భవన శిథిలాల కింద 12 మంది సమాధి
థానే: థానే రైల్వేస్టేషన్ సమీపంలో మంగళవారం వేకుజామున భవనం కూలి ఒకే కుటుంబంలో నలుగురు సహా మొత్తం 12 మంది మృతి చెందారు. పదిమందికిపైగా గాయపడ్డారు. అగ్నిమాపక సిబ్బంది, జాతీయ విపత్తు నివారణ దళం సభ్యులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
శిథిలాల కింద నుంచి 12 మంది వరకు రక్షించి స్థానిక ఆస్పత్రికి తరలించారు. కూలిన భవనం 50 ఏళ్ల కింద కట్టినదని, ప్రమాదకర భవనాల జాబితాలో చేర్చినదని మునిసిపల్ అదనపు కమిషనర్ సునీల్ చవాన్ చెప్పారు. సహాయక చర్యలను జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఏక్నాథ్ షిండే, జిల్లా కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.