న్యూయార్క్ లో భారీ పేలుళ్లు, ధ్వంసమైన భవనం
అమెరికాలోని న్యూయార్క్ లోని ఈస్ట్ హార్లెమ్ లో బుధవారం సాయంత్రం భారీ పేలుళ్లు సంభవించాయి. ఆ వెనువెంటనే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ప్రాంతమంతా దట్టమైన పొగలు అలుముకున్నాయి. ఈ పేలుళ్ల వెనువెంటనే ఈస్ట్ హార్టెమ్ లో రెండు భవనాలు కుప్పకూలిపోయాయి. ఈ సంఘటన భారతీయ సమయం ప్రకారం సాయంత్రం 7.22 కి జరిగింది.
సంఘటనా స్థలాన్ని 114, పార్క్ ఎవెన్యూగా పేర్కొంటారు. సంఘటన స్థలంలో చాలా మంది శిథిలాల కింద చిక్కుకుని ఉంటారని స్థానికులు చెబుతున్నారు. పదకొండు మందికి గాయాలయ్యాయని వార్తలు వస్తున్నాయి. కనీసం గాయపడ్డ నలుగురిని ఆస్పత్రికి తరలించడం చూశామని స్థానికులు చెబుతున్నారు. ఈ పేలుళ్లకు కారణం ఏమిటన్నది ఇంతవరకూ తెలియరాలేదు. కనీసం 150 మందికి పైగా అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సంఘటన తరువాత మొత్తం ప్రాంతంలో హై అలెర్ట్ ను ప్రకటించారు. అన్ని రైళ్లు, వాహనాలను నిలిపివేశారు.
సెప్టెంబర్ 11 తరువాత న్యూయార్క్, మాన్ హటన్ ప్రాంతంలో గతంలో కనీసం ఒక ఉగ్రవాద దాడికి విఫలయత్నం జరిగింది.