రెక్కలు ముక్కలు
* రాష్ట్రంలో 1.40 కోట్ల మంది అసంఘటిత రంగంలోనే
* ఏపీఈఆర్పీ పర్యవసానం
* బాబు పాలనలో కార్మికద్రోహం
* బిల్డింగ్ వెల్ఫేర్ ఫండ్’ నుంచి రూ.400 కోట్లు మళ్లించి
* నిర్మాణ కార్మికుల నోట మట్టికొట్టిన కిరణ్‌కుమార్‌రెడ్డి
జన పథం: 1.40 కోట్ల మంది...ఎవరంటారా..? రాష్ర్టంలోని అసంఘటిత కార్మికులు.. పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్, డీఏ, పింఛను, గ్రాట్యుటీ....అబ్బే! అంతెందుకు...వారికి కనీస వేతనాలే ఉండవు. ఎందుకంటే వారు సర్కారు నిర్లక్ష్యానికి ‘బండ’బారిన బతుకులను మొండిగా ఈడుస్తున్నవారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోనూ భద్రత లేని శ్రమ చేస్తుంటారు. ఏ సంస్థలోనైనా కాజువల్ కార్మికులది వేదనే. కనీస వే తనాలను ఎగవేయడం, ప్రమాదాల్లో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం, పీఎఫ్, ఈఎస్ఐలు ఇవ్వాలని టెండర్లో ఉన్నా వారికి ఆ సదుపాయాలు కల్పించకపోవడం ఆనవాయితీగా మారింది. ఈ దుస్థితికి జీవో 16 రూపంలో చంద్రబాబు పాలనలోనే బీజం పడింది. వీరంతా ఓట్ల రూపంలో సంఘటితమైతే తమను నిర్లక్ష్యం చేసిన నేతల భవితవ్యాన్ని నిర్దేశించగలరు.
బొల్లోజు రవి, ఎలక్షన్ సెల్: రాష్ట్రంలో అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున పెరగడానికి, టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్ణయాలకు అవినాభావ సంబంధం ఉంది. 1995లో చంద్రబాబు ప్రభుత్వం ప్రపంచ బ్యాంకు అప్పుతో ప్రారంభించిన ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పునర్నిర్మాణ ప్రాజెక్టు (ఏపీఈఆర్పీ) పర్యవసానంగా ప్రభుత్వ రంగంలో తాత్కాలి క కార్మికులు, తాత్కాలిక ఉద్యోగులు పెరిగి పోయారు. ఎంతగా అంటే...దేశంలో అసం ఘటిత రంగ కార్మికులు అత్యధిక మంది ఉన్న రాష్ట్రాల్లో మనం మూడో స్థానంలో ఉన్నాం. దేశంలోని అసంఘటిత రంగ కార్మికుల్లో 10 శాతం మన రాష్ట్రంలోనే ఉన్నారు.
నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది...
రాష్ట్రంలో వ్యవసాయం దెబ్బతినిపోవడంతో లక్షలాదిగా రైతులు, రైతు కూలీలు నిర్మాణ రంగంలో కార్మికులుగా మారిపోయారు. ఇంత పెద్ద ఎత్తున కార్మికులు ఉండడంతో వారి సంక్షేమం కోసం ప్రత్యేకంగా బిల్డింగ్ వెల్పేర్ బోర్డును కూడా ఏర్పాటు చేశారు. ఆ బోర్డులో రూ. 1250 కోట్లు ఉన్నాయి. ఏడు నెలల క్రితం ఇందులోని రూ. 400 కోట్లకుపైగా అప్పటి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఇతరత్రా బదలాయించారు. భవన నిర్మాణ కార్మికులకు ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని పరిష్కరించలేదు.
బీడీ కార్మికులు 8 లక్షలు....
రాష్ట్రంలో బీడీ వర్కర్లు 8 లక్షల మంది ఉంటారు. అందులో 6 లక్షల మంది ఉత్తర తెలంగాణలోనే ఉంటారు. దాదాపు 30 నియోజవర్గాల్లో వీరు ఎన్నికల్లో జయాపజయాలను ప్రభావితం చేయగలరు. 20 లక్షల మంది హమాలీలు ఉన్నారు. 5 లక్షల మంది ఇళ్లల్లో పనిచేస్తున్నారు. ఐకేపీలో 6 లక్షల మంది పనిచేస్తున్నారు.
భద్రత కరువు... భవిష్యత్తు బరువు
అసంఘటిత కార్మికులు ప్రధానంగా పట్టణాల్లో కేంద్రీకరించి ఉంటున్నారు. ఆదా యం తక్కువ కావడంతో వీరు మురికివాడల్లో నివసిస్తున్నారు. వారికి రేషన్‌కార్డులు, ఇళ్లపట్టాలు, మంచినీరు వంటి పౌరసేవలు అందవు.
* సిమెంటు, స్టీల్ ధరల పెరగడంతో నిర్మాణ కార్మికులకు పని తగ్గింది.
* కరెంటు కోతలతో చిన్న మధ్యతరహా పరిశ్రమలు మూతపడ్డాయి.
* రైసు మిల్లులు ఆడకపోవడంతో హమాలీలకు పనులు దొరకడంలేదు.
* ఆకు, తంబాకు సరఫరా లేక బీడీ కార్మికుల పనిదినాలు కోతపడ్డాయి.
* లేసుతో అల్లిన టోపీలు తయారు చేసేవారు పశ్చిమ గోదావరి జిల్లాలో 19 మండలాలు, తూర్పులోని కోనసీమ ప్రాంతంలో కలిపి లక్ష మంది ఉన్నారు. అందరూ మహిళలే.
* బీడీ కార్మికులు ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో, రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 8 లక్షల మంది ఉన్నారు. వీరికి పీఎఫ్ కవరేజీ లేదు.
* ఈ సేవా కేంద్రాలు షెడ్యూల్ పరిశ్రమల జాబితాలో లేకపోవడం వల్ల అందులో పనిచేసేవారు కనీస వేతనాలకు నోచుకోవడంలేదు.
* షెడ్యూల్ లిస్టులో ఉండి ఎప్పటికప్పుడు కనీస వేతనాలు నిర్ణయించే జీడిపప్పు తయారీ, ఆక్వా పరిశ్రమ మొదలైన వాటిల్లో వేలాది మంది పనిచేస్తున్నా అక్కడా కనీస వేతనాలు అమలు లేదు. వాటిలో పనిచేసే వేలాది మంది మహిళలు, పిల్లలకు చేతులు కాలినా జీడిరసం పడి మొహాలు, చేతులపై బొబ్బలొచ్చినా ఏ పరిహారం ఇవ్వరు.
* కార్మికుల నష్టపరిహార చట్టం ప్రకారం పనిచేసే చోట ప్రమాదవశాత్తూ చనిపోయినా, అంగవైకల్యం ప్రాప్తించినా కార్మికుడి వయస్సు, ఇంకా ఎన్నేళ్లు ఆ పని చేయగలుగుతాడో నిర్ణయించి అప్పటికి అతనికి రావాల్సిన వేతనంపై ఆధారపడి నష్టపరిహారం లెక్కిస్తారు. కానీ ఇవేవి అమలు కావడంలేదు.
జీవో 16/1995 శాపం
అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, ఉద్యోగులకు కనీస వేతనాలు అందకపోవడానికి టీడీపీ తీసుకొచ్చిన జీవోనే కారణమని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయిబాబు అంటున్నారు. 50 పాయింట్స్ వినిమయ ధరల సూచి పెరిగినా... 2 ఏళ్లు పూర్తయినా కనీస వేత నాలు నిర్ణయించాలని 60వ దశకంలో అఖిల భారత కార్మిక మంత్రుల సమావేశం తీర్మాని ంచింది. అయితే 1995లో టీడీపీ ప్రభుత్వం దీన్ని సవరిస్తూ జీవో 16 విడుదల చేసింది. డీఏ ఇస్తున్నాం కాబట్టి ఐదేళ్లకోసారి కనీస వేతనాల పునర్నిర్ణయం చేయాలని టీడీపీ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నిర్ణయం అసంఘటిత కార్మికుల పాలిట శాపంగా మారింది.
కనీస వేతనాలు కరువు
సింగరేణి సంస్థలో సుమారు 20 వేల మంది కాంట్రాక్టు కార్మికులు పనిచేస్తున్నారు. 9వ వేతన ఒప్పందం సందర్భంగా హైపవర్ కమిటీ నిర్ణయించిన మేరకు అన్‌స్కిల్డ్ కార్మికులకు రోజుకు రూ. 460, సెమీస్కిల్డ్ కార్మికులకు రూ. 494, స్కిల్డ్ కార్మికులకు రూ. 524, హై స్కిల్డ్ కార్మికులకు రూ. 554 ఇవ్వాలి. కానీ అమలు జరగడం లేదు.
- కె.విశ్వనాథ్, అధ్యక్షుడు,
ఎస్సీసీడబ్ల్యూ యూనియన్, గోదావరిఖని
నాటి పాలకుల పుణ్యమే...
చింతల్ హెచ్‌యంటీ ల్యాంప్ డివిజన్లో 2500 మందికి పైగా కార్మికులు పని చేస్తుండేవారు. 1996 నుంచి పతనం ప్రారంభమై 2002 కల్లా పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. ప్రభుత్వం పట్టించుకుంటే ఉత్పత్తులు కొనసాగిస్తున్న హెచ్యంటిని కాపాడుకునేవాళ్లం. వేల మంది ఉసురు అప్పటి ప్రభుత్వానికి తగులుతుంది. కార్మికులకు అండగా ఉండేవారికే మా ఓటు.
- అశోక్, హెచ్‌యంటీ ల్యాంప్ డివిజన్
మాజీ కార్మికుడు, కుత్బుల్లాపూర్
ప్రైవేటుకు కొమ్ముకాశారు..
తొమ్మిది వేల మంది కార్మికులు ఉన్న ఐడీపీఎల్‌ను 1994 నుంచి 2004 మధ్య మూసివేసే దిశకు తీసుకొచ్చారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ పరిశ్రమలకు కొమ్ముకాయడం వల్ల ప్రభుత్వ సంస్థలు మూతపడ్డాయి. కార్మికుల ఓట్లతో గద్దెనెక్కిన టీడీపీ కార్మిక ద్రోహం చేసింది.
- జల్దా రాఘవులు,
ఐడీపీఎల్ మాజీ కార్మికుడు, గాంధీనగర్