ప్రముఖులను కలవరపెడుతున్న ట్రంప్ బడ్జెట్
అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకురాబోతున్న తొలి బడ్జెట్ పై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. విదేశాలకు సహాయం, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో బడ్జెట్ కేటాయింపులను తగ్గించడం పలువురు ప్రముఖులను కలవర పెడుతోంది. ట్రంప్ ఈ బడ్జెట్ ప్రతిపాదనలను బిల్, మెలిండా గేట్స్ ఫౌండేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఒకవేళ ఈ బడ్జెట్ ను కనుక ఆమోదిస్తే, ప్రపంచంలో అమెరికానే తక్కువ సుసంపన్నమైన, తక్కువ సురక్షితమైన దేశంగా ఉంటుందని బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. బడ్జెట్ ప్రతిపాదనలతో తాము పూర్తిగా సమస్యల ఉచ్చులో కూరుకుపోతామని, ఇది పేద ప్రజలపై ఎక్కువగా ప్రభావం చూపనుందని ఫౌండేషన్ సీఈవో స్యూ డెస్మండ్-హెల్ల్మన్ అన్నారు.
దేశంలో ఉన్నవారిని, విదేశీయులను ఎంతో ప్రభావితం చేయనుందన్నారు. ట్రంప్ బడ్జెట్ ఎక్కువగా రక్షణ వ్యవహారాలకు సహాయపడుతుందని, మిగతా వాటిని పట్టించుకోవడం లేదని వాపోయారు. విద్యుత్, రవాణా, వ్యవసాయం, పర్యావరణం వంటి డిపార్ట్ మెంట్లను గాలికి వదిలేశారని ఆరోపించారు. ప్రజలను ఆరోగ్యవంతంగా, సుస్థిరమైన సంఘాలలో జీవించే విధంగా సహకరించాలని, ఇది జాతి భద్రతకంటే కూడా ఎంతో క్లిష్టతరమైన అంశమని గేట్స్ ఫౌండేషన్ పేర్కొంది. గురువారం ట్రంప్ బడ్జెట్ బ్లూప్రింట్ ను విడుదల చేశారు. అమెరికా ఫస్ట్ పేరుతో వచ్చిన ఈ బడ్జెట్లో విదేశీ సహాయాలు తగ్గిస్తున్నట్టు ప్రతిపాదించారు.