చేశారు. అలాగే ఈఎంయూ విభాగంలో డీఏఓగా పనిచేస్తున్న నాగజ్యోతిని అకౌంట్స్ విభాగానికి, ఆర్ అండ్ డి.ఓ. సెక్షన్లో ఎ.ఒ.గా ఉన్న శకుంతలను అకౌంట్స్ విభాగానికి, ఘట్కేసర్ జోనల్ ఆఫీసులో ఎ.ఒ.గా ఉన్న జ్ఞానేశ్వర్‌ను ఆర్ అండ్ డి.ఒ. సెక్షన్లో ఎ.ఒ.గా, బీపీపీలో పనిచే స్తున్న చారిని అకౌంట్స్ సెక్షన్లో డీఏఓగా, హెర్మిటేజ్ విభాగంలో డీఏఓగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ను ఈఎంయూ సెక్షన్‌కు బదిలీ చేశారు. ఇప్పటివరకు హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌లకు డీఏఓగా ఉన్న ప్రసాద్‌ను ఆర్ అండ్ డి.ఒ.కు రిపోర్టు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. -
సంస్థ ఆదాయంపై.. హెచ్ఎండీఏ మహా నిర్లక్ష్యం
సాక్షి, సిటీబ్యూరో : ఏ సంస్థ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకొంటుంది. అలాగే ఆదాయపు మార్గాల కోసం అన్వేషిస్తుంది. ఆదాయపు మార్గాలు కన్పిస్తే అందిపుచ్చుకొని పక్కాగా సద్వినియోగం చేసుకొంటుంది. కానీ హెచ్ఎండీఏకు మాత్రం ఇవేమీ పట్టడంలేదు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని పార్కుల ద్వారా ఆదాయం సమకూరే అవకాశాలు కార్యాలయం గడప తొక్కినా... అధికారులు కాలితో తన్నేస్తున్నారు. సొంత ఆదాయం తప్ప సంస్థ ఆదాయంపై దృష్టి పెట్టట్లేదు. దీంతో రూ.లక్షలాది వ్యయంతో రూ పుదిద్దుకొన్న వివిధ నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. హెచ్ఎండీఏ పరిధిలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ పార్కులు, ఇతర అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ)దే. అయితే, కొందరు అధికారుల తీరు సంస్థకు తీవ్ర నష్టాల్ని తెచ్చిపెడుతోంది. లుంబినీ పార్కు, లేజర్ షో ప్రాంగణాల్లో నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు. పదేళ్లుగా నిరపయోగం ... లుంబినీ పార్కు, లేజర్ షోలను తిలకించేందుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు. అయితే వీరికి వినోదం, విహారం అందిస్తు న్నా... ఆకలి బాధలు తీర్చేందుకు ఎలాంటి సౌకర్యం లేవు. తగిన నిర్మాణాలున్నా వాటిని వినియోగించు కోవడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. పదేళ్ల క్రితం లుంబినీ పార్కులో రెస్టారెంట్ కోసం 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. ఇందుకోసం రూ.15లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఆ నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ నిర్మాణాన్ని లీజ్కిస్తే అందులో ఫుడ్‌కోర్టు పెట్టుకొని నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తామని ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు దరఖాస్తు చేసుకొన్నా.. అధికారులు స్పందించలేదు. పదేళ్లుగా ఆ నిర్మాణం నిరుపయోగంగా ఉంది. దీన్ని లీజుకిచ్చి ఉంటే ఈ పాటికి లక్షలాది రూపాయలం ఆదాయం హెచ్ఎండీఏకు సమకూరేది. లెజేరియంలో కూడా... లుంబినీ పార్కులో లేజర్ షో కోసం 2005లో అద్భుతమైన నిర్మాణ ం చేశారు. ఏడాదిన్నర క్రితం రూ.60లక్షలు వెచ్చించి కార్పొరేట్ భవనంగా హంగులద్దారు. రెండంతస్తులు ఉన్న ఈ భవనం ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఇక్కడ చిల్డ్రన్ ఎమ్యూజ్మెంట్ పార్కు, ఫాస్టుఫుడ్ సెంటర్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు లీజ్‌కివ్వాలని పలు సంస్థలు దరఖాస్తు చేసుకొన్నాయి. ఇక్కడ నక్షత్ర హోటల్ నిర్వహించేందుకు ఓ సంస్థ నిర్వాహకుడు అమితాసక్తిని చూపారు. అయితే, హోటల్ నిర్వహణకు అనుమతి లేదంటూ తిరస్కరించారు. రెస్టారెంట్‌కు ఇక్కడ అనుమతి లేనప్పుడు రూ.లక్షలు వెచ్చించి లుంబినీ పార్కులో స్టీల్ స్ట్రక్చర్ ఎందు కు నిర్మించారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే లేజర్ షో పక్కనే ఉన్న ఓ క్లబ్లో రెస్టారెంట్ ఉంది, నెక్లెస్ రోడ్లో ఈట్ స్ట్రీట్, ఓరిస్ రెస్టారెంట్ వంటివాటికి అనుమతి ఉన్నప్పుడు.. హెచ్ఎండీఏ నిర్మించిన భవనాలు, స్ట్రక్చర్లకు ఎందుకు అనుమతి లేదన్నది అర్థంగాని విషయం. పార్కుల్లో స్థలాన్ని, నిర్మాణాలను లీజ్‌కిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని హెచ్ఎండీఏకు గతంలో ప్రభుత్వం సూచించింది. అయితే... అధికారులు మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండటంతో ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు. బీపీపీ అధికారులు మాత్రం అది తమకు సంబంధం లేని వ్యవహారంగా భావిస్తూ మిన్నకుండి పోయారు. దీంతో లుంబినీలోని స్టీల్ స్ట్రక్చర్ తుప్పుపడుతుండగా, లెజేరియం భవ నం మాత్రం మట్టి వినాయక విగ్రహాలను నిల్వ చేసేందుకు గోదాముగా మారిపోయింది. ఓ వైపు హెచ్ఎండీఏను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తుంటే... మరో వైపు బీపీపీ అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది.