budget preparation
-
TS: ఎన్ని ‘కలల’ బడ్జెట్.. ఎలా ఉండబోతుంది?
సాక్షి, హైదరాబాద్: ఈ ఏడాదిలో ఎప్పుడైనా ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ప్రజారంజక బడ్జెట్ రూపకల్పనకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సంక్షేమం, అభివృద్ధితోపాటు ‘బ్యాలెట్ బాక్స్’ పథకాలను కూడా వచ్చే ఏడాది బడ్జెట్లో పొందుపరిచే అవకాశమున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెల 3న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానుండగా, అదే రోజు దాదాపు రూ.3 లక్షల కోట్ల ప్రతిపాదనలతో సర్కారు అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే అవకాశముందనే చర్చ ఆర్థిక శాఖ వర్గాల్లో జరుగుతోంది. పన్ను ఆదా యం ఆశించిన మేర వస్తుండటం, జీడీపీలో స్థిరమైన వృద్ధి నమోదవుతుండటంతో 2023–24 ఆర్థిక సంవత్సరంపై కూడా గంపెడాశలతో బడ్జెట్‌ను అసెంబ్లీ ముందు పెట్టేందుకు సిద్ధమవుతోంది. సంక్షేమం.. సబ్సిడీలు రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి నుంచీ సంక్షేమ పథకాలకు తగిన ప్రాధాన్యతనిస్తోంది. ఈ కోవలోనే ఈసారీ సంక్షేమం, మౌలిక సదుపాయాలు, సాగునీటి రంగాలకు ప్రాధాన్యమిచ్చేలా బడ్జెట్ రూపకల్పన చేస్తోంది. పింఛన్లు, దళితబంధు, రైతుబంధు, బీమా, రుణమాఫీ, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ లాంటి సంక్షేమ పథకాలకు నిధుల కొనసాగింపుతోపాటు సాగునీటి ప్రాజెక్టులు, రీజనల్ రింగు రోడ్డు (ఆర్ఆర్ఆర్), రాష్ట్ర రహదారులు, విద్యుత్ సబ్సిడీలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు పెద్ద మొత్తంలో నిధులు కేటాయించే అవకాశాలున్నాయి. సాగునీటి పథకాలకు రూ.35వేల కోట్లు ప్రతిపాదించే అవకాశముంది. దీనికితోడు వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.30 వేల కోట్లు, ఉద్యోగుల, జీతభత్యాల పద్దు కింద రూ.40 వేల కోట్లు, పారిశ్రామిక ప్రోత్సాహకాల కింద రూ.2,500 కోట్లు ప్రతిపాదించనున్నట్టు సమాచారం. వీటితోపాటు అప్పులకు వడ్డీల కింద రూ.12 వేల కోట్లు, అప్పుల చెల్లింపు కింద రూ.18వేల కోట్లు ప్రతిపాదించే అవకాశముంది. బడ్జెట్లో బ్యాలెట్ బాక్స్ పథకాలు! ఎన్నికలే లక్ష్యంగా బ్యాలెట్ బాక్స్ పథకాలనూ ఈసారి బడ్జెట్లో ప్రకటిస్తారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. అందులోభాగంగానే రాష్ట్రంలోని దాదాపు 13 వేల గ్రామపంచాయతీలకు ఒక్కోదానికి రూ.10లక్షల చొప్పున దాదాపు రూ.1,300 కోట్ల వరకు ప్రకటించే చాన్సుంది. సొంత స్థలం ఉంటే ఇల్లు కట్టుకునేందుకు రూ.3 లక్షలు ఇచ్చే పథకానికి సంబంధించిన మార్గదర్శకాలు కూడా సిద్ధమైనందున దీనికి రూ.12వేల కోట్లు కావాలని ఆ శాఖ ప్రతిపాదించింది. అలాగే, దళితబంధు తరహాలోనే గిరిజన బంధును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. గిరిజన బంధును ప్రకటిస్తే ఈ పద్దు కింద రూ.5వేల కోట్ల వరకు చూపించే