బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభం | Budget 2020-21 document printing starts with halwa making tradition | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రారంభం

Published Tue, Jan 21 2020 5:05 AM | Last Updated on Wed, Jan 29 2020 3:06 PM

Budget 2020-21 document printing starts with halwa making tradition - Sakshi

హల్వా కార్యక్రమంలో పాల్గొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ఇతర ఉన్నతాధికారులు

న్యూఢిల్లీ: సాంప్రదాయక హల్వా రుచుల ఆస్వాదనతో వచ్చే ఆర్థిక సంవత్సరం (2020–2021) బడ్జెట్‌ పత్రాల ముద్రణ ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది. ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సహాయమంత్రి అనురాగ్‌ ఠాకూర్, ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన సీతారామన్‌ 2020–21 ఫైనాన్స్‌ బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టనున్నారు.  నరేంద్రమోదీ రెండవసారి ప్రధానిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత సమర్పిస్తున్న రెండవ బడ్జెట్‌ ఇది. ఫైనాన్స్‌ కార్యదర్శి రాజీవ్‌ కుమార్, రెవెన్యూ సెక్రటరీ అజయ్‌ భూషణ్‌ పాండే, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అతను చక్రవర్తి, డీఐపీఏఎం సెక్రటరీ తుహిన్‌ కాంత పాండే, వ్యయ వ్యవహారాల కార్యదర్శి టీవీ సోమనాథన్‌ తదితరులు హల్వా రుచుల ఆరగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు.
 
సంబంధాలు కట్‌: కీలక హల్వా కార్యక్రమం అనంతరం బడ్జెట్‌ ముద్రణ ప్రక్రియతో సంబంధమున్న ముఖ్య అధికారులు అందరికీ... ‘ఆర్థిక మంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ను సమర్పించేంతవరకూ’ బాహ్య ప్రపంచంతో సంబంధాలు పూర్తిగా తెగిపోతాయి. ఈ హల్వా రుచిచూసే కార్యక్రమం అనంతరం మంత్రులు, అతికొద్ది మంది ఉన్నత స్థాయి ఆర్థిక శాఖ అధికారులకు మాత్రమే ఇళ్లకు వెళ్లడానికి అనుమతి ఉంటుంది. మిగిలినవారికి కనీసం వారి ఆప్తులతో సైతం ఫోనులోగానీ, ఈ–మెయిల్‌తోగానీ మరే రకంగానూ మాట్లాడటానికి వీలుండదు.  పార్లమెంట్‌ నార్త్‌ బ్లాక్‌ హౌసెస్‌లోని ప్రత్యేక బడ్జెట్‌ ప్రెస్‌లో ఈ కీలక పత్రాల ముద్రణ జరుగుతుంది.

►  తొలినాళ్లలో రాష్ట్రపతి భవన్‌లో బడ్జెట్‌ డాక్యుమెంట్ల ముద్రణ జరిగేది. డాక్యుమెంట్లు 1950లో లీక్‌ అవడంతో ఈ ప్రక్రియను మింట్‌ రోడ్‌కు మార్చారు. అటు తర్వాత 1980లో నార్త్‌బ్లాక్‌కు మార్చారు.

► 1999కు ముందు బడ్జెట్‌ను ఫిబ్రవరి చివరి తేదీ సాయంత్రం 5 గంటలకు ఆర్థిక మంత్రి ప్రవేశపెట్టేవారు.  అయితే, యశ్వంత్‌ సిన్హా ఈ సమయాన్ని ఉదయం 11 గంటలకు మార్చారు. 2016లో అరుణ్‌ జైట్లీ బడ్జెట్‌ ప్రవేశపెట్టే తేదీని ఫిబ్రవరి 1వ తేదీకి మార్చారు.

► బడ్జెట్‌ ప్రసంగం రెండు భాగాలుగా ఉంటుంది. మొదటి భాగం ఆర్థిక వ్యవస్థ  ప్రధాన విధాన చొరవలు వంటి అంశాలతో ఉంటుంది. రెండవ భాగంలో పన్ను ప్రతిపాదనలు ఉంటాయి.  


అంత గోప్యత ఎందుకు?
ఎంతో పకడ్బందీగా తయారయ్యే ఈ బడ్జెట్‌ గనక ముందే బయటకు తెలిసిపోతే... బడ్జెట్‌ను  కొన్ని వర్గాలు ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి... బడ్జెట్‌ తయారీని అత్యంత గోప్యంగా ఉంచుతారు. ఒక దేశానికి ఎంత పటిష్ట స్థాయిలో రక్షణ ఉంటుందో... బడ్జెట్‌ తయారీ అయ్యే ముద్రణ విషయంలో కూడా అంతే స్థాయి నిఘా  ఉంటుంది. అత్యాధునిక పర్యవేక్షణ పరికరాలు, పటిష్టమైన సైనిక భద్రత, ఆధునిక నిఘా పరికరాలు, జామర్లు, పెద్ద స్కానర్లు... ఇలా అనేక పరికరాల్ని ఏర్పాటు చేస్తారు. ఆర్థికమంత్రి పార్లమెంటులో బడ్జెట్‌ ప్రవేశపెట్టే వరకూ ఈ భద్రత కొనసాగుతూనే ఉంటుంది.

వీటితో పాటు ఈ బడ్జెట్‌ ప్రక్రియ కొనసాగినంత కాలం నార్త్‌బ్లాక్‌లో ఉండే ఆర్థికశాఖ కార్యాలయం నుంచి, ఆ బ్లాక్‌ కింద ఉండే బడ్జెట్‌ ముద్రణా విభాగం నుంచి వెళ్లే ఫోన్లను అన్నింటినీ ట్యాప్‌ చేసేందుకు ఒక ప్రత్యేక ఎక్సే్ఛంజీని ఏర్పాటు చేస్తారు. ఇక ఈ కార్యాలయానికి వెళ్లే మార్గంలో పెద్ద ఎక్స్‌రే స్కానర్‌ను ఏర్పాటుచేసి, కంప్యూటర్‌తో అనుసంధానిస్తారు. ఈ పరికరాల వల్ల ఏ చిన్న వస్తువు తీసుకువెళ్తున్నా ఇట్టే తెలిసిపోతుంది.  అలాగే బడ్జెట్‌ను ముద్రించే సమయంలో ఆర్థికశాఖ కార్యదర్శి... ప్రధానితోను, ఆర్థిక మంత్రితోను సమన్వయం చేస్తూ సమావేశాలకు హాజరవుతూ ఉంటారు.

ముద్రణ సమయంలో అనునిత్యం ఐబీ అధికారులు, ఢిల్లీ పోలీసులు కునుకులేకుండా కాపలాకాస్తుంటారు. మధ్య మధ్యలో సెక్యూరిటీని పరీక్షించేందుకు ‘మాక్‌ డ్రిల్‌’ పద్ధతిలో కొంతమంది ఉద్దేశపూర్వకంగా కొన్ని పత్రాలు బయటకు తెచ్చేందుకు ప్రయత్నిస్తారు. వీరిని గనుక సమర్థంగా పట్టుకోగలిగితే భద్రత చక్కగా ఉన్నట్లే. లేకుంటే భద్రతా సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవు. ఇక బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున వాటి ప్రతుల్ని భారీ బందోబస్తు మధ్య పార్లమెంటు భవనానికి తరలిస్తారు. అనంతరం ఆర్థికమంత్రి సార్వత్రిక బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడతారు. పార్లమెంటు ఆమోదంతో బడ్జెట్‌ అమల్లోకి వస్తుంది. 1947 నవంబర్‌ 26వ తేదీన ఆర్‌కే షణ్ముకం శెట్టి భారత్‌ తొలి బడ్జెట్‌ను సమర్పించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement