Vasudha Foundation
-
వృద్ధులకు ఉచితంగా ఆశ్రయం
కడుపున పుట్టిన బిడ్డలపై తల్లిదండ్రులకు చనిపోయేంత వరకూ వాత్సల్యం పోదు.. కానీ పిల్లలకు అలా కాదు.. నేటి తరానికి అయితే మరీనూ.. ఉద్యోగంలో బిజీ అనో.. ఎంతోదూరంలో ఉన్నామనో.. ఫ్యామిలీలో సమస్యలనో.. ఆర్థికంగా ఇబ్బందులనో.. తల్లిదండ్రులపై నిర్లక్ష్యం వహిస్తున్నారు.. అమ్మనాన్నలను అనాథలను చేస్తున్నారు.. కొందరైతే సంతానం లేక.. ఆదరించే వారు లేక ఒంటరిగా మిగులుతున్నారు.. అలా ఆదరణ కోల్పోయిన వృద్ధులను ఎంతో వాత్సల్యంతో అక్కున చేర్చుకుంటోంది పాలకోడేరు మండలం గరగపర్రులోని వసుధ వాత్సల్య నిలయం. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. సాక్షి, భీమవరం: ఉభయ తెలుగురాష్ట్రాల్లో డబ్బులు తీసుకుని వృద్ధులను ఆదరించేందుకు అనేక ఆశ్రమాలున్నాయి. ఇటువంటి ఆశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్న వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన రామలింగరాజు పాలకోడేరు మండలం గరగపర్రు గ్రామంలో వసుధ వాత్సల్య నిలయం పేరుతో ఉచిత అనాథాశ్రమాన్ని ఏర్పాటుచేశారు. సంవత్సరాలు తరబడి ఎంతో శ్రద్ధతో దీనిని నిర్వహిస్తున్నారు. భీమవరం పట్టణానికి కేవలం 8 కిలోమీటర్ల దూరంలోని గరగపర్రు గ్రామంలో సుమారు 6 ఎకరాల విస్తీర్ణంలో విశాలమైన భవంతులు నిర్మించి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆశ్రయం కల్పిస్తున్నారు. అనేక రాష్ట్రాల్లో.. 2002లో వసుధ ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఉభయ తెలుగురాష్ట్రాలతో పాటు రాజస్తాన్, మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాల్లో 46 సేవా సంస్థలను ఏర్పాటు చేసి కుల,మత భేదాలకు తావులేకుండా ఎంతోమంది అభాగ్యులకు సేవలందిస్తున్న రామలింగరాజు స్వగ్రామం గరగపర్రు. అందుకే ఆయన స్వగ్రామంలోనూ వసుధ వాత్సల్య నిలయం ఏర్పాటు చేశా>రు. విశాలమైన ప్రదేశంలో పరిశుభ్రమైన వాతావరణంలో నిర్వహిస్తోన్న ఈ ఆశ్రమంలో ప్రస్తుతం వివిధ ప్రాంతాలకు చెందిన 40 మంది వృద్ధులు, 10 మంది విద్యార్థులూ ఉన్నారు. వీరికి ఉచిత భోజనం, వసతి, వైద్యం అందించడమేగాక విద్యార్థులకు ఉచితంగా విద్యనందిస్తున్నారు. విద్యార్థుల్లో కొంతమంది అంధ విద్యార్థులు కూడా ఉన్నారు. వీరందరికీ వేళకు భోజనం పెట్టడమేగాక వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని నిత్యం వైద్యసేవలందే ఏర్పాటు చేశారు. వృద్ధుల్లో ఓపిక ఉన్నవారు మాత్రం కాలక్షేపం కోసం మొక్కలకు నీరు పోయడం వంటి చిన్నచిన్న పనులు చేస్తుంటారు. నా అన్నవాళ్లు లేకనే.. నా భర్త నాగిరెడ్డి కౌలు వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. పిల్లలు కూడా చనిపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్న నన్ను వసుధ వాత్సల్య నిలయం ఆదుకుంది. నాలుగేళ్లుగా ఇక్కడ ఉంటున్నా, కన్నబిడ్డల కంటే ఎక్కువగా ఏ కష్టం లేకుండా చూస్తున్నారు. – కొవ్వూరి చెల్లాయమ్మ, పెంటపాడు పనిచేసే ఓపిక లేక.. నా వయస్సు 65 ఏళ్లు. కులవృత్తి చేనేతతో నాభర్త వీరాస్వామి కంటికి రెప్పలా నన్ను చూసుకునేవారు. సంతానం లేదు. ఆయన మరణంతో కొంత కాలం ఇళ్లల్లో పాచి పనిచేసి జీవనం సాగించాను. పనిచేసే ఓపిక నశించి గ్రామస్తుల సలహాతో వాత్సల్య నిలయంలో చేరాను. ప్రస్తుతం ఇక్కడ సంతోషంగా గడుపుతున్నాను. – వింజమూరి విజయలక్ష్మి, ఉండి గ్రామం ఏ లోటు లేకుండా ఆనందంగా.. భార్య, బిడ్డలు దూరం కావడంతో 80 ఏళ్ల వయస్సులో ఒంటరి జీవితం గడపడం దుర్భరంగా మారింది. బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న తరుణంలో ఆత్రేయపురం వసుధ ఫౌండేషన్ కార్యకర్తలు వసుధ వాత్సల్య నిలయానికి పంపించారు. ఏ లోటు లేకుండా అందరితో ఆనందంగా గడుపుతున్నా. – వేగేశ్న సత్యనారాయణరాజు, ఆత్రేయపురం, తూర్పుగోదావరి జిల్లా ఎంతో ఆదరణతో చూస్తున్నారు నా వయస్సు ప్రస్తుతం 75 ఏళ్లు. నన్ను ఆదరించేవారెవరూ లేరు. పనిచేసే ఓపిక లేదు. అగమ్యగోచరంగా జీవితం. ఇటువంటి తరుణంలో 4 సంవత్సరాల క్రితం ఆశ్రమంలో చేరా. రామలింగరాజు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ ఎంతో ఆదరణతో చూస్తున్నారు. భగవంతుని ధ్యానిస్తూ ఆనందంగా జీవిస్తున్నాను. – కలికి సుబ్బారావు, చిలకంపాడు అనాథలను ఆదుకోవాలనే.. వసుధ ఫౌండేషన్ ద్వారా అనేక రాష్ట్రాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అనేక చోట్ల వృద్ధాశ్రమాలకు ఆర్థిక సహాయం అందిస్తున్నా. సొంతంగా ఆశ్రమం నిర్వహించాలనే సంకల్పంతో 12 ఏళ్ల క్రితం 25 మందితో ఆశ్రమం ప్రారంభించి ప్రస్తుతం 40 మందితో నిర్వహిస్తున్నాం. ఎటువంటి ఆదరణకు నోచుకోని వారిని ఆదరించాలనే సంకల్పంతోనే వృద్ధాశ్రమం ఏర్పాటుచేశాం. – మంతెన రామలింగరాజు, వసుధ ఫౌండేషన్ చైర్మన్ -
నోటు పుస్తకాల పంపిణీ
జైనథ్ : మండలంలోని కౌఠ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో వసుధా ఫౌండేషన్ ఆధ్వర్యంలో శనివారం విద్యార్థులకు ఉచితంగా నోటుపుస్తకాలను అందజేసారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాద్యాయు విశ్వనాథ్ రెడ్డి, 52మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు చొప్పున నోటు పుస్తకాలు అందజేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు వసుధా ఫౌండేషన్ అధ్వర్యంలో ప్రతీ ఏట ఉచితంగా నోటు పుస్తకాలు అందజేయడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు రుక్మన్న, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
ఆడంబరాలు తగ్గించి... ఆపన్నులకు ఆసరాగా...
మంతెన వెంకటరామరాజు... పారిశ్రామిక వేత్త అని చెబితే వెంటనే గుర్తొస్తారో లేదో కానీ ‘వసుధ ఫౌండేషన్’ రామరాజు అంటే చాలామందికి గుర్తొస్తారీయన. హైదరాబాద్‌లో ‘వసుధ ఫార్మా లిమిటెడ్’ పేరుతో బల్క్ డ్రగ్ యూనిట్ నిర్వహిస్తున్నారు. వసుధ ఫౌండేషన్ పేరుతో సేవా కార్యక్రమాలు నడుపుతున్నారు. కాళ్లు లేని పిల్లాడిని ఎత్తుకుని వచ్చిన తల్లితండ్రులకు వైద్యానికి సహాయం చేస్తారు. చదువుకోవడానికి డబ్బుల్లేవని వస్తే పుస్తకాలు కొనిస్తారు. నాకీ కష్టం అని వచ్చిన వారెవరినీ ఊరికే పంపించరు. అయితే ఆ కష్టం నిజమైనదా కాదా అని మాత్రం పరిశీలిస్తారు. ఇలా ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తుంటారు. కానీ ఈ మధ్య ఆయన తలసీమియా వ్యాధిగ్రస్థుల చికిత్స కోసం కోటి రూపాయల విరాళం ప్రకటించడం వార్తల్లో విషయమైంది. మీడియాకు ఎప్పుడూ దూరంగా ఉండే రామరాజును కలిసినప్పుడు స్ఫూర్తిదాయకమైన అనేక విషయాలను చెప్పారాయన. ‘‘జీవితంలో స్థిరపడడానికి మనకు నచ్చిన రంగాన్ని కానీ అవకాశాలు వచ్చిన రంగాన్ని కానీ ఎంచుకుంటాం. అలా నాకు నచ్చిన కోర్సు చదువుకున్నాను. అదే రంగంలో ఉద్యోగంలో చేరాను. నాకంటూ ఉన్న లక్ష్యాల కోసం సొంతంగా పరిశ్రమను స్థాపించాను. అయితే పరిశ్రమను లాభాల బాటలో నడిపించడం అంటే... స్థాపించినంత సులువు కాదని చాలామంది వ్యాపారవేత్తలకు వచ్చినట్లే నాకూ అనుభవంలోకి వచ్చింది. అనుభవం నేర్పిన పాఠాలే లాభాలకు పెట్టుబడి అయ్యాయి. ఇప్పుడు మా కంపెనీ 45 దేశాలకు బల్క్ డ్రగ్‌ను ఎగుమతి చేస్తోంది. నా వ్యాపార పరుగులో కొంత ఊపిరి తీసుకునే వెసులుబాటు వచ్చింది. నా పిల్లలిద్దరూ పెద్దయ్యారు. నేను వెనక్కి చూసుకోవడానికి కొంత విరామం దొరికింది. వ్యాపారపరంగా ఎన్నో దేశాల్లో పర్యటిస్తుంటాను. అక్కడ ఉన్నన్ని అవకాశాలు మన దగ్గర కూడా ఉంటే ఎంతో మంది రాణిస్తారనిపించేది. దాంతో నేను చేయగలిగిందేదో చేస్తూ తృప్తి పడుతున్నాను. నేనిది చేశాను అని చెప్పుకోవడం నాకిష్టం ఉండదు. అందుకే ఎప్పుడూ ప్రసారమాధ్యమాల్లో కనిపించను’’ అన్నారు రామరాజు. ఇంతకీ అసలేం జరిగిందంటే... రత్నావళి అనే మహిళ తరచూ ఆఫీసుకొచ్చి తలసీమియా పేషెంట్ల గురించి చెప్పేవారు. ఒకరోజు రామరాజు హైదరాబాద్ నగరంలో చార్మినార్ ప్రాంతంలోని తలసీమియా అండ్ సికిల్‌సెల్ సొసైటీకి వెళ్లారు. అక్కడి సన్నివేశం ఎవరినైనా ఇట్టే కదిలించేటట్లు ఉంటుంది. వెంటనే అక్కడికక్కడే ఆయన కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించారు. ‘‘అక్కడికి వెళ్లిన తర్వాత నా గుండె కలచివేసినంత పనైంది. ఏ పాపమూ ఎరుగని అమాయకులు. ఇంత తీవ్రమైన వ్యాధి ఎందుకు వచ్చిందో వారికి తెలియదు. తల్లిదండ్రుల పరిస్థితి మరీ దయనీయం. అంతంత దూరాల నుంచి పిల్లల్ని తీసుకుని రావడానికి దారి ఖర్చులకే డబ్బులేని వారే అందరూ. ఇక చికిత్స కోసం రక్తం ఎక్కడ కొనగలరు. వారికి ఆర్థిక వెసులుబాటు కల్పిస్తే దాతల కోసం వెతుకులాట తప్పుతుంది కదా అని అంత మొత్తాన్ని ఇచ్చాను’’ అన్నారాయన. ‘‘ప్రతి ఒక్కరూ తాము సంపాదించిన డబ్బులో అవసరాలకు పోగా మిగిలిన దాంట్లో ఆడంబరాలు, సౌకర్యాల కోసం కొంత వాటా ఉంటుంది. తమ సరదా కోసం ఖర్చు చేసే పదిరూపాయల్లో కనీసం రెండ్రూపాయలైనా తగ్గించుకుంటే అది మరొకరికి ఆసరా అవుతుంది’’ అంటారాయన. ముఖ్యంగా సంపన్నవర్గాలు, వ్యాపార వేత్తలకు ఆయనిచ్చే సూచన ఇది. ఆచరణాత్మకమైన ఆలోచనే! - దుగ్గింపూడి శ్రీధర్‌రెడ్డి, సాక్షి, హైదరాబాద్ -
‘సాక్షి’కి కృతజ్ఞతలు
ప్రాణభిక్ష పెట్టండి కథనానికి స్పందన సహాయం చేసిన దాతలు మరికొందరు సహాయం చేస్తామని ప్రకటన మర్రిపాలెం : తమ పిల్లల ఆరోగ్యం కోసం సహాయం చేయాలని తల్లిదండ్రులు చేసిన విజ్ఞప్తికి దాతలు స్పందించారు. ఈ నెల 3న ‘సాక్షి’లో ప్రచురితమైన ‘ప్రాణభిక్ష పెట్టండి’ కథనంతో ఆర్థిక సహాయం కోసం చేసేందుకు ముందుకు వచ్చారు. మరికొందరు సహాయం చేస్తామని ప్రకటించారు. వసుధ పౌండేషన్ రూ.10,000, శ్రీ సంపత్ వినాయక వృద్ధాశ్రమం (వనప్రస్థ) రూ.5,450, రాజీవ్ ఇన్స్టిట్యూట్ మద్దిలపాలెం రూ.3,060, మరో ఎనిమిది మంది దాతల నుంచి రూ.500, రూ.1,000, రూ.2,000 ఇలా మొత్తంగా రూ.30 వేల ఆర్థిక సహాయం అందినట్టు తల్లిదండ్రులు కోటేశ్వరరావు, వరలక్ష్మి చెప్పారు. గురువారం కంచరపాలెం పోలీస్‌స్టేషన్‌లో సీఐ ఇమ్మానుయేలురాజు ద్వారా ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలిపారు. ఓ కేసు విషయమై విచారణ కోసం వరలక్ష్మిని ఎస్ఐ సతీష్‌కుమార్ పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. తన పిల్లల అనారోగ్యం విషయాన్ని ఎస్ఐకు ఆమె తెలియజేశారు. ఆయన చొరవతో వరలక్ష్మి దంపతులు ‘సాక్షి’ని ఆశ్రయించారు. ‘సాక్షి’లో వచ్చిన కథనంతో దాతలు స్పందించి సహాయం చేయడాన్ని సీఐ ఇమ్మానుయేలురాజు ప్రత్యేకంగా అభినందించారు. విచారణ కోసం వచ్చిన మహిళకు పోలీసుల ద్వారా సహాయం లభించడం హర్షణీయమని తెలిపారు.