సాక్షి, హైదరాబాద్: అసలే వర్షాకాలం.. ఒకింత చలి.. ఒక్కోసారి ఉక్కపోత... కాంక్రీట్ జంగిల్‌లో ప్రజలు ఉండలేక రాజధాని నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగర్ తీరానికి బారులు తీరుతున్నారు. పర్యాటకుల సరదాకు తగినట్లు తెలంగాణ రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ)అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న స్పీడు బోట్లు , సాంస్కృతికానందాన్ని పంచే ఖైరున్నీసా, భాగమతి బోట్లే కాక మరి కొన్నింటిని తీసుకువస్తున్నారు. బోటు షికారుకు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు’తీసుకురానుండటంతో షికారుకే కొత్త హుషారు రానుంది. లుంబినీ పార్కు బోటింగ్ పాయింట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు సమకూరుతున్నాయి.
ఆసక్తిగా ఎదురుచూస్తున్న పర్యాటకులు
హుస్సేన్‌సాగర్‌లో బోటు షికారు అంటే ఎవరికైనా హుషారు వస్తుంది. అందులో కొత్తగా వచ్చే ‘ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్ల’కు మరింత గిరాకీ రానున్నది. చూడటానికి బంగారు వర్ణంలో హుందాగా కన్పిస్తుండటంతో అందులో షికారుకు అందరూ మక్కువ చూపే అవకాశం ఉంది. శుక్ర, శని, ఆదివారాలు, ప్రత్యేక సెలవుదినాల్లో పర్యాటకులు ఇక్కడి బోట్లలో జలవిహారానికి ముచ్చటపడతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ టైపు బోట్లు రెండు త్వరలో సాగర్‌లోకి ప్రవేశం చేయగానే వాటికి పేరు పెట్టాల్సి ఉంది.
వేడుకలు... ఆనందమే...
పుట్టిన రోజు, పెళ్లిరోజు వేడుకలు వంటి చిన్న కార్యక్రమాలు ఇందులో చేసుకునే వెసులుబాటు ఉంది. పార్టీల కోసం వీటిని అద్దెకు ఇస్తామని టీఎస్‌టీడీసీ అధికారులు చెబుతున్నారు. ఇవి హుస్సేన్ సాగర్‌లో బుద్ధ విగ్రహం చుట్టూ తిరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న ఖైరున్నీసా హోటల్ టైపులో ఉంటుంది. కానీ, ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లకు చుట్టూ గ్లాస్(అద్దం), పైన టాప్ కూడా గ్లాస్ అమర్చబడి ఉంటుంది. అంటే కింది భాగం తప్పా బోట్ అంతా అద్దంతో తయారు చేసి ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా బస్సు టైపు బోట్లు దర్శనమిస్తాయి. విభిన్నంగా ప్రపంచంలో ఎక్కడా లేనట్లు సరికొత్తగా ఉండాలని టీఎస్‌టీడీసీ అధికారులు ప్రత్యేకంగా వీటిని తయారు చేయిస్తున్నారు.
ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోటు నమూనా
రెండు విభిన్న రకాలు... విభిన్న రేట్లు..
సాగర్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు మల్టీపర్పస్‌గా యూజ్ అవుతాయి. కుర్చీలు ఎటువైపు అయినా అమర్చుకొనే వెసులుబాటు ఉంది. ప్రపంచంలో ఎక్కడ చూసినా ఫిక్స్‌డ్ సీట్ల బోట్లు ఉంటాయి. ఇందులో పర్యాటకులు ఇంట్లో ఉన్నట్లు అనుభూతి పొందుతారు. నచ్చిన చోట, నచ్చిన వైపు సీట్లు వేసుకొని కూర్చొనే వెసులుబాటు ఉంటుంది. దీనికి పెద్ద ఇంజన్లు ఉండవు. అవుట్ బోర్డు మోటార్స్ –2 అమర్చి ఉంచుతారు. ఫ్లోటింగ్ రెస్టారెంట్ బోట్లు రెండు రకాలున్నాయి. ఒకదానిలో 32 నుంచి 50 సీట్లు, రెండోది 80 నుంచి 100 సీట్లు ఉంటాయి. ఇందులో నదిలో విహరిస్తున్నట్లు ఉంటుంది. వీటి విలువ రూ.కోటి నుంచి రెండు కోట్ల వరకు ఉంటుంది. త్వరలోనే ఇవి అందుబాటులోకి రానున్నాయి.
అందుబాటులో ఉన్న బోట్లు ఇవే...
హుస్సేన్‌సాగర్‌లో చిన్నవి, పెద్దవి మొత్తం 17 బోట్లు ఉన్నాయి. మరో ఐదు రిపేరులో ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా మరో రెండు రాబోతున్నాయి. మూలన పడిన ఫ్యారా సెయిలింగ్, జెడ్ స్కీ బోట్లను సైతం మరమ్మతులు చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
- విందులు వినోదాలతోపాటు సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించే వీలున్న ఖైరున్నీసా, భాగమతి బోట్లల్లో 40 నిమిషాలపాటు సాగరంలో విహరించవచ్చు. భగీరథిలో 200 మంది వరకూ విహరించవచ్చు.
- 5 మెకనైజ్డ్ బోట్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి బుద్ధుడి వద్దకు తీసుకెళ్లి తీసుకొస్తాయి. 2 డీలక్స్‌బోట్లు అందుబాటులో ఉన్నాయి.
- రాజహంస పడవలో హుందాగా అలలపై 15 నిమిషాలపాటు తేలియాడి రావొచ్చు. వీటికితోడు స్పీడుబోటులో సాగర్‌లో దూసుకుపోవాలంటే నడిపే వ్యక్తితో పాటు ఒక్కరే ప్రయాణించవచ్చు.
ఆకర్షించేందుకు ప్రణాళికలు
పర్యాటకంగా సాగర్‌ను అభివృద్ధి చేసేందుకు అనేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. వీకెండ్‌లో ఒక్కొక్క రోజు వేలమంది పర్యాటకులు బోటింగ్‌లో ఎంజాయ్ చేస్తున్నారు. అందుకే క్రమక్రమంగా లుంబినీ పార్కు బోటింగ్ యూనిట్‌లో అంతర్జాతీయ ప్రమాణాలు ప్రవేశ పెట్టబోతున్నాం. హైదరాబాద్‌కు వచ్చే జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులు లుంబినీ పార్కు సందర్శించి బోటింగ్ చేయాలనే ఆలోచనకు తీసుకురావాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం.
– టీఎస్‌టీడీసీ ఎండీ మనోహర్
Comments
Please login to add a commentAdd a comment