అవకాశముంది. వీటితోపాటు ఫీజు రీయింబర్స్మెంట్, మన ఊరు–మన బడి, పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు, సబ్సిడీ గొర్రెల పథకం, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఆర్టీసీకి ఆసరా లాంటి కార్యక్రమాలకూ నిధులు పెరిగే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి రూ.2.56 లక్షల కోట్ల ప్రతిపాదనలను ప్రభుత్వం పెట్టగా, అందులో రూ.2.3 లక్షల కోట్ల వరకు సవరించిన అంచనాలు వచ్చే అవకాశముందని సమాచారం. గత బడ్జెట్ కంటే 15 శాతం వరకు బడ్జెట్‌ను పెంచే అవకాశముందని, అందువల్ల ఈసారి పద్దు రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని అంచనా. కీలక శాఖల ప్రతిపాదనలు ఇలా.. మౌలిక సౌకర్యాల కల్పనలో కీలకమైన ఆర్‌అండ్‌బీకి నిధులు పెంచే అవకాశముంది. రాష్ట్ర రహదారులకు రూ.6 వేల కోట్లు, భవనాల నిర్మాణానికి రూ.850 కోట్లు, ట్రిపుల్ ఆర్ ఉత్తర భాగంలో (సంగారెడ్డి–చౌటుప్పల్) భూసేకరణ కోసం రూ.2,500 కోట్లు కావాలని ఆ శాఖ అధికారులు ప్రతిపాదించారు. గత మూడేళ్లుగా ప్రభుత్వం ఆర్టీసీకి రూ.1500 కోట్లు కేటాయిస్తుండగా, ఈసారి కొత్త బస్సులు కొనాల్సిన పరిస్థితుల్లో బడ్జెట్ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు ఆశిస్తున్నారు. గత బడ్జెట్లో అత్యధిక నిధులు కేటాయించిన పంచాయతీరాజ్ శాఖకు ఈసారి రూ.35 వేల కోట్లు అవసరం అవుతాయని ఆ శాఖ ప్రతిపాదించింది. ఆసరా పింఛన్ల కింద రూ.14 వేల కోట్లు, వడ్డీలేని రుణ పథకానికి రూ.3 వేల కోట్లు కావాలని కోరింది. రూ.15 వేల కోట్లు కేటాయించాలని ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రం విధించిన ఆంక్షలతో ఏడాది కాలంగా కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల పనుల్లో వేగం తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల నిర్మాణంతోపాటు ఇప్పటికే వాటి కోసం తీసుకున్న రుణాల చెల్లింపుల కోసం రూ.35 వేల కోట్లు కేటాయించాలని నీటి పారుదల శాఖ ప్రతిపాదించింది. కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా తీసుకున్న రుణాలకు అసలుతోపాటు వడ్డీల చెల్లింపులకు గతేడాది రూ.12 వేల కోట్ల వ్యయమైందని, ఈ ఏడాది రుణాలు, వడ్డీల చెల్లింపులకు వ్యయం మరింత పెరిగి రూ.14 వేల నుంచి రూ.15 వేల కోట్లకు పెరగనున్నట్టు ప్రభుత్వానికి తెలిపింది. ఇక కాళేశ్వరం ప్రాజెక్టు పనులు, భూసేకరణ, పరిహారం చెల్లింపులకు మరో రూ. 5 వేల కోట్లు కోరినట్టు తెలిసింది. పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతలకు రూ.4వేల కోట్లు, సీతారామ ప్రాజెక్టుకు రూ.వెయ్యి కోట్లు, కల్వకుర్తి ఎత్తిపోతలకు రూ.500 కోట్లు కేటాయించనున్నట్టు సమాచారం. విద్యుత్ చార్జీలు పెంచొద్దు! విద్యుత్ సబ్సిడీల కింద రూ.10,535 కోట్లను బడ్జెట్లో కేటాయించాలని ఇంధన శాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. ఎన్నికల ఏడాది కావడంతో ప్రస్తుత విద్యుత్ చార్జీలనే 2023–24లో కొనసాగించాలని, ఎలాంటి పెంపు అమలు చేయరాదని విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)లు నిర్ణయించాయి. ప్రస్తుత చార్జీల కొనసాగింపుతో రూ.10,535 కోట్ల ఆదాయ లోటు ఉండనుందని, ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో ఆమేరకు నిధులు కేటాయించాలని కోరాయి. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌తోపాటు వివిధ కేటగిరీల వినియోగదారులకు ఇస్తున్న విద్యుత్ రాయితీ పథకాలను కొనసాగించడానికి సబ్సిడీలు అవసరం కానున్నాయి. విద్యుత్ సబ్సిడీలతోపాటు ఎత్తిపోతల పథకాల విద్యుత్ బిల్లుల కోసం రూ.13 వేల కోట్లను బడ్జెట్లో కేటాయించాలని ఇంధన శాఖ ప్రతిపాదించినట్లు తెలిసింది. -
బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రారంభం
న్యూఢిల్లీ: సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–2021) బడ్జెట్ పత్రాల ముద్రణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి అనురాగ్ ఠాకూర్, ఆర్థిక శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్ 2020–21 ఫైనాన్స్ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు. నరేంద్రమోదీ రెండవసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సమర్పిస్తున్న రెండవ బడ్జెట్ ఇది. ఫైనాన్స్ కార్యదర్శి రాజీవ్ కుమార్, రెవెన్యూ సెక్రటరీ అజయ్ భూషణ్ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి, డీఐపీఏఎం సెక్రటరీ తుహిన్ కాంత పాండే, వ్యయ వ్యవహారాల కార్యదర్శి టీవీ సోమనాథన్ తదితరులు హల్వా రుచుల ఆరగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. సంబంధాలు కట్: కీలక హల్వా కార్యక్రమం అనంతరం బడ్జెట్ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ హల్వా రుచిచూసే కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడటానికి వీలుండదు. పార్లమెంట్ నార్త్ బ్లాక్ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది. ► తొలినాళ్లలో రాష్ట్రపతి భవన్లో బడ్జెట్ డాక్యుమెంట్ల ముద్రణ జరిగేది. డాక్యుమెంట్లు 1950లో లీక్ అవడంతో ఈ ప్రక్రియను మింట్ రోడ్‌కు మార్చారు. అటు తర్వాత 1980లో నార్త్‌బ్లాక్‌కు మార్చారు. ► 1999కు ముందు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి తేదీ సాయంత్రం 5 గంటలకు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టేవారు. అయితే, యశ్వంత్ సిన్హా ఈ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. 2016లో అరుణ్ జైట్లీ బడ్జెట్ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు. ► బడ్జెట్ ప్రసంగం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ఆర్థిక వ్యవస్థ ప్రధాన విధాన చొరవలు వంటి అంశాలతో ఉంటుంది. రెండవ భాగంలో పన్ను ప్రతిపాదనలు ఉంటాయి. అంత గోప్యత ఎందుకు? ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది. వీటితో పాటు ఈ బడ్జెట్ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్ కింద ఉండే బడ్జెట్ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్‌రే స్కానర్‌ను ఏర్పాటుచేసి, కంప్యూటర్‌తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది. అలాగే బడ్జెట్‌ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు. ముద్రణ సమయంలో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు. మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్ డ్రిల్’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రతా సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదంతో బడ్జెట్ అమల్లోకి వస్తుంది. 1947 నవంబర్ 26వ తేదీన ఆర్కే షణ్ముకం శెట్టి భారత్ తొలి బడ్జెట్‌ను సమర్పించారు. -
బడ్జెట్ పరిభాషకు ‘అర్థ్‌శాస్త్రి’
న్యూఢిల్లీ: బడ్జెట్ పరిభాషపై సామాన్యులు, విద్యార్థులకు అవగాహన కల్పించే దిశగా కేంద్ర ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది. జనవరి 22 నుంచి సోషల్ మీడియాలో ప్రచార కార్యక్రమాలు ప్రారంభించనుంది. ‘అర్థ్‌శాస్త్రి’ పేరిట నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో.. పలు సంక్లిష్టమైన ఆర్థిక అంశాలను ఆసక్తికరమైన యానిమేటెడ్ వీడియోల రూపంలో వివరించనుంది. బడ్జెట్ ప్రక్రియ గురించి సరళమైన విధానంలో తెలుసుకునేందుకు ఇది ఉపయోగపడగలదని అధికారవర్గాలు తెలిపాయి. గతేడాది కూడా కేంద్రం ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది. ఫిబ్రవరి 1న కొత్త ఆర్థిక సంవత్సర బడ్జెట్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. మరోవైపు, బడ్జెట్ హామీల్లో నెరవేర్చిన వాటి గురించి తెలియజేసేందుకు ఆర్థిక శాఖ ‘హమారాభరోసా’ ట్యాగ్‌తో మరో ప్రచార కార్యక్రమం కూడా ప్రారంభించింది. జనవరి 29 దాకా ఈ రెండూ కొనసాగనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
ఈ నెల 14 నుంచి బడ్జెట్ కసరత్తు
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్ కసరత్తు ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్నది. నరేంద్ర మోదీ రెండోసారి ప్రధానిగా పగ్గాలు చేపట్టిన తర్వాత రానున్న రెండో బడ్జెట్ ఇది. మరోవైపు ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టబోయే రెండో బడ్జెట్ కూడా ఇదే. బడ్జెట్ ముందస్తు/సవరించిన అంచనాల సమావేశాలు ఈ నెల 14 నుంచి మొదలవుతాయని ఆర్థిక వ్యవహారాల విభాగం వెలువరించిన బడ్జెట్ సర్క్యూలర్(2020–21) వెల్లడించింది. ఈ సమావేశాలకు అవసరమైన వివరాలను ఆర్థిక సలహాదారులందరూ అందజేయాల్సి ఉందని ఈ సర్క్యూలర్ పేర్కొంది. వచ్చే నెల మొదటివారం వరకూ ఈ సమావేశాలు కొనసాగుతాయని పేర్కొంది. కొత్త అంశాలు.... వచ్చే ఏడాది బడ్జెట్లో కొత్తగా ఎస్సీ సబ్ ప్లాన్, ట్రైబల్ సబ్‌ప్లాన్, లింగ, చిన్న పిల్లల బడ్జెట్ స్టేట్మెంట్స్ కూడా చేర్చనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్‌ను పార్లమెంట్లో ప్రవేశపెడతారు. -
బడ్జెట్ రూపకల్పన.. ఆసక్తికర విషయాలు
బడ్జెట్.. అనగానే చాలామంది లెక్కల చిక్కులే అనుకుంటారు! కానీ ఈ మూడక్షరాల వెనుక 6 నెలల కృషి దాగుంటుంది. ఎంతో కసరత్తు.. లెక్కకు మించి భేటీలు.. గోప్యత.. అబ్బో చాలా తతంగమే ఉంటుంది. అదేంటో మీరే ఓ లుక్కేయండి!! సెప్టెంబర్‌లో మొదలు.. రానున్న ఆర్థిక సంవత్సరంలో ఏయే రంగానికి ఎంత ఖర్చు పెట్టాలన్న కసరత్తు మొదలవుతుంది. దేశంలో మొత్తం జనాభా తమ తిండి కోసం ఏడాది అంతా ఎంత ఖర్చు చేస్తున్నారో దాదాపు అంత మొత్తాన్ని ప్రభుత్వం బడ్జెట్‌కు కేటాయిస్తుంది. అక్టోబర్ చర్చలు.. తమకు కావాల్సిన నిధులపై వివిధ మంత్రిత్వ శాఖల ఉన్నతాధికారులు ఆర్థికశాఖతో చర్చల్లో తలమునకలవుతారు. డిసెంబర్లో బ్లూ ప్రింట్స్ ముసాయిదా బడ్జెట్ కాపీలను అధికారులు ఆర్థికమంత్రికి నివేదిస్తారు. ఈ ముసాయిదా పత్రాలన్నీ నీలం రంగులో ఉంటాయి. కొత్త ఏడాది ప్రారంభంలో సలహాలు, సూచనలు పారిశ్రామిక, బ్యాంకింగ్ రంగాలకు చెందిన వివిధ సంఘాల ప్రతినిధులు ఆర్థికమంత్రిని కలిసి తమ సమస్యలను సలహాలను, సూచనలను అందజేస్తారు. ఈ సందర్భంగా ఆర్థికమంత్రి అందరి వాదనలు వింటారుగానీ ఎవరికీ నిర్దిష్టమైన హామీ ఇవ్వరు. ముద్రణ ప్రక్రియ షురూ.. ఇక 'హల్వా వేడుక'తో బడ్జెట్ పత్రాల ప్రింటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతోంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ పత్రాల ముద్రణకు ముందుగా 'హల్వా వేడుక' నిర్వహించడం ఆనవాయితీ. వేడుక అనంతరం ఆర్థిక శాఖలో పనిచేసే ఉద్యోగులందరూ బడ్జెట్ పత్రాల ప్రింటింగ్‌లో బిజీ అవుతారు. లోక్‌సభలో ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగం పూర్తయ్యేంత వరకు దాదాపు వందమంది అధికారులు ప్రింటింగ్ ప్రెస్లోనే వుంటారు. బడ్జెట్ ప్రతిపాదనలు ఏమాత్రం లీక్ కాకుండా చూసే బాధ్యతను ఇంటెలిజెన్స్ విభాగం చూసుకుంటుంది. ఇందుకు కొందరు ఉన్నతాధికారుల ఫోన్లను సైతం ట్యాప్ చేస్తుంటుంది. ఉద్యోగులపై డేటా కన్ను.. ఆర్థిక శాఖ కార్యాలయానికి వచ్చే సందర్శకులపై సీసీటీవీ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు నిఘా ఉంటుంది. ఈ కెమెరాల పరిధిని దాటి వారు కుర్చీలపై కూర్చోవడానికి కూడా అనుమతి ఉండదు. అంతా 'ప్రత్యేకం' బడ్జెట్ పత్రాలను తయారు చేసే 'ప్రింటింగ్ ప్రెస్' సిబ్బందిని ఎవరితో సంబంధం లేకుండా ప్రత్యేకంగా ఉంచుతారు. వీరికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తినా వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు. నీడలా వెన్నంటే.. ముద్రణ విభాగం సిబ్బంది ఎవరైనా అత్యవసరంగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి వస్తే.. సదరు వ్యక్తి వెంట ఓ ఇంటెలిజెన్స్ అధికారి, ఓ పోలీసు ఉంటారు. వారు అనుక్షణం ఆయనను నీడలా అనుసరిస్తారు. వారిద్దరికీ ముందుగానే... సభలో ప్రవేశపెట్టేముందు రాష్ట్రపతి, ప్రధానికి బడ్జెట్ గురించి ఆర్థిక మంత్రి వివరిస్తారు. పార్లమెంట్ ముందుకు బ్రీఫ్‌కేసు.. ఇక చివరికి బడ్జెట్ పత్రాలు కలిగి ఉన్న బ్రీఫ్‌కేసును తీసుకుని ఆర్థిక మంత్రి పార్లమెంట్ ముందుకు వస్తారు. స్పీకర్ ఆదేశాల మేరకు ఆర్థికమంత్రి తన బడ్జెట్ ప్రసంగాన్ని ప్రారంభిస్తారు. -
‘పథకం’ ప్రకారం కసరత్తు
♦ అభయహస్తం ఉంచాలా.. వద్దా? ♦ డ్వామా, డీఆర్డీఏలను ఒక్కటి చేద్దామా.. ♦ పావలా వడ్డీ.. రుణ పథకాలన్నీ ఒకే గొడుగు కిందకు ♦ బడ్జెట్ తయారీపై ముగిసిన ప్రణాళికా విభాగం కసరత్తు సాక్షి, హైదరాబాద్: ఆయా శాఖల్లో అమలవుతున్న పథకాల్లో కొన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చేందుకు రాష్ర్ట ప్రణాళిక సంఘం కసరత్తు చేస్తోంది. కొన్నింటిని రద్దు చేయాలని భావిస్తోంది. అభయహస్తం ఉంచాలా.. వద్దా.. అని ఆలోచిస్తోంది. ఈ పథకాన్ని ఆసరాలో విలీనం చేసే విషయంపైనా యోచిస్తోంది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ), జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా)ను ఒకే గొడుగు కిందికి తీసుకు వచ్చే వీలుందా అని పరిశీలిస్తోంది. పొలంబడి పథకం రద్దు చేయాలని, తెలంగాణలోని భౌగోళిక పరిస్థితులు పట్టు పరిశ్రమలకు అనుకూలించనందున ఆ పథకాలన్నీ తొలగించాలని, పావలా వడ్డీ, వడ్డీ లేని రుణాలు, రుణమాఫీ పథకాలన్నీ ఒకే పథకం కిందికి తీసుకురావాలని, విత్తనోత్పత్తి పథకం, సీడ్ ఫామ్స్ పథకం, సబ్సిడీపై విత్తన సరఫరా పథకం, సబ్సిడీ సీడ్ ప్రొడక్ట్స్ పథకాలన్నీ ఒక్కటిగానే పరిగణించాలని, ఈ తరహాలో వ్యవసాయ శాఖ పరిధిలో ఉన్న పథకాల్లో సగం పద్దులు తొలగించాలని భావిస్తోంది. ఇదే తీరుగా శాఖల వారీగా జరిగిన బడ్జెట్ తయారీ సమీక్షలపై రాష్ట్ర ప్రణాళిక సంఘం నివేదికను సిద్ధం చేస్తోంది. 260 పద్దుల విలీనం: ప్రస్తుతం రాష్ట్ర బడ్జెట్లో వివిధ పథకాలకు సంబంధించి 839 పద్దులున్నాయి. వీటిలో 260 పథకాలను మిగతావాటిలో విలీనం చేసేందుకు వీలుందని ఆర్థిక శాఖ ముసాయిదాను సిద్ధం చేసింది. ఈ జాబితాలను అన్ని శాఖలకు పంపించింది. వీటి ఆధారంగానే రాష్ట్ర ప్రణాళిక సంఘం వివిధ శాఖలతో 4 రోజులపాటు సమీక్ష నిర్వహించింది. గతానికి భిన్నంగా శాఖలవారీగా సమీక్షలు నిర్వహించి పథకాల విలీన ప్రక్రియపై స్పష్టత ఇవ్వాలని సీఎం కేసీఆర్ ఇటీవల రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్‌రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఈ సమీక్షల్లో తీసుకున్న నిర్ణయాలతో రాష్ట్ర ప్రణాళిక సంఘం నివేదికను తయారు చేస్తోంది. ఒకట్రెండు రోజుల్లో ఈ నివేదికను సీఎస్ రాజీవ్‌శర్మకు సమర్పించి.. తర్వాత సీఎం కేసీఆర్ ఆమోదానికి పంపిస్తారు. వాయిదా పడ్డ జిల్లా అభివృద్ధి కార్డుల తయారీ ప్రక్రియ బడ్జెట్ తర్వాతే చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది.