nirabhkumar Prasad
-
అద్భుత సాంస్కృతిక కేంద్రానికి అంకురార్పణ
రూ.134 కోట్లతో ఖానామెట్‌లో ఏర్పాటు! మన సంస్కృతి, కళల ప్రదర్శనకు అవకాశం పీపీపీ విధానంలో నిర్మాణానికి ప్రణాళికలు హెచ్ఎండీఏ వినూత్న యోచన సాక్షి, సిటీబ్యూరో : మహానగరంలో అద్భుతమైన ‘సాంస్కృతిక కేంద్రం’ ఏర్పాటు కానుంది. హైదరాబాద్ రీజియన్‌లోని చారిత్రక వారసత్వ, సాంస్కృతిక కళా సంపదను భావితరాలకు అందించడంతో పాటు ప్రపంచ దేశాల్లోనూ మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) నడుం బిగించింది. ఇందులో భాగంగా ఖానామెట్ లేదా ఇజత్నగర్లో భారీ ఎత్తున ఓ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలోని సంస్కృతి, కళా వైభ వం, ఆచారవ్యవహారాలు, ఆహార్యం, వేష భాషల్లోని వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా ఈ సాంస్కృతిక కేంద్రాన్ని తీర్చిదిద్దుతారు. అలాగే స్థానిక కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనకు వీలు కల్పిస్తారు. ఇందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా 4-8 వరకు థియేటర్లను నిర్మిస్తారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు అద్భుత అనుభూతి కల్పించేలా నిర్మాణాలు తీర్చిదిద్దాలన్నది హెచ్ఎండీఏ ప్రణాళిక. సుమారు రూ.134 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ పార్ట్నర్షిప్తో చేపట్టేందుకు హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులపై ఇటీవల చీఫ్ సెక్రటరీ పి.కె.మహంతితో జరిగిన సమీక్షా సమావేశంలో సాంస్కృతిక కేంద్రం (హ్యాబిటేట్ సెంటర్) ఏర్పాటుపై లోతుగా చర్చించారు. హెచ్ఎండీఏకు 30 ఎకరాల భూమిని 33 ఏళ్లపాటు లీజ్‌కు ఇవ్వడంతో పాటు తనవంతుగా రూ.30 కోట్లు భాగస్వామ్యం అందిస్తే మిగతా రూ.104 కోట్ల నిధులను ఇనిస్టిట్యూషనల్ మెంబర్స్ నుంచి సేకరించ వచ్చని ఓ ప్రైవేటు సంస్థ ఇచ్చిన సూచనలపై అధికారులు సమాలోచనలు చేశారు. అనుకున్నట్లుగా ఈ ప్రాజెక్టు సాకారమైతే మన సాంస్కృతిక కళా వైభవం ప్రపంచ దేశాల ను ఆకట్టుకోవడంతో పాటు నగరంలో ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. అసలు ఉద్దేశమిది నానాటికీ మరుగున పడిపోతున్న కళలను బ్రతికించడంతో పాటు వీటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట లభించేలా చర్యలు చేపడతారు. లిటరేచర్‌కు సంబంధించి లైబ్రరీలు, విజువల్ ఆర్ట్ గ్యాలరీలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తారు. చారిత్రక వారసత్వ సంపద, కళలు, సంస్కృతిపై ప్రభుత్వం కొత్తగా చట్టాలు చేయాల్సి వస్తే కొత్తగా నిర్మించే సాంస్కృతిక కళాకేంద్రం ఎంతో ఉపకరిస్తుంది. సంస్కృతి, సంప్రదాయాలు, కళల పట్ల భావితరాల్లో ఆసక్తి కల్పించడం, ఆసక్తి ఉన్నవారిలో నైపుణ్యం పెంచేందుకు ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు. ఈ కేంద్రానికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ భవనాలను నిర్మిస్తారు. ఇక్కడ వివిధ కళలకు సంబంధించి శిక్షణ కేంద్రాలను, ఓ రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు. స్వదేశీ, విదేశీ సంస్థల సమావేశాలు, సెమినార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకొనేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాన్ఫరెన్స్ హాళ్లు నిర్మిస్తారు. హైదరాబాద్ సాంస్కృతిక కళా వైభవాన్ని అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు, విదేశీ సంస్థలతో సమన్వయం చేసుకొనేందుకు ఇక్కడ తగిన ఎక్స్‌పర్ట్స్‌ను నియమిస్తారు. విదేశీ ప్రతినిధుల కోసం స్టార్ హోటళ్లు, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్‌లు, మసాజ్ సెంటర్లు వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు. సాంస్కృతిక కళా కేంద్రం నిర్వహణకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి కళల పునరుద్ధరణ, మరింత అభివృద్ధికి కృషి చేస్తారు. -
ఇంకా తేలని లెక్క !
= గడువు ముగిసినా అందని క్రమబద్ధీకరణ ఉత్తర్వులు =హెచ్ఎండీఏలో వేళ్లూనుకొన్న నిర్లక్ష్యం సాక్షి, సిటీబ్యూరో : హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ)లో క్రమబద్ధీకరణకు సంబంధించి లెక్కా పత్రం లేక అయోమయం నెలకొంది. ఎల్ఆర్ఎస్ కింద 65,669, బీపీఎస్ కింద 8676 దరఖాస్తులు వచ్చాయని, వీటిలో 7,656 ఎల్ఆర్ఎస్, 382 బీపీఎస్ దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు సిబ్బంది అధికారుల దృష్టికి తెచ్చారు. వాస్తవానికి బీపీఎస్ దరఖాస్తులు 520, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు సుమారు 10వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం పెండింగ్‌లో ఉన్న ఎల్ఆర్ఎస్ దరఖాస్తులను పరిష్కరించడం ద్వారా అదనపు ఆదాయాన్ని రాబట్టుకోవాలని ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రభుత్వ అనుమతి కోరుతూ లేఖ రాయాలని నిర్ణయించారు. అందులో భాగంగా అధికారులు ఇప్పుడు ఆగమేఘాలపై ఆ వివరాలను తెప్పించేందుకు 4 జోనల్ కార్యాలయాలపై ఒత్తిడి పెంచారు. ఈ నెల 11లోగా ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల వివరాలు కేంద్ర కార్యాలయానికి పంపాలని హుకుం జారీ చేశారు. ఆ తర్వాత నాలుగు రోజుల్లో ఆయా వివరాలను స్థిరీకరించి ఈ నెల 15 తర్వాత ప్రభుత్వానికి నివేదించాలని కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్లానింగ్ విభాగం అధికారులకు గడువు నిర్దేశించారు. దీంతో ఎల్ఆర్ఎస్ పెండింగ్ దరఖాస్తుల లెక్క తేల్చే పనిలో ప్లానింగ్ విభాగం సిబ్బంది బిజీ అయ్యారు. గడువు ముగిసినా... నిర్ణీత గడువులోగా అపరాధ రుసుం చెల్లించిన వారికి సైతం అధికారులు క్రమబద్ధీకరణ ఉత్తర్వులు జారీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారు. 2008లో మొదలైన ఎల్ఆర్ఎస్, బీపీఎస్ ప్రక్రియ 2013 మే 31వరకు పలు దఫాలుగా గడువు పెంపుతో కొనసాగింది. బీపీఎస్ కథ ముగియగా... ఎల్ఆర్ఎస్ గడువు ముగిసినప్పటికీ దరఖాస్తుల పరిశీలన, ఉత్తర్వుల జారీకి 2013 నవంబర్ 30వరకు అవకాశమిచ్చారు. గడువు ముగిసే చివరి రోజున హడావుడి చేసిన అధికారులు సుమారు 200లకు పైగా దరఖాస్తులను పరిష్కరించినా వీటికి సంబంధించిన ప్రొసీడింగ్స్‌ను ఇవ్వలేకపోయారు. ఫీజు చెల్లించిన వారికి కూడా క్రమబద్ధీకరణ ఉత్తర్వులు అందని పరిస్థితి ఏర్పడింది. అలాగే బీపీఎస్‌కు సంబంధించి గడువులోగా అపరాధ రుసుంతో చెల్లించినప్పటికీ ఆ దరఖాస్తుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారయింది. ఆదిలోనే నిర్లక్ష్యం : ఆరంభంలో ఎల్ఆర్ఎస్/బీపీఎస్ దరఖాస్తుల వివరాలను కంప్యూటరీకరించక పోవడం వల్ల అనేక అక్రమాలకు తావు ఇచ్చినట్లయింది. క్రమబద్ధీకరణ ముసుగులో జరిగిన వ్యవహారాలతో అక్రమార్కుల జేబులు నిండగా హెచ్ఎండీఏ ఖజానాకు భారీగా గండి పడింది. శంకర్పల్లి జోనల్ కార్యాలయంలో ఫెళ్లను తగులబెట్టిన సంఘటనపై విచారణ చేపట్టిన సిబిసిఐడీ దర్యాప్తు కూడా జాప్యం జరుగుతుండడం అనుమానాలకు తావిస్తోంది. -
అవినీతి జాడ్యానికి బదిలీల చికిత్స
=సంస్కరణలకు కమిషనర్ శ్రీకారం =హెచ్ఎండీఏలో మూకుమ్మడి బదిలీలు సాక్షి, సిటీబ్యూరో : అవినీతి, అక్రమాలతో అపకీర్తిని మూటగట్టుకొన్న ెహ చ్‌ఎండీఏను సంస్కరించేందుకు ఎట్టకేలకు ఒక్క అడుగు ముందుకు పడింది. దీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతూ సొంత సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసుకొన్న కొందరు ఉద్యోగులకు స్థానభ్రంశం కల్పిస్తూ హెచ్ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ చర్యలు చేపట్టారు. ఈమేరకు ప్లానింగ్, అకౌంట్స్, ఇ.ఎం.యూ, ఆర్ అండ్ డి.ఓ., బుద్ధపూర్ణిమ ప్రాజెక్టు విభాగాల్లో పనిచేస్తున్న వారిలో 10 మంది ఉద్యోగులను ఇతర విభాగాలకు బదిలీచేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో కొందరిపై తీవ్రమైన ఆరోపణలు రాగా, మరికొందరిపై ఫిర్యాదులు కూడా అందాయి. ప్రధానంగా ప్రజలకు సేవలందించే విషయంలో కొందరు ఉద్యోగులు వెంటనే స్పందించకపోవడం, ప్రతిపనికీ ఓ రేటు నిర్ణయించి ఔట్సోర్సింగ్ సిబ్బంది ద్వారా వసూలు చేయడం, సొమ్ము చేతికి అందాకే ఫైల్ కదలడం, అకౌంట్స్ సెక్షన్లో చేయితడపనితే చెక్కు లివ్వకపోవడం వంటి అక్రమాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులందాయి. వీటిపై అంతర్గతంగా విచారణ జరిపిస్తే విచారణాధికారిని కూడా ప్రలోభాలకు గురిచేస్తుండడంతో అక్రమాలు వెలుగు చూడకుండా పోతున్నాయి. జోనల్ వ్యవస్థను రద్దు చేసి అన్ని అనుమతులు కేంద్ర కార్యాలయం నుంచే ఇస్తుండడం అక్రమార్కులకు మరింత కలిసి వస్తోంది. దీంతో హెచ్ఎండీఏ అవినీతి, అక్రమాల్లో మునిగి తేలుతోంది. బరువు పెట్టనిదే...: హెచ్ఎండీఏలో కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు చేతిలో బరువు పెట్టనిదే ఏ పనీ జరగదన్న ఆరోపణలు చాలా కాలంగా