డబ్బంటే చేదా...?
- లుంబినీ పార్కులో నిరుపయోగంగా అద్భుత నిర్మాణాలు
- ఔత్సాహికులు ముందుకొచ్చినా... అలక్ష్యం
- ఆదాయంపై ఆరాటంలేని హెచ్‌ఎండీఏ
ఏ సంస్థ అయినా ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నప్పుడు అనవసరపు ఖర్చులు తగ్గించుకొని..ఆదాయపు మార్గాల కోసం అన్వేషిస్తుంది.అయితే హెచ్‌ఎండీఏ ఇందుకు వ్యతిరేకం. లుంబినీ పార్కు ద్వారా మరింత ఆదాయం సమకూరే అవకాశాలున్నా అందిపుచ్చుకోలేక పోతోంది. దీంతో లక్షల రూపాయల వ్యయంతో రూపుదిద్దుకొన్న వివిధ నిర్మాణాలు ఎందుకూ పనికిరాకుండా పోతున్నాయి.
- హుస్సేన్‌సాగర్ తీరాన లుంబినీ పార్కులో పదేళ్ల క్రితం రెస్టారెంట్ కోసం అద్భుతమైన స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించారు. అలాగే లేజర్ షోను ఆనుకొని సర్వాంగ సుందరంగా ఓ వాణిజ్య సముదాయాన్ని హెచ్‌ఎండీఏ నిర్మించింది. వీటిని లీజుకు ఇచ్చే విషయంలో అధికారులు శ్రద్ధ పెట్టకపోవడంతో కోట్లాది రూపాయల ఆదాయం సంస్థకు అందకుండా పోతోంది.
- లుంబినీ పార్కులో భారీ స్టీల్ స్ట్రక్చర్‌ను నిర్మించేందుకు 11ఏళ్ల క్రితం రూ.15లక్షల వరకు నిధులు వెచ్చించారు. ఆ తర్వాత వివిధ కారణాలను సాకుగా చూపుతూ దాన్ని గాలికొదిలేశారు. అందులో ఫుడ్ కోర్టు పెట్టుకొనేందుకు అనుమతిస్తే నెలకు రూ.50-60వేలు అద్దె చెల్లిస్తామని ఓ ప్రైవేటు సంస్థ ముందుకొచ్చింది. అయితే.. అధికారులు స్పందించక పోవడంతో అది వెనుదిరిగింది.
- లుంబినీ పార్కులో లేజర్ షో కోసం 2005లో అద్భుతమైన నిర్మాణం చేశారు. ఆతర్వాత దీనికి రూ.60లక్షలు వెచ్చించి కార్పొరేట్ భవనంగా హంగులద్దారు. రెండంతస్తులున్న ఈ భవనం ఏళ్లతరబడి ఖాళీగా పడిఉంది. ఈ భవనాన్ని లీజ్‌కిస్తే నెలకు లక్షల రూపాయలకు పైగా ఆదాయం వచ్చేది. ఇక్కడ చిల్డ్రన్ ఎమ్యూజ్‌మెంట్ పార్కు, ఫాస్టు ఫుడ్ సెంటర్, ఇతర వినోద కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు లీజ్‌కు ఇవ్వాలంటూ పలు సంస్థలు బీపీపీకి దరఖాస్తు చేసుకొన్నాయి. నక్షత్ర (స్టార్) హోటల్ నిర్వహించేందుకు ఓ సంస్థ నిర్వాహకుడు అమితాసక్తిని చూపారు. అయితే... ఇక్కడ హోట ల్ నిర్వహణకు అనుమతి లేదంటూ అధికారులు తిరస్కరించారు.
వీటి మాటేమిటి ?
లేజర్ షో పక్కనే ఉన్న ఓ క్లబ్‌లో రెస్టారెంట్ ఉంది. అలాగే నెక్లెస్ రోడ్‌లో ఈట్ స్ట్రీట్, ఓరిస్ రెస్టారెంట్ వంటివాటికి అనుమతి ఉన్నప్పుడు హెచ్‌ఎండీఏ సొంత స్థలంలో నిర్మించిన భవనాలు, స్ట్రక్చర్లకు ఎం దుకు అనుమతి లేదన్నది ఇక్కడ అర్థంగాని విషయం. పార్కుల్లో స్థలాన్ని, నిర్మాణాలను లీజ్‌కిచ్చి అదనపు ఆదాయం సమకూర్చుకొనే అవకాశం ఉన్నా అధికారులు మాత్రం తమ స్వప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తుండటంతో ఔత్సాహికులు వెనుకడుగు వేస్తున్నారు. ప్రస్తుతం లుంబినీలోని స్టీల్ స్ట్రక్చర్ తుప్పుపడుతుండగా, లెజేరియం భవనం మాత్రం బందోబస్తుకు వచ్చే పోలీసులకు విడిదిగా మారింది. హెచ్‌ఎండీఏను ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కించేందుకు కసరత్తు చేస్తున్న కమిషనర్ శాలిని మిశ్రా లుంబినీ పార్కులో నిరుపయోగంగా ఉన్న అద్భుతమైన నిర్మాణాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.