సంస్థ ఆదాయంపై.. హెచ్‌ఎండీఏ మహా నిర్లక్ష్యం | Lease structures officers retreat | Sakshi
Sakshi News home page

సంస్థ ఆదాయంపై.. హెచ్‌ఎండీఏ మహా నిర్లక్ష్యం

Published Sun, Oct 27 2013 5:14 AM | Last Updated on Sat, Sep 2 2017 12:00 AM

Lease structures officers retreat

సాక్షి, సిటీబ్యూరో : ఏ సంస్థ అయినా కష్టాల్లో ఉన్నప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకొంటుంది. అలాగే ఆదాయపు మార్గాల కోసం అన్వేషిస్తుంది. ఆదాయపు మార్గాలు కన్పిస్తే అందిపుచ్చుకొని పక్కాగా సద్వినియోగం చేసుకొంటుంది. కానీ హెచ్‌ఎండీఏకు మాత్రం ఇవేమీ పట్టడంలేదు. బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు పరిధిలోని పార్కుల  ద్వారా  ఆదాయం సమకూరే అవకాశాలు కార్యాలయం గడప తొక్కినా... అధికారులు కాలితో తన్నేస్తున్నారు.

సొంత ఆదాయం తప్ప సంస్థ ఆదాయంపై దృష్టి పెట్టట్లేదు. దీంతో రూ.లక్షలాది వ్యయంతో రూ పుదిద్దుకొన్న వివిధ నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి. హెచ్‌ఎండీఏ పరిధిలోని హుస్సేన్‌సాగర్ చుట్టూ పార్కులు, ఇతర అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు (బీపీపీ)దే. అయితే, కొందరు అధికారుల తీరు సంస్థకు తీవ్ర నష్టాల్ని తెచ్చిపెడుతోంది. లుంబినీ పార్కు, లేజర్ షో ప్రాంగణాల్లో నిరుపయోగంగా ఉన్న నిర్మాణాలే ఇందుకు ప్రత్యక్ష సాక్ష్యాలు.
 
పదేళ్లుగా నిరపయోగం ...

లుంబినీ పార్కు, లేజర్ షోలను తిలకించేందుకు నిత్యం వందలాది మంది వస్తుంటారు. అయితే వీరికి వినోదం, విహారం అందిస్తు న్నా...  ఆకలి బాధలు తీర్చేందుకు ఎలాంటి సౌకర్యం లేవు.   తగిన నిర్మాణాలున్నా వాటిని వినియోగించు కోవడంలో అధికారులు ఘోరంగా విఫలమయ్యారన్న విమర్శలున్నాయి. పదేళ్ల క్రితం లుంబినీ పార్కులో రెస్టారెంట్ కోసం 3వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అద్భుతమైన స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. ఇందుకోసం రూ.15లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ ఆ నిర్మాణాన్ని గాలికొదిలేశారు. ఆ నిర్మాణాన్ని లీజ్‌కిస్తే అందులో ఫుడ్‌కోర్టు పెట్టుకొని నెలకు రూ.50వేలు అద్దె చెల్లిస్తామని ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. ఈమేరకు దరఖాస్తు చేసుకొన్నా.. అధికారులు స్పందించలేదు. పదేళ్లుగా ఆ నిర్మాణం నిరుపయోగంగా ఉంది. దీన్ని లీజుకిచ్చి ఉంటే ఈ పాటికి లక్షలాది రూపాయలం ఆదాయం హెచ్‌ఎండీఏకు సమకూరేది.   
 
లెజేరియంలో కూడా...

 లుంబినీ పార్కులో లేజర్ షో కోసం 2005లో అద్భుతమైన నిర్మాణ ం చేశారు. ఏడాదిన్నర క్రితం రూ.60లక్షలు వెచ్చించి కార్పొరేట్ భవనంగా హంగులద్దారు. రెండంతస్తులు ఉన్న ఈ భవనం ఏడాది కాలంగా ఖాళీగా ఉంది. ఇక్కడ చిల్డ్రన్ ఎమ్యూజ్‌మెంట్ పార్కు, ఫాస్టుఫుడ్ సెంటర్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు లీజ్‌కివ్వాలని పలు సంస్థలు దరఖాస్తు చేసుకొన్నాయి. ఇక్కడ నక్షత్ర హోటల్ నిర్వహించేందుకు ఓ సంస్థ నిర్వాహకుడు అమితాసక్తిని చూపారు. అయితే, హోటల్ నిర్వహణకు అనుమతి లేదంటూ తిరస్కరించారు.

రెస్టారెంట్‌కు ఇక్కడ అనుమతి లేనప్పుడు రూ.లక్షలు వెచ్చించి లుంబినీ పార్కులో స్టీల్ స్ట్రక్చర్ ఎందు కు నిర్మించారన్న ప్రశ్నకు సమాధానం లేదు. అలాగే లేజర్ షో పక్కనే ఉన్న ఓ క్లబ్‌లో రెస్టారెంట్ ఉంది, నెక్లెస్ రోడ్‌లో ఈట్ స్ట్రీట్, ఓరిస్ రెస్టారెంట్ వంటివాటికి అనుమతి ఉన్నప్పుడు.. హెచ్‌ఎండీఏ నిర్మించిన భవనాలు, స్ట్రక్చర్లకు ఎందుకు అనుమతి లేదన్నది అర్థంగాని విషయం. పార్కుల్లో స్థలాన్ని, నిర్మాణాలను లీజ్‌కిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకోవాలని హెచ్‌ఎండీఏకు గతంలో ప్రభుత్వం సూచించింది. అయితే... అధికారులు మాత్రం సవాలక్ష ఆంక్షలు విధిస్తూ తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండటంతో ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు.

బీపీపీ అధికారులు మాత్రం అది తమకు సంబంధం లేని వ్యవహారంగా భావిస్తూ మిన్నకుండి పోయారు. దీంతో లుంబినీలోని  స్టీల్ స్ట్రక్చర్ తుప్పుపడుతుండగా, లెజేరియం భవ నం మాత్రం మట్టి వినాయక విగ్రహాలను నిల్వ చేసేందుకు గోదాముగా మారిపోయింది.  ఓ వైపు హెచ్‌ఎండీఏను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు మున్సిపల్, పురపాలక శాఖ మంత్రి మహీధర్ రెడ్డి విశ్వప్రయత్నాలు చేస్తుంటే... మరో వైపు బీపీపీ అధికారులు ఇవేమీ పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement