ఆడంబరాలు తగ్గించి... ఆపన్నులకు ఆసరాగా... | help to poor people | Sakshi
Sakshi News home page

ఆడంబరాలు తగ్గించి... ఆపన్నులకు ఆసరాగా...

Published Tue, Dec 2 2014 10:42 PM | Last Updated on Sat, Sep 2 2017 5:30 PM

ఆడంబరాలు తగ్గించి...  ఆపన్నులకు ఆసరాగా...

ఆడంబరాలు తగ్గించి... ఆపన్నులకు ఆసరాగా...

మంతెన వెంకటరామరాజు... పారిశ్రామిక వేత్త అని చెబితే వెంటనే గుర్తొస్తారో లేదో కానీ ‘వసుధ ఫౌండేషన్’ రామరాజు అంటే చాలామందికి గుర్తొస్తారీయన. హైదరాబాద్‌లో ‘వసుధ ఫార్మా లిమిటెడ్’ పేరుతో బల్క్ డ్రగ్ యూనిట్ నిర్వహిస్తున్నారు. వసుధ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు. కాళ్లు లేని పిల్లాడిని ఎత్తుకుని వచ్చిన తల్లితండ్రులకు వైద్యానికి సహాయం చేస్తారు. చదువుకోవడానికి డబ్బుల్లేవని వస్తే పుస్తకాలు కొనిస్తారు. నాకీ కష్టం అని వచ్చిన వారెవరినీ ఊరికే పంపించరు. అయితే ఆ కష్టం నిజమైనదా కాదా అని మాత్రం పరిశీలిస్తారు. ఇలా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ ఈ మధ్య ఆయన తలసీమియా వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించడం వార్తల్లో విషయమైంది. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రామరాజును కలిసినప్పుడు స్ఫూర్తిదాయకమైన అనేక విషయాలను చెప్పారాయన.

‘‘జీవితంలో స్థిరపడడానికి మనకు నచ్చిన రంగాన్ని కానీ అవకాశాలు వచ్చిన రంగాన్ని కానీ ఎంచుకుంటాం. అలా నాకు నచ్చిన కోర్సు చదువుకున్నాను. అదే రంగంలో ఉద్యోగంలో చేరాను. నాకంటూ ఉన్న లక్ష్యాల కోసం సొంతంగా పరిశ్రమను స్థాపించాను. అయితే పరిశ్రమను లాభాల బాటలో నడిపించడం అంటే... స్థాపించినంత సులువు కాదని చాలామంది వ్యాపారవేత్తలకు వచ్చినట్లే నాకూ అనుభవంలోకి వచ్చింది. అనుభవం నేర్పిన పాఠాలే లాభాలకు పెట్టుబడి అయ్యాయి. ఇప్పుడు మా కంపెనీ 45 దేశాలకు బల్క్ డ్రగ్‌ను ఎగుమతి చేస్తోంది. నా వ్యాపార పరుగులో కొంత ఊపిరి తీసుకునే వెసులుబాటు వచ్చింది. నా పిల్లలిద్దరూ పెద్దయ్యారు. నేను వెనక్కి చూసుకోవడానికి కొంత విరామం దొరికింది. వ్యాపారపరంగా ఎన్నో దేశాల్లో పర్యటిస్తుంటాను. అక్కడ ఉన్నన్ని అవకాశాలు మన దగ్గర కూడా ఉంటే ఎంతో మంది రాణిస్తారనిపించేది. దాంతో నేను చేయగలిగిందేదో చేస్తూ తృప్తి పడుతున్నాను. నేనిది చేశాను అని చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ ప్రసారమాధ్యమాల్లో కనిపించను’’ అన్నారు రామరాజు.


ఇంతకీ అసలేం జరిగిందంటే... రత్నావళి అనే మహిళ తరచూ ఆఫీసుకొచ్చి తలసీమియా పేషెంట్ల గురించి చెప్పేవారు. ఒకరోజు రామరాజు హైదరాబాద్ నగరంలో చార్మినార్ ప్రాంతంలోని తలసీమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీకి వెళ్లారు. అక్కడి సన్నివేశం ఎవరినైనా ఇట్టే కదిలించేటట్లు ఉంటుంది. వెంటనే అక్కడికక్కడే ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘‘అక్కడికి వెళ్లిన తర్వాత నా గుండె కలచివేసినంత పనైంది. ఏ పాపమూ ఎరుగని అమాయకులు. ఇంత తీవ్రమైన వ్యాధి ఎందుకు వచ్చిందో వారికి తెలియదు. తల్లిదండ్రుల పరిస్థితి మరీ దయనీయం. అంతంత దూరాల నుంచి పిల్లల్ని తీసుకుని రావడానికి దారి ఖర్చులకే డబ్బులేని వారే అందరూ. ఇక చికిత్స కోసం రక్తం ఎక్కడ కొనగలరు. వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తే దాతల కోసం వెతుకులాట తప్పుతుంది కదా అని అంత మొత్తాన్ని ఇచ్చాను’’ అన్నారాయన.

‘‘ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన డబ్బులో అవసరాలకు పోగా మిగిలిన దాంట్లో ఆడంబరాలు, సౌకర్యాల కోసం కొంత వాటా ఉంటుంది. తమ సరదా కోసం ఖర్చు చేసే పదిరూపాయల్లో కనీసం రెండ్రూపాయలైనా తగ్గించుకుంటే అది మరొకరికి ఆసరా అవుతుంది’’ అంటారాయన. ముఖ్యంగా సంపన్నవర్గాలు, వ్యాపార వేత్తలకు ఆయనిచ్చే సూచన ఇది. ఆచరణాత్మకమైన ఆలోచనే!
 
- దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement