Bulk Drug Unit
-
తెలంగాణకు గుడ్ న్యూస్.. బల్క్ డ్రగ్ పార్కు ఏర్పాటుకు కేంద్రం ఓకే
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణకు బల్క్ డ్రగ్ పార్కు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ వెల్లడించారు. శుక్రవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో.. బీఆర్ఎస్ ఎంపీ నామ నాగేశ్వరరావు తెలంగాణలో బల్క్ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేయాలని కోరినప్పుడు.. కేంద్రమంత్రి సమాధానమిస్తూ దేశంలో 12వేలకుపైగా దేశంలో ఫార్మా సంస్థలున్నాయని వివరించారు. పీఎల్ఐ పథకంలో భాగంగా 2020–21 నుంచి 2024–25 మధ్య దేశంలో మూడు చోట్ల బల్క్ డ్రగ్ పరిశ్రమలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఒక్కొక్క పార్కుకు రూ.1,000 కోట్లు వెచ్చిస్తున్నట్టు పేర్కొన్నారు. తెలంగాణ, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో బల్క్ డ్రగ్ పార్కులకు ఆమోదం తెలిపామన్నారు. ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు రూ.584.04 కోట్లు దేశంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్‌కు 2021–22లో గత నవంబర్ 28 నాటికి రూ.584.04 కోట్లు విడుదల చేశామని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ పవార్ తెలిపారు. కాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ మిషన్‌కు రూ.4,176.84 కోట్లు కేటాయించినట్లు ఎంపీ నామా అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అందులో ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.102.91 కోట్లు కేటాయించామన్నారు. నేషనల్ హెల్త్ మిషన్ కింద ఏపీలో 43137 మంది, తెలంగాణలో 32854 మంది ఆశా వర్కర్లు ఉన్నారని టీడీపీ ఎంపీ కేశినేని శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బదులిచ్చారు. ఇదీ చదవండి: బల్క్‌డ్రగ్ పార్క్ ఏర్పాటులో రాష్ట్రంపై వివక్ష -
ఫార్మాలో స్వయం సమృద్ధి..
న్యూఢిల్లీ: దేశీయంగా బల్క్ డ్రగ్స్, వైద్య పరికరాల తయారీని మరింతగా ప్రోత్సహించడంపై కేంద్రం దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్ పార్క్‌లను అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన నాలుగు స్కీముల మార్గదర్శకాలను కేంద్రం సోమవారం ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతకు అనుగుణంగా ఫార్మా రంగంలో భారత్ స్వయం సమృద్ధి సాధించే విధంగా ఈ స్కీమ్‌లను రూపొందించినట్లు కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ విలేకరుల సమావేశంలో తెలిపారు. 