అవినీతి జాడ్యానికి బదిలీల చికిత్స | Private transfers of corruption | Sakshi
Sakshi News home page

అవినీతి జాడ్యానికి బదిలీల చికిత్స

Published Tue, Dec 24 2013 6:09 AM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

Private transfers of corruption

 =సంస్కరణలకు కమిషనర్ శ్రీకారం  
 =హెచ్‌ఎండీఏలో మూకుమ్మడి బదిలీలు

 
సాక్షి, సిటీబ్యూరో : అవినీతి, అక్రమాలతో అపకీర్తిని మూటగట్టుకొన్న ెహ చ్‌ఎండీఏను సంస్కరించేందుకు ఎట్టకేలకు ఒక్క అడుగు ముందుకు పడింది. దీర్ఘకాలంగా  ఒకే పోస్టులో కొనసాగుతూ  సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొన్న కొందరు ఉద్యోగులకు స్థానభ్రంశం కల్పిస్తూ హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ చర్యలు చేపట్టారు. ఈమేరకు ప్లానింగ్, అకౌంట్స్, ఇ.ఎం.యూ, ఆర్ అండ్ డి.ఓ., బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు విభాగాల్లో పనిచేస్తున్న వారిలో 10 మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

వీరిలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు రాగా,  మరికొందరిపై ఫిర్యాదులు కూడా అందాయి. ప్రధానంగా ప్రజలకు సేవలందించే విషయంలో కొందరు ఉద్యోగులు వెంటనే స్పందించకపోవడం, ప్రతిపనికీ ఓ రేటు నిర్ణయించి ఔట్‌సోర్సింగ్ సిబ్బంది ద్వారా వసూలు చేయడం, సొమ్ము చేతికి అందాకే ఫైల్ కదలడం, అకౌంట్స్ సెక్షన్‌లో చేయితడపనితే చెక్కు లివ్వకపోవడం వంటి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. వీటిపై అంతర్గతంగా విచారణ జరిపిస్తే విచారణాధికారిని కూడా ప్రలోభాలకు గురిచేస్తుండడంతో అక్రమాలు వెలుగు చూడకుండా పోతున్నాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి అన్ని అనుమతులు కేంద్ర కార్యాలయం నుంచే ఇస్తుండడం అక్రమార్కులకు మరింత కలిసి వస్తోంది. దీంతో హెచ్‌ఎండీఏ అవినీతి, అక్రమాల్లో  మునిగి తేలుతోంది.  
 
బరువు పెట్టనిదే...:
 
హెచ్‌ఎండీఏలో  కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేతిలో బరువు పెట్టనిదే ఏ పనీ జరగదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్‌ఎండీఏ  భూములు లీజ్‌కు తీసుకోవాలన్నా, సంస్థ సొంత భవనాలను అద్దెకు తీసుకోవాలన్నా, భూ వినియోగాన్ని మార్చుకోవాలన్నా,  కొత్త లేఅవుట్లు, నూతన భవనాలకు పర్మిషన్ పొందాలన్నా,  వ్యాపార-వాణిజ్య ప్రకటనల (హోర్డింగ్స్)కు అనుమతివ్వాలన్నా, ముందుగా మామూళ్లు ఇవ్వనిదే అనుమతులు అసాధ్యమన్నది  బహిరంగ రహస్యమే.
 
అభివృద్ధి పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు చెక్కు చేతికి అందాలంటే ఇక్కడ సంబంధిత సెక్షన్లలో చేతులు తడపాల్సిందే. లేదంటే సదరు కాంట్రాక్టరుకు చెప్పులు అరిగేలా అకౌంట్స్ విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. హెచ్‌ఎండీఏలో వేళ్లూనుకొన్న అవినీతి, అక్రమాలపై సచివాలయానికి నేరుగా ఫిర్యాదులందినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ దశలో మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి  తార్నాక కార్యాలయంలో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షిస్తూ అవినీతి అధికారులకు నేరుగా చురకలంటించినా వారు దులిపేసుకోవడం విస్మయం కల్గించింది.
 
 10 మందికిబదిలీ


 హెచ్‌ఎండీఏలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 10 మందికి స్థానభ్రంశం కల్పిస్తూ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్  సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా  ఆర్ అండ్ డీఓ విభాగంలో పనిచేస్తున్న లలితను ల్యాండ్ పూలింగ్ సెక్షన్ ఎ.ఒ.గా, ప్లానింగ్ విభాగం ఏఓగా ఉన్న  శోభను పీపీ సెల్ విభాగానికి, అకౌంట్స్ సెక్షన్‌లో డీఏఓ-1గా ఉన్న పి.చంద్రశేఖర్ ఆజాద్‌ను హెచ్‌ఎండీఏ కాంప్లెక్స్‌ల డీఏఓగా, ఘట్‌కేసర్ జోనల్ ఆఫీసులో ఏపీఓగా పనిచేస్తున్న నిరంజన్ బాబును ప్లానింగ్ యూనిట్ 2-బికి బదిలీ చేశారు. అలాగే ఈఎంయూ విభాగంలో డీఏఓగా పనిచేస్తున్న నాగజ్యోతిని అకౌంట్స్ విభాగానికి, ఆర్ అండ్ డి.ఓ. సెక్షన్‌లో ఎ.ఒ.గా  ఉన్న శకుంతలను అకౌంట్స్ విభాగానికి,  ఘట్‌కేసర్ జోనల్ ఆఫీసులో ఎ.ఒ.గా ఉన్న జ్ఞానేశ్వర్‌ను ఆర్ అండ్ డి.ఒ. సెక్షన్‌లో ఎ.ఒ.గా, బీపీపీలో పనిచే స్తున్న చారిని అకౌంట్స్ సెక్షన్‌లో డీఏఓగా, హెర్మిటేజ్ విభాగంలో డీఏఓగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ను ఈఎంయూ సెక్షన్‌కు బదిలీ చేశారు. ఇప్పటివరకు హెచ్‌ఎండీఏ కాంప్లెక్స్‌లకు డీఏఓగా ఉన్న ప్రసాద్‌ను ఆర్ అండ్ డి.ఒ.కు రిపోర్టు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement