అద్భుత సాంస్కృతిక కేంద్రానికి అంకురార్పణ | Outstanding Cultural Center Initiative | Sakshi
Sakshi News home page

అద్భుత సాంస్కృతిక కేంద్రానికి అంకురార్పణ

Published Tue, Feb 4 2014 3:27 AM | Last Updated on Sat, Sep 2 2017 3:18 AM

అద్భుత సాంస్కృతిక కేంద్రానికి అంకురార్పణ

అద్భుత సాంస్కృతిక కేంద్రానికి అంకురార్పణ

  • రూ.134 కోట్లతో ఖానామెట్‌లో ఏర్పాటు!
  •   మన సంస్కృతి, కళల ప్రదర్శనకు అవకాశం
  •   పీపీపీ విధానంలో నిర్మాణానికి ప్రణాళికలు
  •   హెచ్‌ఎండీఏ వినూత్న యోచన
  •  సాక్షి, సిటీబ్యూరో : మహానగరంలో అద్భుతమైన ‘సాంస్కృతిక కేంద్రం’ ఏర్పాటు కానుంది. హైదరాబాద్ రీజియన్‌లోని చారిత్రక వారసత్వ, సాంస్కృతిక కళా సంపదను భావితరాలకు అందించడంతో పాటు ప్రపంచ దేశాల్లోనూ మరింత ప్రాచుర్యం కల్పించేందుకు మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) నడుం బిగించింది.  ఇందులో భాగంగా ఖానామెట్ లేదా ఇజత్‌నగర్‌లో భారీ ఎత్తున ఓ ప్రాంగణాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ ప్రాంతంలోని సంస్కృతి, కళా వైభ వం, ఆచారవ్యవహారాలు, ఆహార్యం, వేష భాషల్లోని వైవిధ్యాన్ని కళ్లకు కట్టేలా ఈ సాంస్కృతిక కేంద్రాన్ని తీర్చిదిద్దుతారు.

    అలాగే స్థానిక కళాకారుల ఉత్పత్తుల ప్రదర్శనకు వీలు కల్పిస్తారు. ఇందుకోసం ఇక్కడ ప్రత్యేకంగా 4-8 వరకు థియేటర్లను నిర్మిస్తారు. ఇక్కడికి వచ్చే సందర్శకులకు అద్భుత అనుభూతి కల్పించేలా నిర్మాణాలు తీర్చిదిద్దాలన్నది హెచ్‌ఎండీఏ ప్రణాళిక. సుమారు రూ.134 కోట్ల వ్యయంతో కూడిన ఈ ప్రాజెక్టును పబ్లిక్, ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్‌తో చేపట్టేందుకు హెచ్‌ఎండీఏ కమిషనర్ నీరభ్‌కుమార్ ప్రసాద్ ప్రయత్నాలు ప్రారంభించారు. కొత్త ప్రాజెక్టులపై ఇటీవల చీఫ్ సెక్రటరీ పి.కె.మహంతితో జరిగిన సమీక్షా సమావేశంలో సాంస్కృతిక కేంద్రం (హ్యాబిటేట్ సెంటర్) ఏర్పాటుపై లోతుగా చర్చించారు.

    హెచ్‌ఎండీఏకు 30 ఎకరాల భూమిని 33 ఏళ్లపాటు లీజ్‌కు ఇవ్వడంతో పాటు తనవంతుగా రూ.30 కోట్లు భాగస్వామ్యం అందిస్తే మిగతా రూ.104 కోట్ల నిధులను ఇనిస్టిట్యూషనల్ మెంబర్స్ నుంచి సేకరించ వచ్చని ఓ ప్రైవేటు సంస్థ ఇచ్చిన సూచనలపై అధికారులు సమాలోచనలు చేశారు. అనుకున్నట్లుగా ఈ ప్రాజెక్టు సాకారమైతే మన సాంస్కృతిక కళా వైభవం ప్రపంచ దేశాల ను ఆకట్టుకోవడంతో పాటు నగరంలో ప్రత్యక్షంగా, పరోక్ష్యంగా పెద్దసంఖ్యలో ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
     
     అసలు ఉద్దేశమిది
     నానాటికీ మరుగున పడిపోతున్న కళలను బ్రతికించడంతో పాటు వీటికి సంబంధించిన సమస్త సమాచారాన్ని ఒకే చోట లభించేలా చర్యలు చేపడతారు.
     
     లిటరేచర్‌కు సంబంధించి లైబ్రరీలు, విజువల్ ఆర్ట్ గ్యాలరీలను శాశ్వతంగా ఏర్పాటు చేస్తారు.
     
     చారిత్రక వారసత్వ సంపద, కళలు, సంస్కృతిపై ప్రభుత్వం కొత్తగా చట్టాలు చేయాల్సి వస్తే కొత్తగా నిర్మించే సాంస్కృతిక కళాకేంద్రం ఎంతో ఉపకరిస్తుంది.
     
     సంస్కృతి, సంప్రదాయాలు, కళల పట్ల భావితరాల్లో ఆసక్తి కల్పించడం, ఆసక్తి ఉన్నవారిలో నైపుణ్యం పెంచేందుకు ఇక్కడ ప్రత్యేకంగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.
     
     ఈ కేంద్రానికి తగిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు 30 ఎకరాల విస్తీర్ణంలో భారీ భవనాలను నిర్మిస్తారు.
     
     ఇక్కడ వివిధ కళలకు సంబంధించి శిక్షణ కేంద్రాలను, ఓ రిసోర్స్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేస్తారు.
     
     స్వదేశీ, విదేశీ సంస్థల సమావేశాలు, సెమినార్లు, ఎగ్జిబిషన్లు నిర్వహించుకొనేందుకు అత్యాధునిక సౌకర్యాలతో కూడిన కాన్ఫరెన్స్ హాళ్లు నిర్మిస్తారు.
     
     హైదరాబాద్  సాంస్కృతిక కళా వైభవాన్ని అంతర్జాతీయంగా చాటిచెప్పేందుకు, విదేశీ సంస్థలతో సమన్వయం చేసుకొనేందుకు ఇక్కడ తగిన ఎక్స్‌పర్ట్స్‌ను నియమిస్తారు.
     
     విదేశీ ప్రతినిధుల కోసం స్టార్ హోటళ్లు, స్విమ్మింగ్ పూల్స్, క్లబ్‌లు, మసాజ్ సెంటర్లు వంటివి కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు.
     
     సాంస్కృతిక కళా కేంద్రం నిర్వహణకు ప్రత్యేకంగా ఓ కమిటీని ఏర్పాటు చేసి కళల పునరుద్ధరణ, మరింత అభివృద్ధికి కృషి చేస్తారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement