
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను మరోసారి భారీ వర్షం ముంచెత్తింది. నగరంలో మళ్లీ కుండపోత వర్షం కురుస్తోంది. శనివారం(ఆగస్టు 9వ తేదీ) రాత్రి సమయంలో భారీ వర్షంతో నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. క్లౌడ్ బరస్ట్ అయిన తీరులో భారీ వర్షం పడుతోంది. దీంతో జీహెచ్‌ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. ఎల్‌బీ నగర్, వనస్థలిపురం, హయత్‌నగర్, పెద్ద అంబర్‌పేట్, అబ్దులాపూర్‌మెట్, నాగోల్, దిల్‌సుఖ్‌నగర్, చైతన్యపురి, కొత్తపేట్, సరూర్‌నగర్, మీర్‌పేట్‌లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, బంజారాహిల్స్, ఖైరతాబాత్ తదిదర ప్రాంతాల్లో కుండపోతగా వర్షం పడుతోంది. హైటెక్ సిటీ, గచ్చిబౌలి, కొండాపూర్ లాంటి ప్రాంతాల్లో భారీ వర్షం పడటంతో హెవీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
జీహెచ్‌ఎంసీలో కంట్రోల్ రూమ్, ట్రోల్‌ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేశారు. లోతట్టు ప్రాంతాల్లో అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది.

హుస్సేన్ సాగర్‌కు భారీగా వరద నీరు
హుస్సేన్ సాగర్‌కు వరద నీరు భారీగా చేరుతోంది. హుస్సేన్ సాగర్ నాలా పరిధిలోని కాలనీలకు అధికారులు అలర్ట్ జారీ చేశారు. వరద ఉధృతి పెరుగుతుండటంతో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కవాడిగూడ, గాంధీనగర్, అరవింద్‌నగర్, సబర్మతినగర్ వాసులను అధికారులు అప్రమత్తం చేశారు.