53 కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రీడియెంట్స్ (ఏపీఐ), వైద్య పరికరాల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించాలన్నది లక్ష్యమని ఆయన వివరించారు. వీటికి సంబంధించి భారత్ ప్రస్తుతం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోందని తెలిపారు. కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలతో అంతర్జాతీయంగా సరఫరా వ్యవస్థలు దెబ్బతిని, దేశీయంగా వైద్యంపై ప్రతికూల ప్రభావాలు పడే పరిస్థితి నెలకొందని మంత్రి చెప్పారు. అయితే, ఫార్మా రంగం, జాతీయ ఫార్మా ప్రైసింగ్ అథారిటీ క్రియాశీలకంగా వ్యవహరించి ఔషధాల కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకోవడంతో లాక్డౌన్ సమయంలోనూ ఇబ్బందులు పడే అవసరం రాలేదన్నారు. ఈ నేపథ్యంలోనే దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించుకుని దేశీయంగా ఆయా ఔషధాలు, డివైజ్‌ల ఉత్పత్తిని మరింత పెంచుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెడుతోందని మంత్రి చెప్పారు. ‘ప్రస్తుతం దేశీ ఫార్మా రంగ పరిమాణం సుమారు 40 బిలియన్ డాలర్లుగా ఉంది. సరైన తోడ్పాటు అందిస్తే 2024 నాటికి ఇది 100 బిలియన్ డాలర్లకు చేరగలదు. తద్వారా 2025 నాటికల్లా భారత్‌ను 5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలన్న ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్య సాధనకు తోడ్పడగలదు‘ అని గౌడ తెలిపారు. ఫార్మా విభాగం రూపొందించిన ఈ స్కీములకు కేంద్ర క్యాబినెట్ ఈ ఏడాది మార్చిలో ఆమోదముద్ర వేసింది. అర్హత ప్రమాణాలను బట్టి ఎంపిక.. పరిశ్రమవర్గాలు, రాష్ట్రాల ప్రభుత్వాలతో విస్తృతంగా సంప్రదింపులు జరిపిన మీదట స్కీముల మార్గదర్శకాలు రూపొందించినట్లు గౌడ చెప్పారు. మార్గదర్శకాల్లో పొందుపర్చిన అర్హతా ప్రమాణాల్లో ఆయా ఉత్పత్తి సంస్థలకు వచ్చే మార్కుల ఆధారంగా తయారీ ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్ఐ) స్కీమునకు ఎంపిక చేయడం జరుగుతుందని ఆయన తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తోడ్పాటుతో ఏర్పాటయ్యే ఈ ఉత్పత్తి పార్కుల్లో అధునాతన ఇన్ఫ్రా, మెరుగైన కనెక్టివిటీ, తక్కువ ధరలకు స్థలం, పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలకు అవసరమైన పటిష్టమైన వ్యవస్థ మొదలైనవన్నీ ఉంటాయని పేర్కొన్నారు. దీనివల్ల కొత్త తయారీ యూనిట్ల ఏర్పాటులో సమయం, పెట్టుబడి వ్యయాలు తగ్గుతాయని వివరించారు. ‘ఈ స్కీములపై కంపెనీల నుంచి సానుకూల స్పందన ఉంటుందని భావిస్తున్నాం. అధునాతన టెక్నాలజీ, పెట్టుబడులను ఈ పార్కులు ఆకర్షించగలవు. కార్యకలాపాలు ప్రారంభమైన రెండు, మూడేళ్లలో ఇవి ప్రత్యక్షంగా, పరోక్షంగా వేల కొద్దీ ఉద్యోగాలను కల్పించగలవు, అలాగే దిగుమతులపై ఆధారపడటం తగ్గించగలవు. గ్లోబల్ ఫార్మా హబ్‌గా భారత్ ఎదిగేందుకు ఉపయోగపడగలవు‘ అని గౌడ చెప్పారు. స్వాగతించిన పరిశ్రమ.. దేశీయంగా బల్క్ డ్రగ్, మెడికల్ డివైజ్‌ల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన స్కీముల మార్గదర్శకాలను పరిశ్రమ స్వాగతించింది. స్కీములు సక్రమంగా అమలైతే 8–10 ఏళ్ల కాలంలో ఏపీఐల తయారీలో భారత్ స్వయం సమృద్ధి సాధించగలదని ఇండియన్ డ్రగ్ మ్యాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ (ఐడీఎంఏ) ఈడీ అశోక్ కుమార్ మదన్ తెలిపారు. -
ఆడంబరాలు తగ్గించి... ఆపన్నులకు ఆసరాగా...
మంతెన వెంకటరామరాజు... పారిశ్రామిక వేత్త అని చెబితే వెంటనే గుర్తొస్తారో లేదో కానీ ‘వసుధ ఫౌండేషన్’ రామరాజు అంటే చాలామందికి గుర్తొస్తారీయన. హైదరాబాద్‌లో ‘వసుధ ఫార్మా లిమిటెడ్’ పేరుతో బల్క్ డ్రగ్ యూనిట్ నిర్వహిస్తున్నారు. వసుధ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు. కాళ్లు లేని పిల్లాడిని ఎత్తుకుని వచ్చిన తల్లితండ్రులకు వైద్యానికి సహాయం చేస్తారు. చదువుకోవడానికి డబ్బుల్లేవని వస్తే పుస్తకాలు కొనిస్తారు. నాకీ కష్టం అని వచ్చిన వారెవరినీ ఊరికే పంపించరు. అయితే ఆ కష్టం నిజమైనదా కాదా అని మాత్రం పరిశీలిస్తారు. ఇలా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ ఈ మధ్య ఆయన తలసీమియా వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించడం వార్తల్లో విషయమైంది. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రామరాజును కలిసినప్పుడు స్ఫూర్తిదాయకమైన అనేక విషయాలను చెప్పారాయన. ‘‘జీవితంలో స్థిరపడడానికి మనకు నచ్చిన రంగాన్ని కానీ అవకాశాలు వచ్చిన రంగాన్ని కానీ ఎంచుకుంటాం. అలా నాకు నచ్చిన కోర్సు చదువుకున్నాను. అదే రంగంలో ఉద్యోగంలో చేరాను. నాకంటూ ఉన్న లక్ష్యాల కోసం సొంతంగా పరిశ్రమను స్థాపించాను. అయితే పరిశ్రమను లాభాల బాటలో నడిపించడం అంటే... స్థాపించినంత సులువు కాదని చాలామంది వ్యాపారవేత్తలకు వచ్చినట్లే నాకూ అనుభవంలోకి వచ్చింది. అనుభవం నేర్పిన పాఠాలే లాభాలకు పెట్టుబడి అయ్యాయి. ఇప్పుడు మా కంపెనీ 45 దేశాలకు బల్క్ డ్రగ్‌ను ఎగుమతి చేస్తోంది. నా వ్యాపార పరుగులో కొంత ఊపిరి తీసుకునే వెసులుబాటు వచ్చింది. నా పిల్లలిద్దరూ పెద్దయ్యారు. నేను వెనక్కి చూసుకోవడానికి కొంత విరామం దొరికింది. వ్యాపారపరంగా ఎన్నో దేశాల్లో పర్యటిస్తుంటాను. అక్కడ ఉన్నన్ని అవకాశాలు మన దగ్గర కూడా ఉంటే ఎంతో మంది రాణిస్తారనిపించేది. దాంతో నేను చేయగలిగిందేదో చేస్తూ తృప్తి పడుతున్నాను. నేనిది చేశాను అని చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ ప్రసారమాధ్యమాల్లో కనిపించను’’ అన్నారు రామరాజు. ఇంతకీ అసలేం జరిగిందంటే... రత్నావళి అనే మహిళ తరచూ ఆఫీసుకొచ్చి తలసీమియా పేషెంట్ల గురించి చెప్పేవారు. ఒకరోజు రామరాజు హైదరాబాద్ నగరంలో చార్మినార్ ప్రాంతంలోని తలసీమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీకి వెళ్లారు. అక్కడి సన్నివేశం ఎవరినైనా ఇట్టే కదిలించేటట్లు ఉంటుంది. వెంటనే అక్కడికక్కడే ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘‘అక్కడికి వెళ్లిన తర్వాత నా గుండె కలచివేసినంత పనైంది. ఏ పాపమూ ఎరుగని అమాయకులు. ఇంత తీవ్రమైన వ్యాధి ఎందుకు వచ్చిందో వారికి తెలియదు. తల్లిదండ్రుల పరిస్థితి మరీ దయనీయం. అంతంత దూరాల నుంచి పిల్లల్ని తీసుకుని రావడానికి దారి ఖర్చులకే డబ్బులేని వారే అందరూ. ఇక చికిత్స కోసం రక్తం ఎక్కడ కొనగలరు. వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తే దాతల కోసం వెతుకులాట తప్పుతుంది కదా అని అంత మొత్తాన్ని ఇచ్చాను’’ అన్నారాయన. ‘‘ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన డబ్బులో అవసరాలకు పోగా మిగిలిన దాంట్లో ఆడంబరాలు, సౌకర్యాల కోసం కొంత వాటా ఉంటుంది. తమ సరదా కోసం ఖర్చు చేసే పదిరూపాయల్లో కనీసం రెండ్రూపాయలైనా తగ్గించుకుంటే అది మరొకరికి ఆసరా అవుతుంది’’ అంటారాయన. ముఖ్యంగా సంపన్నవర్గాలు, వ్యాపార వేత్తలకు ఆయనిచ్చే సూచన ఇది. ఆచరణాత్మకమైన ఆలోచనే! - దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్