లైఫ్ జాకెట్లు లేకుండా బోటు షికారు
సాక్షి, సిటీబ్యూరో: మహా నగరంలో ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్న పర్యాటకాభివృద్ధి తిరోగమనంలో సాగుతోంది. ప్రభుత్వం ప్రకటించిన ప్రాజెక్టులను పట్టాలెక్కించడంలో విఫలమవుతోంది. దేశీయ, అంతర్జాతీయ పర్యాటకులు సందర్శించే భాగ్యనగరంలోని సందర్శనీయ స్థలాల వద్ద సరైన రక్షణ చర్యలు లేక ఎప్పుడేం ప్రమాదం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అందుకు ఉదాహరణ హుస్సేన్ సాగర్‌లో విహారమే. లుంబినీ పార్కులో ఉన్న బోటింగ్ పాయింట్ తెలంగాణ రాష్ట్రపర్యాటకాభివృద్ధి సంస్థ(టీఎస్‌టీడీసీ) ఆధ్వర్యంలో నడుస్తోంది. సాగర్ జలాల్లో విహారానికి ఇక్కడి నుంచే బోట్లు తిప్పుతున్నారు. ఇక్కడ తిరిగే బోట్లను అధికారులు ఆర్భాటంగా అందుబాటులోకి తెస్తున్నా.. ఆ తర్వాత వాటి బాగోగులు పట్టించుకోవడం లేదు.
అన్ని బోట్లదీ అదే తీరు..
సాగర్‌లో ఒకే ఇంజిన్‌తో ఉండే ఐదు మెకనైజ్డ్ బోట్లను తిప్పుతున్నారు. ఇవి తరచూ సాంకేతిక లోపంతో హుసేన్‌సాగర్ మధ్యలోనే అగిపోతున్నాయి. దీంతో పర్యాటకులు ఆందోళన చెందుతున్నారు. వీటికి మరమ్మతులు చేస్తున్నట్టు అధికారులు చెబుతున్నా పూర్తి స్థాయిలో మాత్రం పనిచేయడం లేదు.
ఫాంటన్ బోట్లు..
సుమారు 70 మంది ప్రయాణించే ఈ బోటుకు రెండు ఇంజిన్లు ఉండాలి. కానీ ఒక్క ఇంజిన్‌తోనే తిప్పుతున్నారు. ఏడాది కిత్రం ఒక ఇంజిన్ పాడైంది. దాని గురించి మాత్రం పట్టించుకోలేదు. ప్రయాణికులు సాగర్‌లో షికారు చేస్తున్నప్పుడు ఉన్నఫళంగా ఆగిపోవడం పరిపాటిగా మారింది. సాగర్‌లో ఆగిపోయిన ప్రతిసారి మరో బోటును పంపి టూరిస్టులను ఒడ్డుకు తీసుకవస్తున్నారు. దీనికి ప్రతి మూడు నెలలకు ఓసారి ఇంజిన్, గేర్ ఆయిల్ మార్చాలి. కానీ ఆరు నెలలుగా ఆ పనులు చేపట్టలేదు.
రిపేరులో మూడు స్పీడు బోట్లు
టీఎస్‌టీడీసీ నడిపే ఐదు స్పీడ్ బోట్లలో మూడు రిపేర్‌లో ఉన్నాయి. ప్రస్తుతం తిరిగే రెండు బోట్లు కూడా టూరిస్టులతో సాగర్‌లో తరచుగా ఆగిపోతున్నాయి. ఈ బోటులో షికారుకు వెళ్లినవారు సాగర్‌లోను.. టికెట్ తీసుకున్నవారు ఒడ్డున గంటల తరబడి ఎదురుచూడ్డం పరిపాటిగా మారింది.
పెద్ద బోట్లపైనా నిర్లక్ష్యం
సాగర్‌లో భగీరథి, ఖైరున్నీసా, భాగమతి పెద్ద బోట్లు తిరుగుతున్నాయి. వినోద కార్యక్రమాలు సైతం ఉండే వీటిలో 80 నుంచి 100 మందికి పైగా పర్యాటకులు షికారు చేయవచ్చు. ఏప్రిల్‌లో రిపేరుకు వెళ్లింది. ఒక్కొక్క బోటుకు ఇద్దరు డ్రైవర్లు, ఒక హెల్పర్, ఒక స్విమ్మర్ ఉండాలి. కానీ మూడు నెలలుగా ఒక హెల్పర్, ఒక సెక్యూరిటీ మాత్రమే వెళ్తున్నారు.
డీలక్స్ బోట్లు డల్..
పది మంది ప్రయాణించే డీలక్స్ బోటు తరచూ ఇంజిన్‌లో సాంకేతిక లోపాలు తలెత్తి ఆగిపోతోంది. వీటికి వచ్చే సాంకేతిక సమస్యలు పరిష్కరించేందుకు, రిపేర్ చేసేందుకు ప్రత్యేకంగా మెకానిక్‌ను నియమించినా పట్టించుకున్న దాఖలా లేదు. రాజహంస బోటు సైతం సాంకేతిక లోపంతో ఆడపాదడపా నడుస్తోంది.
పర్యాటకుల్లోనూ భద్రతపై నిర్లక్ష్యం
టీఎస్‌టీడీసీ అధికారులు పర్యాటకుల భద్రత కోసం లైఫ్ జాకెట్లను ఆయా బోట్లలో ఉంచారు. బోటింగ్ సిబ్బంది లైఫ్‌జాకెట్లు ధరించాలని చెప్పినా పర్యాటకులు నిర్లక్ష్యం చేస్తున్నారు. ఏదైనా ప్రమాదం జరిగి ప్రాణనష్టం జరగకముందే అధికారులు మేల్కొని చర్యలు చేట్టాలి.
జాగ్రత్తలుతీసుకుంటున్నాం..
లుంబినీ పార్కులోని బోటింగ్ పాయింట్ అంతర్జాతీయ ప్రమాణాలతో తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తున్నాం. బోటింగ్ డ్రైవర్లకు జీతాలు పెంచాం. మరిన్ని కొత్త బోట్లు తీసుకురాబోతున్నాయి. పర్యాటకులు లైఫ్ జాకెట్స్ ధరించేలా చూడాలని సిబ్బందికి ముందే చెప్పాం. మరోసారి ప్రత్యేకంగా తనిఖీలు చేస్తా. టూరిస్టుల భద్రతపై జాగ్రత్తలు తీసుకుంటాం. – మనోహర్, టీఎస్‌టీడీసీ ఎండీ
Comments
Please login to add a commentAdd a comment