ఉన్నాయి. ముఖ్యంగా హెచ్ఎండీఏ భూములు లీజ్‌కు తీసుకోవాలన్నా, సంస్థ సొంత భవనాలను అద్దెకు తీసుకోవాలన్నా, భూ వినియోగాన్ని మార్చుకోవాలన్నా, కొత్త లేఅవుట్లు, నూతన భవనాలకు పర్మిషన్ పొందాలన్నా, వ్యాపార-వాణిజ్య ప్రకటనల (హోర్డింగ్స్)కు అనుమతివ్వాలన్నా, ముందుగా మామూళ్లు ఇవ్వనిదే అనుమతులు అసాధ్యమన్నది బహిరంగ రహస్యమే. అభివృద్ధి పనులను పూర్తిచేసిన కాంట్రాక్టర్లకు చెక్కు చేతికి అందాలంటే ఇక్కడ సంబంధిత సెక్షన్లలో చేతులు తడపాల్సిందే. లేదంటే సదరు కాంట్రాక్టరుకు చెప్పులు అరిగేలా అకౌంట్స్ విభాగం చుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. హెచ్ఎండీఏలో వేళ్లూనుకొన్న అవినీతి, అక్రమాలపై సచివాలయానికి నేరుగా ఫిర్యాదులందినా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవట్లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఓ దశలో మున్సిపల్ శాఖ మంత్రి మహీధర్‌రెడ్డి తార్నాక కార్యాలయంలో అభివృద్ధి ప్రాజెక్టులను సమీక్షిస్తూ అవినీతి అధికారులకు నేరుగా చురకలంటించినా వారు దులిపేసుకోవడం విస్మయం కల్గించింది. 10 మందికిబదిలీ హెచ్ఎండీఏలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 10 మందికి స్థానభ్రంశం కల్పిస్తూ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానంగా ఆర్ అండ్ డీఓ విభాగంలో పనిచేస్తున్న లలితను ల్యాండ్ పూలింగ్ సెక్షన్ ఎ.ఒ.గా, ప్లానింగ్ విభాగం ఏఓగా ఉన్న శోభను పీపీ సెల్ విభాగానికి, అకౌంట్స్ సెక్షన్లో డీఏఓ-1గా ఉన్న పి.చంద్రశేఖర్ ఆజాద్‌ను హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌ల డీఏఓగా, ఘట్కేసర్ జోనల్ ఆఫీసులో ఏపీఓగా పనిచేస్తున్న నిరంజన్ బాబును ప్లానింగ్ యూనిట్ 2-బికి బదిలీ చేశారు. అలాగే ఈఎంయూ విభాగంలో డీఏఓగా పనిచేస్తున్న నాగజ్యోతిని అకౌంట్స్ విభాగానికి, ఆర్ అండ్ డి.ఓ. సెక్షన్లో ఎ.ఒ.గా ఉన్న శకుంతలను అకౌంట్స్ విభాగానికి, ఘట్కేసర్ జోనల్ ఆఫీసులో ఎ.ఒ.గా ఉన్న జ్ఞానేశ్వర్‌ను ఆర్ అండ్ డి.ఒ. సెక్షన్లో ఎ.ఒ.గా, బీపీపీలో పనిచే స్తున్న చారిని అకౌంట్స్ సెక్షన్లో డీఏఓగా, హెర్మిటేజ్ విభాగంలో డీఏఓగా పనిచేస్తున్న విజయ్‌కుమార్‌ను ఈఎంయూ సెక్షన్‌కు బదిలీ చేశారు. ఇప్పటివరకు హెచ్ఎండీఏ కాంప్లెక్స్‌లకు డీఏఓగా ఉన్న ప్రసాద్‌ను ఆర్ అండ్ డి.ఒ.కు రిపోర్టు చేయాల్సిందిగా ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు.