సాక్షి, హైదరాబాద్ : ‘సోమవారం సాయంత్రం నాలుగు గంటలు.. హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ చేసేందుకు యువత, పిల్లలతో వచ్చిన కుటుంబ సభ్యులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అంతలోనే 50 సీట్ల సామర్థ్యం కలిగిన మెకనైజ్డ్ బోట్ వచ్చింది. జెట్టీ వద్ద బోట్‌ను ఆపడంతో అందరూ ఎక్కేశారు. దీంతో పడవ కాస్తా అటూ ఇటూ కదిలింది. బుద్ధ విగ్రహాన్ని చూసేసి తిరిగి లుంబినీ పార్కు జెట్టీ వద్ద చేరుకున్నారు. ప్రయాణం అంతా సాఫీగా సాగడంతో అందరూ ఖుషీగా తిరిగి వెళ్లిపోయారు’ ..ఇంతవరకు బాగానే ఉంది కానీ.. అనుకోని ఘటన ఏదైనా జరిగితే. ఎంత ప్రమాదం. ప్రాణాలకు ఎంత ముప్పు. ఎందుకంటే ఆ బోట్‌లో ప్రయాణిస్తున్న ఒక్కరు కూడా లైఫ్ జాకెట్ ధరించలేదు.
లైఫ్ జాకెట్లను తెలంగాణ పర్యాటక శాఖ సమకూర్చకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఆదివారం విజయవాడ వద్ద కృష్ణానదిలో ఘోర పడవ ప్రమాదం సంభవించిన నేపథ్యంలో నగరంలోని హుస్సేన్‌సాగర్ పడవ షికారులో భద్రత ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకునేందుకు ‘సాక్షి బృందం’ పరిశీలించింది. బోట్‌లో భద్రతాపరమైన లోపాలను కనిపెట్టింది. బోటులో ప్రయాణిస్తున్న పర్యాటకలు ఒక్కరు కూడా తమకు లైఫ్ జాకెట్ ఇవ్వండి, ధరిస్తామని అడగకపోవడం గమనార్హం, నిబంధనల్లో పొందుపరిచిన విధంగా బోటింగ్ అధికారులు ఎవరూ లైఫ్ జాకెట్ ధరించండి అని ప్రయాణికులతో చెప్పిన దాఖలాలు కనిపించలేదు.
వీకెండ్‌లో ఐదువేల మంది..
హుస్సేన్ సాగర్ తీరంలో సోమవారం నుంచి శుక్రవారం వరకు రోజూ దాదాపు 2000 నుంచి 2,500 మంది పర్యాటకులు బోట్‌లలో షికారు చేస్తుంటారు. శని, ఆదివారాల్లో వీరి సంఖ్య సుమారు 5000 ఉంటుంది. తెలంగాణ పర్యాటక శాఖకు రోజుకు సుమారు లక్ష రూపాయలకుపైగానే ఆదాయం వస్తుంది. అంటే నెలకు రూ.30 లక్షలు. ఆదాయం భారీగా వస్తున్నా బోటు ప్రయాణికులకు సరిపడా లైఫ్ జాక్లెట్లు, లైఫ్ రింగులు కూడా అందుబాటులో ఉండకపోవడం భద్రతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇక్కడ అలలు వచ్చే అవకాశం లేకపోవడంతో ఎటువంటి పడవ ప్రమాదం జరగకపోవచ్చని అధికారులు భరోసా ఇస్తున్నారు.
కాసుల కోసం కక్కుర్తి.?
పడవ నిర్వాహకులు భద్రతాపరంగా లైఫ్‌జాకెట్లు, లైఫ్ రింగులు అందుబాటులో ఉంచాలి. ఇవి ఒక్కో పడవకు ఐదు నుంచి పది మధ్యలో, రింగులు రెండు వరకు మాత్రమే ఉన్నాయి. పర్యాటకుల సంఖ్య అనుగుణంగా దాదాపు 742 మందికి, దాదాపు 65 మంది సిబ్బందికి మొత్తం 807 లైఫ్ జాకెట్లు అవసరం. కానీ వీటి సంఖ్య 100 కూడా లేదని తెలుస్తోంది. ఒక్కో లైఫ్ జాకెట్ ధర మార్కెట్లో రూ.1,000 ఉంది. లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న తెలంగాణ పర్యాటక శాఖ లైఫ్ జాకెట్లకు రూ.70 లక్షలు కూడా ఖర్చుపెట్టడం లేదు. సరిపడా లైఫ్ జాకెట్లు ఉన్నాయని అధికారులు చెబుతున్నా వాస్తవానికి అవి ఎక్కడా కానరావడం లేదు. సోమవారం ‘సాక్షి’ బృందం పర్యటించిన నేపథ్యంలో జూపార్క్‌లోని బోటింగ్ సిబ్బంది నుంచి దాదాపు 30 లైఫ్ జాకెట్లు తెప్పించుకోవడం కనిపించింది.
బోట్స్‌సంఖ్య సీట్లసామర్థ్యం
మెకనైజ్డ్ బోట్స్ 4 300
డీలక్స్ బోట్ 3 8
స్పీడ్ బోట్ 4 4
ఫాంటన్ బోట్ 1 80
భగీరథి బోట్ 1 150
ఖైర్–ఉన్–నిస్సా 1 100
భాగ్‌మతి 1 100
లైఫ్ జాకెట్ ఇవ్వాలన్నా పట్టించుకోలేదు..
భార్య, కుమారుడితో కలిసి బోటింగ్ చేసేందుకు ఈసీఐఎల్ నుంచి వచ్చా. పడవ ఎక్కిన సమయంలో లైఫ్ జాకెట్ కావాలని అడిగా. కృష్ణానదిలో జరిగిన పడవ ప్రమాదం గురించి కూడా వివరించా. అయినా నన్నెవరూ పట్టించుకోలేదు. – వెంకట్, పర్యాటకుడు
భద్రతా నిబంధనలు బోట్‌లో ప్రదర్శించాలి..
బోటింగ్ టికెట్ కౌంటర్ వద్ద ఏర్పాటుచేసిన భద్రతా నిబంధనలు పొందుపరిచారు. బోట్‌లో ప్రయాణికులు వ్యవహరించాల్సిన తీరుపై జాగ్రత్తలు సూచించారు. ఈ నిబంధనలు బోట్‌లలో కూడా ఓ మూలన ప్రదర్శిస్తే బాగుంటుంది. – సుచీర, పర్యాటకురాలు
ఆ ప్రభావం పర్యాటకులపై లేదు..
ఒక్కో పడవకు ఆరు నుంచి పది వరకు లైఫ్ జాకెట్లు, రెండు లైఫ్ రింగ్‌లు కూడా అందుబాటులో ఉంచుతున్నాం. కృష్ణా నదిలో జరిగిన పడవ ప్రమాదం ఇక్కడ పర్యాటకులపై ప్రభావం ఏమాత్రం లేదు. ఎప్పటిలాగే పర్యాటకులు బోటింగ్‌కు ఆసక్తి చూపుతున్నారు.
– రాజలింగం, హుస్సేన్‌సాగర్ బోటింగ్ యూనిట్ మేనేజర్
డ్రైవింగ్‌లో ఇబ్బందులు లేవు..
హుస్సేన్‌సాగర్‌లో బోటింగ్ డ్రైవ్ ఏడాదిగా చేస్తున్నా. నాతోటి 20 మంది డ్రైవర్లంతా లైసెన్స్‌డ్ డ్రైవర్లే. ప్రయాణ సమయంలో పర్యాటకులు లేచి నిల్చుంటే సముదాయించేందుకు సిబ్బంది ఉన్నారు. సురక్షితంగా గమ్యస్థానం చేరేలా అనుక్షణం అప్రమత్తంగా ఉంటాం. – సుమన్, బోట్ డ్రైవర్
Comments
Please login to add a commentAdd a comment