బడ్జెట్ వండింది వీరే...
న్యూఢిల్లీ : బడ్జెట్ అంటే రెండు గంటల ప్రసంగం కాదు.. దాని వెనుక బుర్రలు బద్దలు కొట్టుకునే నిపుణులు ఉంటారు. రాత్రీపగలు నెలల తరబడి అందులోనే తలమునకలయ్యే అధికారులుంటారు. ఎంతో కసరత్తు.. మరెంతో శ్రమకు ఓర్చి వారు ఈ లెక్కల పద్దుకు ఓ రూపు తెస్తారు. మరి ఈసారి బడ్జెట్ తయారీలో కీలక పాత్ర పోషించినవారి గురించి ఓసారి చూద్దామా..!
1981 ఐఏఎస్ బ్యాచ్ అధికారి. ఇంతకుముందు గుజరాత్ ఆర్థిక విభాగంలో అదనపు ముఖ్య కార్యదర్శిగా పనిచేశారు. బ్యాంకు సంస్కరణల్లో దిట్ట. యోగాలో కూడా నిపుణుడు.
హస్కుఖ్ అదియా (కార్యదర్శి, ఆర్థిక సేవల విభాగం)
తమిళనాడుకు చెందిన ఈయన ఆర్థికాంశాల్లో నిష్ణాతుడు. ఐఐఎం-అహ్మదాబాద్లో చదివిన అరవింద్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన పీటర్సన్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఇంటర్నేషనల్ ఎకానమిక్స్, సెంటర్ ఫర్ గ్లోబల్ డెవలప్మెంట్, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థల్లో పనిచేశారు. భారత్, చైనా ఆర్థిక వ్యవస్థలపై మంచి పట్టు ఉంది.
అరవింద్ సుబ్రహ్మణ్యన్ (ప్రభుత్వ ముఖ్య ఆర్థిక సలహాదారు)
తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. ఆ రాష్ట్రంలో విజయవంతమైన ప్రత్యేక ఆర్థిక మండళ్లు(సెజ్), పారిశ్రామిక విధానాల రూపకల్పనలో ముఖ్య పాత్ర పోషించారు. అంతకుముందు ఎరువుల శాఖకు కార్యదర్శిగా పనిచేశారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్ తయారీలో విశేష అనుభవం ఉంది.
శక్తికాంత దాస్ (కార్యదర్శి, రెవెన్యూ విభాగం)
ఈయన ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి. యూపీఏ హయాంలో పనిచేసి ఇప్పుడు మోదీ టీంలో కూడా చోటుదక్కించుకున్న ఏకైక అధికారి. మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసి దేశ సరళీకరణ విధానాల్లో కీలక పాత్ర పోషించారు.
రతన్ పి వాటల్ (కార్యదర్శి, నిధుల వ్యయం విభాగం)
కోల్ ఇండియాలో 10 శాతం ప్రభుత్వ వాటా విక్రయించి ఖజానాకు రూ.22,500 కోట్ల ఆదాయం సమకూర్చడంలో ఈమె కీలక పాత్ర పోషించారు. వివిధ రంగాల్లో ప్రభుత్వ పెట్టుబడుల ఉపసంహరణకు మార్గాలు వేస్తున్నారు. ఓఎన్జీసీలో కూడా 5 శాతం వాటా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆరాధన జోహ్రి (కార్యదర్శి, పెట్టుబడుల ఉపసంహరణ విభాగం)
రాజస్థాన్ కేడర్ ఐఏఎస్ అధికారి. మోదీ సర్కారు ఈయనను ఏరికోరి ఆర్థిక వ్యవహారాల కార్యదర్శిగా నియమించింది. గతంలో రాజస్థాన్లో పలు సంస్కరణలకు బాటలేశారు.
రాజీవ్ మెహ్రిశి (కార్యదర్శి, ఆర్థిక వ్యవహారాలు)