అజాంఖాన్కు సీబీఐ చిక్కులు
లక్నో: బులంద్ షహర్ లైంగిక దాడికి సంబధించి ఉత్తరప్రదేశ్ మంత్రి అజామ్ ఖాన్కు నోటీసులు పంపించాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. బులంద్ షహర్ లో తల్లి కూతుళ్లపై జరిగిన లైంగిక దాడిపట్ల నిర్లక్ష్యంగా స్పందించడమే కాకుండా ఈ లైంగిక దాడి వెనుక రాజకీయ కుట్ర ఉందంటూ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు గతంలోనే ఆగ్రహం వ్యక్తం చేసింది. బాధితులను చిన్నచూపు చూడటం తగదని, తక్కువ చేసి మాట్లాడటమేమిటని ఆగ్రహం వ్యక్తం చేసింది.
'ఎందుకు అధికారంలో ఉన్న బాధ్యతాయుతమైన వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తారు. రాష్ట్ర ప్రభుత్వం శాంతిభద్రతలను తప్పక రక్షించాలి. బాధితుల విశ్వాసాన్ని ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు పోగొట్టుకోకూడదు' అంటూ అజాంఖాన్ వ్యాఖ్యలపై నాడు జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సీ నాగప్పన్ ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఆ నేపథ్యంలోనే తాజాగా అజాం ఖాన్ నుంచి వివరణ కోరేందుకు నోటీసులు ఇవ్వాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.