హెలీ ఎన్‌జాయ్ | Helicopter rides to the city's residents, Fida | Sakshi
Sakshi News home page

హెలీ ఎన్‌జాయ్

Published Fri, Mar 4 2016 12:47 AM | Last Updated on Sat, Aug 11 2018 7:56 PM

హెలీ ఎన్‌జాయ్ - Sakshi

హెలీ ఎన్‌జాయ్

హెలికాప్టర్ సవారీకి నగరవాసులు ఫిదా
చూసే మనసుండాలేగాని విశ్వనగరిలో ప్రతి ప్రాంతం సోయగాల బృందావనమే. ఈ భాగ్యనగరి అందాలను నింగిలో ఎగురుతూ వీక్షించే అద్భుత ఆనందాన్ని పంచుతోంది ‘హెలీ టూరిజం’. హైదరాబాద్ మహా న గరంలోని హుస్సేన్‌సాగర తీరంలో తాజాగా ప్రారంభించిన ‘హెలీ రైడ్’ విశేష ఆదరణ చూరగొంటోంది. సందర్శకులకు తన్మయత్వంతో పాటు పర్యాటక శాఖ ప్రతిష్టనూ పెంచుతోంది. -
 
సిటీబ్యూరో  ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ముత్యాల నగరంలో మరో ఆణిముత్యం ‘గగన విహారం’ చేస్తోంది. తెలంగాణ పర్యాటక సిగలో మరో ఆకాశ విహారం ఆనందపు జల్లులు కురిపిస్తోంది. నగరానికి నలు దిశలా నవసోయగాలు చిందే చార్మినార్, గోల్కొండ, మక్కామసీదు, హైకోర్టు, అసెంబ్లీహాల్, ఉస్మానియా ఆస్పత్రి, ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్జంగ్ మ్యూజియం, బిర్లా మందిర్, హుస్సేన్‌సాగర్ వంటి చారిత్రక ప్రదేశాలను చుట్టివచ్చే విచిత్రానుభూతిని తెలంగాణ పర్యాటక శాఖ ప్రారంభించిన ‘హెలీ టూరిజం’ కల్పిస్తోంది. రూ.3499ల  టిక్కెట్‌తో నగరమంతా 10 నిమిషాల వ్యవధిలోనే చక్కర్లు కొట్టి... చుక్కల సందడిగా సాగుతోన్న గగన విహారం సంబరం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో తెలంగాణ రాష్ట్రంలో పర్యాటక శాఖ తొలిసారిగా చేపట్టిన ఈ హెలీటూరిజం ఘనమైన ఆదరణ పొందుతోంది. ఇప్పటికే సుమారు 100 మందికి పైగా సందర్శకులు నగరాన్ని చుట్టివచ్చారు. నింగికెగిరిన  హెలికాప్టర్ పక్షిలా దూసుకెళుతూ... ఒక్కసారిగా మలుపు తిరుగుతూ మురిపిస్తుండటంతో చిన్నారులే కాదు పెద్దలు సైతం ఆనంద డోలికల్లో తేలిపోతున్నారు. ఈ అనుభూతిని ఆస్వాదించేందుకు పలువురు ఆసక్తి చూపుతుండటంతో జాయ్ రైడ్స్ జోరందుకొన్నాయి.  
 
 హెలికాప్టర్ కొనండి డాడీ...
 హెలికాప్టర్ జాయ్ రైడ్‌లో నగరాన్ని చుట్టివచ్చిన గుంటూరు జిల్లా చిలకలూరిపేటకు చెందిన ప్రదీప్ కుమార్‌కు పెద్ద డిమాండే ఎదురైంది. తన చిన్నకూతురు శ్రావణి పుట్టినరోజు సందర్భంగా  హెలికాప్టర్ ఎక్కించేందుకు చిలకలూరిపేట నుంచి నగరానికి వచ్చారు. భార్య పద్మావతి, కూతుళ్లు సౌజన్య, శ్రావణిలతో కలిసి హెలికాప్టర్‌లో గగన విహారం చేసివచ్చారు. కిందికి దిగిన తర్వాత ‘నాకు చిన్నకారు వద్దు... హెలికాప్టర్ కొనివ్వండి డాడీ...’ అంటూ ఆ చిన్నారి మారాం చేయడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ సందర్భంగా ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో తమ ఊర్లో దిగడాన్ని చూసి తాను ఎలాగైనా జీవితంలో ఒక్కసారి హెలికాప్టర్ ఎక్కాలని నిర్ణయించుకొన్నా. హైదరాబాద్‌లో హెలీ టూరిజంను ప్రారంభించినట్లు పేపర్‌లో చూసి వెంటనే కుటుంబంతో బయలుదేరి వచ్చి తన కోరికను తీర్చుకొన్నా.

పోటెత్తుతోన్న సందర్శకులు
కేవలం నగర వాసులే కాకుండా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులకు గగన విహారం గొప్ప అహ్లాదం చేకూర్చుతోంది.  నల్గొండ, గుంటూరు, మహబూబ్‌నగర్, వరంగల్ , కరీంనగర్ జిల్లాల నుంచి వచ్చిన పర్యాటకులు వారికి నచ్చిన రోజులో టిక్కెట్లు బుక్ చేసుకోవడం కనిపించింది. ఇప్పటికే 220 మందికి పైగా హెలికాప్టర్ జాయ్ రైడ్స్‌కు ఆన్‌లైన్ ద్వారా అడ్వాన్స్‌గా టికెట్లు బుక్ చేసుకోవడం విశేషం. జాయ్ రైడ్స్‌కు శుక్ర, శని, ఆదివారాల్లో ఎక్కువగా బుకింగ్స్ అవుతుండడంతో ఉదయం 9 నుంచి సాయంత్రం 5.30గం.ల వరకు రైడ్స్ కొనసాగించేందుకు నిర్వాహకులు సన్నద్ధమయ్యారు. ఈ నెల 20 వరకు హెలీటూరిజంను  కొనసాగిస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. ఆ తర్వాత పర్యాటకుల ఆదరణను బట్టి మరికొన్ని రోజులు పొడిగించే అవకాశం కూడా ఉందంటున్నారు. పర్యాటకులందరికీ ఆన్‌లైన్ సౌకర్యం అందుబాటులో ఉండదు కనుక  నెక్లెస్ రోడ్ లోని హెలీప్యాడ్ వద్దే టిక్కెట్లు విక్రయిస్తున్నారు.     
 
త్వరలో ‘సీ ఎరోప్లేన్ విహారం’
నగరం మరో వినోదానికి కేంద్రం కానున్నది. రాష్ట్ర టూరిజం శాఖ సరికొత్త ప్రయోగాలతో ముందుకు వస్తోంది. హెలీటూరిజం ప్రారంభించి  తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆకర్షించింది.  త్వరలో మరో విహార సౌకర్యం ఏర్పాటు చేయబోతోంది. హుసేన్‌సాగర్ వేదికగా ‘ సీ ఎరోప్లేన్ విహారం’ ప్రారంభించనుంది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ‘సాక్షి’ కి ఈ వివరాలు వెల్లడించారు.   తెలుగు ప్రజలకు అంతర్జాతీయ అనుభూతులు (ఇంటర్నేషనల్ ఎక్స్‌పీరియన్స్) కల్పించటమే తమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. త్వరలో హుస్సేన్ సాగర్ కేంద్రంగా ఒకేసారి రెండు మార్గాల్లో మధురానుభూతిని కల్పించబోతున్నామన్నారు. జల, వాయు మార్గాల్లో ఒకే సారి ప్రయాణించి అనుభూతిని కల్పిస్తామన్నారు. కొంత దూరం నీటిలో ప్రయాణించి ఆ వెంటనే ఎగిరి ఆకాశంలో ప్రయాణించేదే సీ ఎరోఫ్లైన్ స్పెషాలిటీ అని చెప్పారు. ఈ వినోదం ద్వారా అటు సముద్రంలో పడవలో ప్రయాణించిన అనుభూతితో పాటు ఆకాశంలో ప్రయాణించినట్టు ఉంటుందన్నారు. ఇప్పటికే అండమాన్ నికోబార్‌కి చెందిన ఏవియేషన్ సంస్థతో పాటు మరో సంస్థతో చర్చించామన్నారు. హెలీటూరిజంకు ఆదరణ ఉంటే పెద్ద హెలీకాప్టర్‌ను కూడా తీసుకువస్తామని తెలిపారు.  
 
రేటు గురించి  ఆలోచించొద్దు..

హెలికాప్టర్ రైడ్‌ను ఎంజాయ్ చేయాలంటే... టిక్కెట్ రేటు గురించి ఆలోచించొద్దు. వాళ్లు వసూలు చేస్తున్నది పెద్ద రేటేం కాదు....,  సిటీలో హెలీ టూరిజంను కొత్తగా ఏర్పాటు చేశారు. సామాన్యుడికి సైతం ఆకాశంలో విహరించాలనే కోరికను తీర్చుకొనేందుకు మంచి అవకాశం దొరికింది. మనం వేరే సిటీకి వెళ్లి హెలికాప్టర్ ఎక్కలేం. ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఎంజాయ్ చేయాలి. నా మనవడు ప్రిన్స్‌ను హెలికాప్టర్ ఎక్కించేందుకు టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు వచ్చాను. - వేణు, మారేడుపల్లి
 
కాస్త ఎక్కువే...

టిక్కెట్ ధర కాస్త ఎక్కువగానే ఉంది. హెలికాప్టర్ ఎక్కాలన్న కోరిక ఉన్నా... సామాన్య మధ్యతరగతి వర్గాల వారు అంత చెల్లించలేదు. ధర కాస్త తగ్గిస్తే బాగుంటుంది. ప్రభుత్వం ఏది చేసినా... మిడిల్ క్లాస్ పీపుల్‌కు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. విమానంలో అయితే... కిటికీలోంచి చేతులు బయట పెట్టి టాటా చెప్పడం కుదరదు. రోజంతా తిరిగినా పూర్తిచేయలేని నగర పర్యటనను 10 నిమిషాల్లో ఆకాశం నుంచి చూసేందుకు జాయ్ రైడ్‌కు వచ్చా.   - మణి, కంటోన్మెంట్     
 
 మాటల్లో చెప్పలేం..
 హెలికాప్టర్ జాయ్ రైడ్ టిక్కెట్ రేటు రీజనబుల్‌గానే ఉంది. మిగతా సిటీల్లో చూస్తే ఇంకా ఎక్కువే. నాకు విమానంలో ప్రయాణించిన అనుభవం ఉంది. కానీ హెలికాప్టర్ ఎక్కడం ఇదే తొలిసారి. నగరాన్ని ఆకాశం నుంచి చూస్తే ఎలా ఉంటుందోనన్న ఆరాటంతో జాయ్ రైడ్‌కు వెళ్లా.  ఆ అనుభూతిని ఆస్వాదించేందుకు నా కొడుకు రవికుమార్, కోడలు నందిని, మనుమరాలు ఐశ్వర్యలను తీసుకొచ్చా. ఆకాశం నుంచి కిందకు దిగాక తెలిసింది. ఆ అనుభూతి  మాటల్లో చెప్పలేం. అమేజింగ్... మార్వలెస్..,  వీలైతే మారోసారి జాయ్‌రైడ్ చేయాలని ఉంది.  - నందకిషోర్, హుస్సేనీ ఆలం
 
భవిష్యత్‌లో మరింత ఆదరణ   
ఉదయం 9గంటలకు జాయ్ రైడ్స్ ప్రారంభిస్తున్నాం. మధ్యలో భోజన విరామ సమయం తర్వాత మళ్లీ యథావిధిగా ట్రిప్స్ వేస్తున్నాం. సందర్శకుల సంఖ్య ఇంకా పెరగాల్సి ఉంది. ఒకేచోట కాకుండా 2, 3 చోట్ల హెలిప్యాడ్స్ ఏర్పాటు చేస్తే సందర్శకుల నుంచి ఇంకా రెస్పాన్స్ ఉంటుంది. టూరిజం శాఖ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో హెలీ టూరిజంను అభివృద్ధి చేస్తే టూరిస్టుల రాక మరింత పెరిగే అవకాశం ఉంది. భూమికి 500 ఫీట్స్‌లో అంటే... సుమారు 150-200 మీటర్ల ఎత్తులోనే హెలికాప్టర్ ఎగురుతుండటం వల్ల నగరంలోని అన్ని ప్రదేశాలు స్పష్టంగా కన్పిస్తాయి. నగరాన్ని ఆకాశం నుంచి చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. కారులో ఒకరోజంతా ప్రయాణించినా పూర్తిచేయలేని నగర పర్యటనను 10 నిమిషాల్లో చుట్టేయచ్చు.  రానున్న రోజుల్లో  ఆదరణ పెరగడం ఖాయం.   - కెప్టెన్ వినోద్, పెలైట్
 
ఇదే తొలిసారి
నగరంలో హెలీ టూరిజంను ప్రారంభించడం ఇదే మొదటిసారి. ఆదాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్లాన్ చేసింది కాదు. ఈ ఆలోచన పర్యాటక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంది. పర్యాటక రంగ అభివృద్ధికి  మావంతుగా సహకారం అందిస్తున్నాం. హెలికాప్టర్‌తో జాయ్ రైడ్స్ నిర్వహించడం అన్నది చాలా ఖర్చుతో కూడుకొన్నది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా నెక్లెస్ రోడ్‌లో చేపట్టిన ఈ  ప్రయత్నం సక్సెస్ అయితే... నగరం నలువైపులా హెలికాప్టర్ జాయ్ రైడ్స్‌కు ఏర్పాట్లు చేసి అందరికీ అందుబాటులోకి తెస్తాం. ఈ నెల 20వరకు హెలీటూరిజంను కొనసాగించాలనే ప్లాన్ ఉంది. భవిష్యత్‌లో వరంగల్‌లో కూడా హెలి టూరిజంను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో పర్యాటక శాఖ ఉంది. తెలుగు రాష్ట్రాల్లోనే పర్యాటకులకు ఎలాంటి అసౌకర్యం కల్పించకుండా జాయ్ రైడ్స్ నిర్వహించాలన్నదే మా లక్ష్యం.
 - వాసు సింగం, ఇండ్‌వెల్ ఏవియేషన్ డెరైక్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement